Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Wednesday, July 16
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    Chunduru Police Station Movie Review: చుండూరు పోలీస్ స్టేషన్ రివ్యూ! {3/5}

    By Telugu GlobalApril 26, 20247 Mins Read
    Chunduru Police Station Movie Review: చుండూరు పోలీస్ స్టేషన్ రివ్యూ! {3/5}
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    చిత్రం: చుండూరు పోలీస్ స్టేషన్

    రచన – దర్శకత్వం : మార్టిన్ ప్రకట్

    తారాగణం : కెంచకో బొబన్, జోజు జార్జి, నిమీషా సజయన్, యమ గిల్గమేష్, జాఫర్ ఇడుక్కి తదితరులు

    రచన : షాహీ కబీర్, సంగీతం : విష్ణు విజయ్, ఛాయాగ్రహణం : షైజు ఖాలిద్

    బ్యానర్ : గోల్డెన్ కాయిన్ మోషన్ పిక్చర్, మార్టిన్ ప్రకట్ ఫిలిమ్స్

    నిర్మాతలు : రంజిత్, పి ఎం శశిధరన్, మార్టిన్ ప్రకట్

    విడుదల : ఏప్రిల్ 26, 2024 (ఆహా ఒటీటీ)

    రేటింగ్: 3/5

    2021 లో మలయాళంలో సూపర్ హిట్టయిన పోలీస్ థ్రిల్లర్ ‘నాయాట్టు’ 2023 లో శ్రీకాంత్ తో తెలుగులో ‘కోటబొమ్మాళి పీఎస్’ గా రీమేకైన విషయం తెలిసిందే. ఇది ఆహా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అయింది. పోతే, ఇప్పుడు ఒరిజినల్ ‘నాయాట్టు’ తెలుగులో డబ్బింగ్ అయి అదే ఆహాలో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీని టైటిల్ ‘చుండూరు పోలీస్ స్టేషన్’. అసలు మలయాళ ఒరిజినల్ లా తెలుగు రీమేక్ వుండాలని లేదు. తెలుగు రీమేక్ తెలుగు ప్రేక్షకుల అభిరుచుల ప్రకారం వుంటుంది. మరి మలయాళ ఒరిజినల్ ఎలా వుంది? తెలుగు రీమేక్ లో లేని దేశవాళీతనం మలయాళ ఒరిజినల్లో ఎలా వుంది? నిజ జీవితానికి ఎంత దగ్గరగా వుంది? ఇది జీవితం చూస్తున్నట్టు వుంటుందా, సినిమా చూస్తున్నట్టు వుంటుందా? ఇవి తెలుసుకుందాం…

    కథ

    ప్రవీణ్ మైకేల్ (కొంచాకో బొబన్) కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరతాడు. అదే స్టేషన్లో సునీత (నిమీషా సజయన్) పని చేస్తూంటుంది. అక్కడే మణి (జోజు జార్జి) ఏఎస్సైగా వుంటాడు. సునీత, మణి దళితులు. మణి కూతురికి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తూ ఆమె అందులో పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ వుంటాడు. ఒక రోజు సునీత బంధువు, దళిత పార్టీ కార్యకర్త పోలీస్ స్టేషన్లో బీభత్సం సృష్టిస్తాడు. ఏఎస్సై మణి అతడ్ని లాకప్ లోవేస్తే ఫోన్లు చేయించుకుని విడుదలై పోతాడు. పార్టీ కార్యకర్తలు పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు.

    ఇంకో రోజు మణి, ప్రవీణ్ లు ఒక పెళ్ళికి హాజరై బాగా తాగుతారు. జీపు డ్రైవ్ చేయడానికి మణి మేనల్లుడు రాహుల్ ని తెచ్చుకుంటాడు. అదే జీపులో సునీత ఎక్కుతుంది. దారి మధ్యలో యాక్సిడెంట్ జరుగుతుంది. జీపు డ్రైవ్ చేసిన రాహుల్ జీపు వదిలేసి పారిపోతాడు. ఆ యాక్సిడెంట్ లో దళిత పార్టీ కార్యకర్త చనిపోతాడు. దీంతో దళిత ఆందోళన చెలరేగుతుంది. ఆ నియోజక వర్గంలో త్వరలో ఉప ఎన్నిక వుంది. 50 వేల దళిత ఓట్లున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాక్సిడెంట్ చేసిన పోలీసు సిబ్బందిని వెంటనే అరెస్ట్ చేయమని ఆదేశిస్తాడు ముఖ్యమంత్రి (జాఫర్ ఇడుక్కి).

    దీంతో ప్రవీణ్, మణి, సునీత ముగ్గురూ పరారవుతారు. వాళ్ళని పట్టుకోవడానికి ఎస్పీ అనూరాధ (యమ గిల్గమేష్) తో టీంని నియమిస్తాడు డిజిపి. వేట మొదలవుతుంది. దొరక్కుండా ప్రదేశాలు మారుస్తూ పరారీలో వుంటారు పోలీసులు ముగ్గురూ. ఇలా ఎక్కడిదాకా ఎంతకాలం పరుగుదీశారు? అనూరాధ టీం వాళ్ళని పట్టుకోగలిగిందా? మధ్యలో తలెత్తిన వూహించని పరిణామమేమిటి? చేయని నేరానికి నేరస్థులుగా ముద్రపడిన పోలీసులు ముగ్గురూ, ముఖ్యమంత్రి ఓట్ల రాజకీయానికి కెలా బలయ్యారు? … ఇదీ మిగతా కథ.

    ఎలా వుంది కథ

    ఇది 2011 లో కేరళలో జరిగిన ఉదంతం. నల్గురు పోలీసులు ఒక టాక్సీలో పెళ్ళికి వెళ్ళి వస్తూంటే యాక్సిడెంట్ జరిగి ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆగ్రహం పెల్లుబికింది. ఆ నల్గురు పోలీసుల మీద ఎస్సీ /ఎస్టీ చట్టం కింద, హత్య కేసు కింద అరెస్టు చేయమని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నల్గురూ అజ్ఞాతంలో కెళ్ళిపోయి బెయిల్ కోసం ప్రయత్నించారు. 100 రోజుల తర్వాత సుప్రీం కోర్టులో బెయిలు లభించింది. ఇప్పుడు 13 ఏళ్ళు గడిచిపోయినా కేసు అతీగతీ లేదనేది వేరే సంగతి.

    ఈ ఉదంతాన్ని తీసుకుని సినిమా కనుగుణంగా కల్పన చేశాడు రచయిత షాహీ కబీర్. ఈయన సెలవులో వున్న పోలీసుద్యోగి. పోలీసు శాఖ పనితీరు ప్రత్యక్షంగా తెలుసు గనుక ఆ అనుభవంతో ప్రొఫెషనల్ గా రచన చేశాడు. పాలకులు తమ రాజకీయావసరాల కోసం అవసరమైతే పోలీసుల్ని సైతం ఎలా బలి చేయగలరో చెప్పాలనుకున్నాడు రచయిత.

    ఇది మ్యాన్ హంట్ థ్రిల్లర్ జానరైనా, రెగ్యులర్ కమర్షియల్ హీరోయిజంతో వుండదు. హీరోయిజం లేని రియాలిస్టిక్ అప్రోచ్ తో వుంటుంది. నేరంలో ఇరుక్కున్న హీరో అసలైన నేరస్థుణ్ణి పట్టుకుని నిర్దోషిగా బయటపడే రొటీన్ టెంప్లెట్ ని బ్రేక్ చేసి, కమర్షియల్ సినిమా ఇలా కూడా తీయవచ్చని పరిస్థితి- పాత్ర సంబంధాన్ని తారుమారు చేసి చూపించాడు. నిజ జీవితంలో చూస్తే, పరిస్థితిని జయించే హీరోయిజాలు మాత్రమే వుండవు. ఆ హీరోయిజాలు పరిస్థితుల్ని ఎదుర్కొలేని నిస్సహాయ స్థితీ కూడా వుంటుంది. ఈ నిజాన్నే చిత్రించాడు. సినిమాగా ‘నాయాట్టు’ (వేట) ని చూస్తే ఇది కథలా వుండదు. జీవితంలో అరుదుగా తప్ప కథలుండవు, గాథలే వుంటాయి. గాథల్ని సినిమాలుగా తీస్తే ఆడవు గనుక కథగా మార్చి తీస్తారు. ఐతే గాథలా వున్న నిజ సంఘటనని అనుకోకుండా గాథగానే తీసి విజయం సాధించారు ‘నాయాట్టు’ తో. ఇదే దీని ప్రత్యేకత.

    అయితే దళిత కోణంలో చేసిన ఈ గాథ కాన్సెప్ట్ పరంగా డొల్ల అని మాత్రం చెప్పక తప్పదు. ఎత్తుకున్న దళిత కోణాన్ని నిజాయితీగా చెప్పలేక అపహాస్యం చేసిన వరస కన్పిస్తుంది. గాథ అయివుండీ, యాంటీ క్లయిమాక్సుతో మ్యాన్ హంట్ థ్రిల్లర్ గా నిలబడిన రచన, కాన్సెప్ట్ పరంగా చొరవ చూపలేక చతికిల బడిందని ఒప్పుకోవాలి.

    నటనలు – సాంకేతికాలు

    తారాగణంలో ఎక్కువగా గుర్తుండి పోయే నటన ఎస్పీ అనూరాధగా నటించిన యమ గిల్గమేష్ ది. ఇంతకంటే అచ్చం రియలిస్టిక్ నిజ జీవిత పోలీసుని అనుకరించి నటించడం చూడం. కమర్షియల్ పోలీసు పాత్రల్లా క్రూరత్వంతో కేకలేస్తూ విరుచుకుపడే ఓవరాక్షన్ కాదు. అసలు క్రూరత్వముండదు, విరుచుకు పడడముండదు. ఆమె ఫేసు చూస్తేనే పోలీసు ఫేసు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కేరళకి చెందిన ఆర్టిస్టు. రియలిస్టిక్ సినిమాల్లో నటించే కమర్షియల్ ఆర్టిస్టులు రియలిస్టిక్ నటన ఈమెని చూసి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈమె కేసులో ఇరుక్కునేలా డిజిపి బ్లాక్ మెయిల్ చేసేప్పుడు ఈమె కనబర్చే రియాక్షన్, ముగింపులో ‘నిందితుల్ని’ కోర్టుకి తరలిస్తున్నప్పుడు గిల్టీగా చూసే చూపూ మరువ లేనివి. యమ రియలిస్టిక్ ఈమె.

    కొంచాకో బొబన్ పూర్తిగా పోలీసు పాత్రని డౌన్ ప్లే చేశాడు. అతను కొత్తగా పోలీసు శాఖలో చేరాడు గనుక సిన్సియర్ గా పనిచేయాలని భావించి కష్టాల్లో పడతాడు. ఈ విషయం దగ్గరే ఇతడికీ, ఏఎస్సై మణి పాత్ర నటించిన జోజు జార్జికీ పడదు. అలాగే ఇంకో పోలీసు సునీతగా నటించిన నీమీషా సజయన్, చివర్లో జోజు జార్జి పట్ల విధేయతతో, ‘మానాన్న నేరస్థుడు’ అనే దుఖభారం అతడి కూతురి కుండ కూడదన్న భావంతో, తను బలి అవడానికి సిద్ధపడుతూ చెప్పే మాటలు పాత్రని పై స్థాయికి తీసికెళ్తాయి. నైతిక విజయమంతా ఈ బాధిత పోలీసుల వైపే వుంటుంది. అయినా వీళ్ళ బ్రతుకులు ఓట్ల రాజకీయాలు చేసే నేతల/ అధికారుల చేతుల్లో నే వుంటాయి.

    ఏఎస్సైగా జోజు జార్జి పాత్రకీ పరిపూర్ణత వుంది- అది విషాదాంతమైనా. తను నేరస్థుడు కాదని కూతురికి నిరూపించేందుకు వున్న ఒకే ఒక్క మార్గాన్ని అనుసరించడం వల్ల ఈ విషాదాంతం. ఇంకా ఇలా చట్టానికి దొరక్కుండా పారిపోతూ వుండడం నిర్దోషిత్వాన్ని నిరూపించదు. లొంగి పోవడమూ నిరూపించదు. అయితే ఒక పని చేయవచ్చు. సహజమైన ఆ పని చేయకపోవడం పాత్ర చిత్రణ లోపమే. నేర కథ లాజికల్ గా, లోప రహితంగా వుండాల్సిన అవసరముంది.

    మరి ఈ గాథలో ‘విలన్’ ఎవరు? ముఖ్యమంత్రే. ఈ పాత్రలో జాఫర్ ఇడుక్కి విలన్ లక్షణాలు ప్రదర్శించకుండా కూల్ గా వుంటాడు. క్యాజువల్ గా ఓట్ల మీద దృష్టితో ఒక్కో ఆదేశం ఉలిక్కిపడేలా ఇస్తూంటాడు. రేపే పోలింగ్ అన్నప్పుడు డిజిపి రిస్కు తీసుకుని రచించే ఫేక్ డ్రామా, పోలింగ్ అయ్యాక బెడిసి కొడితే, ఓట్లు పడ్డాక నువ్వెలా చస్తే నాకేంటనే ధోరణిలో డీజీపీనే ఇరికిస్తూ చేతులు దులుపుకునేలాంటి – కూల్ నెస్ మాటున కరుడుగట్టిన క్రూర మనస్తత్వ ప్రదర్శన ఇడుక్కి నటనని చెబుతుంది.

    ఇది మ్యాన్ హంట్ థ్రిల్లరైనా పాత్రలతో, నటనలతో చీకటి వెలుగుల హ్యూమన్ డ్రామా వల్ల దేశీయ జీవితం కన్పిస్తుంది. సాంకేతికంగా కూడా దేశీయ జీవితం కనబడుతుంది- ఫారిన్ లుక్ వుండదు. ఆర్గానిక్ గా వుంటుంది. కెమెరా ఫారిన్ దే కావచ్చు, దాని పనితనం దేశీయ పౌరసత్వం తీసుకుంది. దీంతో ఫారిన్ సినిమా చూస్తున్నట్టుగాక (థ్రిల్లర్ అనగానే ఫారిన్ సినిమా అన్పించేలా చుట్టేయక పోతే మనసూరుకోదు) మన ప్రాంతపు జీవితం చూస్తున్నట్టే వుంటుంది.

    నేపథ్య సంగీతం, సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కడ ఎలా ఎప్పుడు, ఎంత మేర వాడితే మిస్టీరియస్ ఫీలింగ్ క్రియేటవుతుందో- అక్కడ అలా అప్పుడు, ఆ మేర వాడి ఫలితాల్ని సాధించారు. ఈ థ్రిల్లర్ ఆడియో థీమ్ ఒకటే : మిస్టరీ ఫీల్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని మిస్టీరియస్ వాతావరణం ఇమిడి వుండడంతో. గాథకి మిస్టీరియస్ ఫీలే కదా వుండాలి.

    చివరి కేమిటి

    దొంగని పోలీసులు వేటాడ్డం అలవాటైన ఫార్ములా అయితే, పోలీసుని పోలీసే వేటాడ్డం యాంటీ ఫార్ములా. అయితే చట్టం తప్పిన పోలీసుల్ని పోలీసులు వేటాడ్డం వేరు. మంచి పోలీసుల్ని పోలీసులు వేటాడి బలిపశుల్ని చేయడం పూర్తిగా వేరు. జరిగిన ఉదంతాన్ని ఉదంతం లాగే తీస్తే కథ అన్పించుకోదు. బలిపశువులున్న ఒక ఉదంతాన్ని వీరత్వమున్న ముగింపుగా మార్చి తీస్తే ఓవరాక్షన్ అన్పించుకుంటుంది. ఉదంతంలోని సారాన్ని సారం లాగే వుంచి, బాధిత పాత్రల్ని బాధితులుగానే కొనసాగించి, అది ఏ న్యాయాన్యాయాల్ని చెబుతోందో, దాన్ని ప్రేక్షకుల చర్చకి వదిలేయడం కథ కాకపోవచ్చు గానీ, గాథ అవుతుంది. గాథల ముగింపులు ఆనందింప జేయవు, ఆలోచింప జేస్తాయి.

    అయితే కొన్ని ప్రధానమైన లాజికల్ (కామన్ సెన్సు) లోపాలు లేకపోలేదు. బాగా రాత్రి వేళ ముగ్గురు పోలీసులు జీపులో పోతున్నప్పుడు నిర్జన ప్రదేశంలో యాక్సిడెంట్ జరిగితే, ముగ్గురూ అక్కడ్నుంచి ఉడాయించి ఏమీ తెలియనట్టు వుండిపోవచ్చు. సన్నివేశం చూస్తూంటే ఇలా అన్పించేలానే వుంటుంది. మణి గాయపడ్డ వాడ్ని వదిలేసి పోదామనే అంటాడు. ప్రవీణ్ హాస్పిటల్ కి తీసికెళ్దామనే అంటాడు. ఇంతలో ఒక దళిత పార్టీ వాడు అటుగా పోతూ చూసేసరికి హాస్పిటల్ కే తీసికెళ్ళి ఇరుక్కుని, అక్కడ్నించి పారిపోతారు సునీత సహా. ఇలా ఈ ఘట్టంలో లోపాల్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు.

    జీపు డ్రైవ్ చేసింది మణి మేనల్లుడు రాహుల్. అతను పారిపోతాడు. అప్పుడు జీపుని హాస్పిటల్ కి ప్రవీణ్ డ్రైవ్ చేస్తాడు. చిట్ట చివరికి అరెస్టయ్యాక, జీపు డ్రైవ్ చేసింది రాహులని ప్రవీణ్ అంటే, స్టీరింగ్ మీద ప్రవీణ్ వేలిముద్రలున్నాయని పై అధికారి నోర్మూయిస్తాడు. జీపుని ప్రవీణ్ హాస్పిటల్ కి డ్రైవ్ చేస్తే, రాహుల్ వేలిముద్రలు చెడిపోయి, ప్రవీణ్ వేలి ముద్రలే పడతాయన్న లాజిక్ ని తీసి అవతల పెట్టేశారు.

    ఇక చివర్లో మణి కూడా చేయాల్సిన అసలు పని చేయకుండా, కూతురికి వీడియో పెట్టి కథ ముగించడం కూడా లాజిక్ కి అడ్డుపడే వ్యవహారమే. అసలు జరిగింది విన్నవించుకుంటూ అతను సోషల్ మీడియాలో గనుక వీడియో పెట్టి వుంటే, అది వైరల్ అయి ప్రజా మద్దతు దండిగా లభించే అవకాశముండేది.

    ఇక మ్యాన్ హంట్ థ్రిల్లర్ జానర్ గాథగా, కొన్ని లోపాలతో చీకటి వెలుగుల హ్యూమన్ డ్రామాగా ఇది థ్రిల్ చేసే మాట నిజమే. అయితే కాన్సెప్ట్ పరంగా అసందర్భంగా వుంది. దళిత కాన్సెప్ట్ తీసుకుని అర్ధం లేని గాథ చేశారు. దళిత వర్సెస్ దళిత వర్సెస్ దళిత అన్నట్టు పాత్రల్ని ఎడాపెడా వాడేశారు. యాక్సిడెంట్ చేసిన పోలీసుల్లో ఇద్దరు దళితులు, యాక్సిడెంట్ లో చనిపోయిన వాడూ దళితుడు, యాక్సిడెంట్ చేసిన దళితులున్న పోలీసుల్ని పట్టుకోవాలని రచ్చ రచ్చ చేసేదీ దళిత పార్టీ! ఇలావుంది బలాబలాల సమీకరణ. ఒక సామాజిక వర్గం మీద అదే సామాజిక వర్గాన్ని ప్రయోగిస్తే సామాజిక వర్గ గాథ అవుతుందా? తమ వాణ్ణి యాక్సిడెంట్ చేసి చంపిన తమ సామాజిక వర్గపు పోలీసుల్ని పోలీసులు పట్టుకుంటే, హుర్రే అని అదే సామాజిక వర్గం అధికార పార్టీకి ఓట్లు గుద్దేసి గెలిపించేస్తుందా?

    ఏం చెప్పాలనుకున్నారు? దళితులు వర్సెస్ దళితేతరులుగా విజాతి బలాబలాల సమీకరణగా చేసి, ఈ గాథ ఎందుకు చెప్పలేక పోయారు? ఇదీ చివరికి మిగిలే ప్రశ్న. తెలుగు రీమేక్ లో కూడా ఈ తప్పు దిద్దుకోలేదు. 

    Chunduru Police Station,Nayattu Police Station
    Previous Articleకన్నడ క్రికెట్ దిగ్గజాలకు ఆ గౌరవం ఎప్పుడు?
    Next Article హంటర్ ఐలాండ్స్ గురించి తెలుసా? ఇదొక అంతుచిక్కని మిస్టరీ!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.