Telugu Global
Arts & Literature

రాత్రివేళల్లో పూజలందుకునే...వారాహి దేవత

వారాహి దేవి నవరాత్రులు ఈ నెల జూన్30 వ తారీకు నుండి మొదలవుతున్నాయి జులై 8 వ తారీకు తో ముగుస్తున్నాయి.

రాత్రివేళల్లో పూజలందుకునే...వారాహి దేవత
X

మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహినీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది.

దుష్టశిక్షణ కోసమూ, భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరైన వారాహి విశేషాలు...

వరాహుని స్త్రీతత్వం


పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు.

దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది.

రూపం


వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీరఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో... శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది.

ఆరాధన


తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజించడం కద్దు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి (ఒడిశా), వారణాసి, మైలాపుర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ.



సైన్యాధ్యక్షురాలు

లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ... తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం..


వారాహి దేవి నవరాత్రులు ఈ నెల జూన్30 వ తారీకు నుండి మొదలవుతున్నాయి జులై 8 వ తారీకు తో ముగుస్తున్నాయి.

శ్రీ మాత్రే నమః.

-డి.నాగలక్ష్మి

First Published:  30 Jun 2023 2:59 PM IST
Next Story