మాయ తొలగాలి (కవిత)
అల అనుకుంటుంది
తను వేరు , పక్క అల వేరు అని
పోటీ పడి లేస్తుంది
పక్క అల కంటే పైకి ఎగరాలని
ఎక్కడో దూర తీరాలకు వెళ్తుంది వెతుక్కుంటూ
వెతుకులాట దేనికో అసలు తెలీదు ,
అంతులేని ఆరాటం
పక్క అలని శక్తి లో మించి పోవాలని అలుపెరగని పరుగు
పక్క అలలు
పడి పోవడం చూస్తూనే ఉంటుంది
కొత్త అలలు పుట్టడం కూడా
తెలుస్తూనే వుంది
కానీ తను పడనని నమ్మకం ,
పడిన అలలు శక్తి లేక పడి పోయాయని మరొక నమ్మకం
అలలకు జన్మనిచ్చి
మరల తనలో కలుపుకొనే
ఆ అంబుధికి అంటవు ఇవి ఏవీ
పడి లేచే అలలు ,
అవి పడే ఆరాటం
అన్నీ చూస్తూనే ఉంటుంది
బ్రహ్మానందం తో
సాగరానికి ఎరుక
ఆలలను కమ్మిన “మాయ”
మాయ తొలగి ,
వేరే అలలు లేవని ,
తను ఏ అలతో
పోటీపడనక్కర లేదని
ఏ అలని ద్వేషించనక్కర లేదని , ఎక్కడికి ఏదో వెతుకుతూ
పరుగులు తీయనక్కర లేదని
తను తపన పడే ఆ పరమానందం తనలోనే వుందని ,
అది అనంత మైన సముద్రం అని
తను సముద్రం లో లేచిన
ఒక అల కాదని ,
తానే సముద్రం అని
ఏదో ఒక రోజు
ప్రతి అల తెలుసు కొని
సముద్రం గా నిండుగా
ఉండి పోతుందని ఆశ
ఆ దయా “సాగరునకు “ పెద్ద ఆశ
అలల “మాయ” తొలగాలని
ఆ పరమాత్మ ఆశ,
జీవుల “మాయ” తొలగాలని
-వి శ్రీనివాస మూర్తి
(హైదరాబాద్)