Telugu Global
Arts & Literature

సంధ్యా రాగం! (కథ)

సంధ్యా రాగం! (కథ)
X

"వెళ్లవయ్యా, ప్రతీరోజూ ఇదొక పెద్ద న్యూసెన్స్" అంటూ వాచ్మెన్ పార్కులోనించీ బయటకు తోస్తుంటే...

"అలా తొయ్యకు నేనే వెళతాను కదా!" అంటూ అభ్యర్దిస్తున్న స్వరం పరిచయమున్నట్టు అనిపించి, పళ్ళు కొంటున్న సత్య పరికించి చూసింది.

పెరిగిన గడ్డం, పైజమా లాల్చీ వేసుకున్న అతనిని చూస్తూ...నాలుగడుగులు అటువైపుగా వేసి తన అనుమానం నిజమేననిపించి దగ్గరగా వెళ్ళి...

"రాజూ, నువ్విక్కడ...?" అని పలకరించింది.

"ఏవమ్మా, ఈయన మీకు తెలుసునా? వారంబట్టీ రోజూ ఇక్కడకు వచ్చి సిగరెట్ తాగుతాడు, చదువుకున్న వాడిలా ఉన్నాడు. పబ్లిక్ ప్లేస్ లో పొగ తాగటం నేరమని తెలియదా?" అంటూ చిరాకుపడుతున్న వాచ్మెన్ మాటతో...

"రాజూ, అదే మా ఇల్లు. పద, వెళదాం" అంటూ మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా రాజు చేయిపట్టుకుని ఇంటికి తీసుకువెళ్లిన సత్య కాఫీ ఇస్తూ...

"సుధ, పిల్లలూ బాగున్నారా?" అంటూ ప్రశ్నించింది.

"సుధ, రెండు సంవత్సరాల క్రితం కేన్సర్ తో చనిపోయింది. నేను రిటైరైపోయాను. రిటైర్మెంట్ లో వచ్చిన డబ్బంతా సుధ ట్రీట్మెంట్ కోసం చేసిన అప్పు తీర్చటానికి సరిపోయింది. కొడుకులమీద ఆధారపడి బతుకుతున్నాను. సిగరెట్ తాగకుండా ఉండలేను. కోడళ్ళు ఇంట్లో సిగరెట్ తాగితే ఒప్పుకోరు. అందుకే, గుట్టుచప్పుడుగా ఎక్కడో ఒకచోట కూర్చుని నాలుగు సిగరెట్స్ తాగేస్తూ ఉంటాను" అంటూ పాఠం అప్పచెప్పినట్టు చెప్తున్న రాజుని చూస్తూ బరువెక్కిన మనసుని, తేలిక చేసే నెపంతో...

"రాజూ, మిరపకాయ బజ్జీలు చెయ్యనా?" అంది సత్య.

"నా ఇష్టాలు నీకింకా గుర్తున్నాయా?" అన్నాడు రాజు.

"మర్చిపోతే కదా!" అంటున్న సత్యమాటతో రాజు మౌనంగా ఉండిపోయాడు.

***

సుధ, సత్య, రాజూ ముగ్గురూ మంచి స్నేహితులు. సుధ, చదువులో కొంచం వెనకబడి ఉండేది. చదువు పూర్తయి గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడాలని కోరికతో వుండేవారు సత్య, రాజు. సుధమాత్రం డిగ్రీ పూర్తి అయిపోతే చాలు, అనుకునేది. చదువులో చురుకుగా ఉండే సత్య, రాజు వైపు ఆకర్షితురాలైంది. రాజుకి, ఈ విషయం అర్ధమై...

"ఏయ్, ముందు మనకి ఉద్యోగం రావాలి. చదువుమీద ధ్యాస పెట్టు" అంటూ మెత్తగా మందలించేవాడు.

చదువు పూర్తై ముగ్గురికీ బియే పట్టా చేతికి వచ్చింది. సుధ కాబోయే మొగుడికోసం కలలు కంటూ కాలం గడుపుతుంటే... సత్య, రాజు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరూ, ఉద్యోగాలకు అప్లికేషన్స్ నింపటానికి కలిసినప్పుడల్లా మిరపకాయ బజ్జీలు తింటూ... ఎలా చదివితే ఉద్యోగం వస్తుంది అనే మాట్లాడుకునేవారు. ఒకరోజు, సడెన్ గా సత్య...

"మనకి, అబ్బాయి పుడితే ఏం పేరు పెడదాము?" అంది.

సత్య మాటలు ముందు అర్థంకాక తెల్లమొహం వేసి... తరువాత సిగ్గుపడుతూ...

"ఆలీలేదూ, చూలూలేదు. కొడుకు పేరు సోమలింగం అనే సామెత నీకు సరిగ్గా సరిపోతుంది" అంటూ రాజు మొట్టికాయ వెయ్యగానే సిగ్గుపడటం సత్య వంతయింది.

రాజు, ఇంటి ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండేది. కొడుక్కి, దొరికిన కట్నంతో కూతురు పెళ్ళిచెయ్యాలని ఎదురుచూస్తున్నాడు తండ్రి. బంధువుల ఇంట్లో పెళ్ళిలో సుధ తండ్రి, రాజు తండ్రితో...

"మా అమ్మాయి పెళ్ళికి ఉంది. ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి" అనటం జరిగింది. వెంటనే రాజు తండ్రి...

"మా వాడే పెళ్ళికున్నాడు. చాలా తెలివైనవాడు. ఇంకా ఉద్యోగం రాలేదు" అంటూ బాధ పడుతుంటే...

"మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మీ అబ్బాయికి ఉద్యోగం వేయించుతాను. పది వేలు కట్నం ఇస్తాము. మీకు ఇష్టమైతే సంబంధం కలుపుకుందాము" అంటూ ఆడపిల్ల తండ్రి ముందుకు రావడం సంతోషంగా అనిపించింది.

రాజు, ఈ పెళ్ళికి ససేమిరా ఒప్పుకోలేదు. కట్నం తీసుకోవడం అస్సలు ఇష్టంలేదంటూ మొండికేసేడు. కొడుకు మాటలు విన్న తండ్రి...

"నువ్వు బాధ్యత లేని కొడుకువి, నీ వెనుక ముగ్గురు ఉన్నారు. తండ్రి కష్టపడి నీకు చదివించేడని విశ్వాసం లేదు" అని అరుస్తుంటే...బాధ అనిపించి తల వంచుకుని తల్లితండ్రుల వెంట పెళ్ళిచూపులకి వెళ్లాడు.

అక్కడ, పెళ్లికూతురు స్థానంలో సుధని చూసి తప్పు చేస్తున్న భావన మనసుని దహించి వేసింది. సత్యకి, తనకూ నడుమ ఉన్న అనుబంధం తెలియని సుధ, కల్మషం లేని మనసుతో ఆప్యాయంగా మాట్లాడుతూ...

"రాజూ, మనిద్దరి పెళ్ళివిషయం సత్యకి చెప్పద్దు. పెళ్ళిలో సర్ప్రైజ్ ఇద్దాము" అంటూ సంబరపడింది.

సుధ పెళ్ళికి వచ్చిన సత్య, జీవితమంతా ఎవరి అడుగులో అడుగు వేస్తూ నడవాలని కోరుకుందో అతను, మరొకరితో ఏడడుగుల బంధానికి ముడిపడుతుంటే... కంట్లో మసక బారిన నీటిని బయటకు రానివ్వకుండా జాగ్రత్తపడింది.

సూటిగా చూస్తున్న సత్య చూపులను తట్టుకోలేక తలదించుకున్న ప్రియుడిని, వదిలి వెళుతుంటే సుధ పరుగున వచ్చి...

"సత్యా, భోంచేసి వెళ్ళవే..." అంటూ ఆపుతుంటే...

"లేదు, రేపు నాకు ఎగ్జామ్ ఉంది. వెళ్ళాలి..." అంటూ వడివడిగా అక్కడినించి నిష్క్రమించింది.

మావగారు వేయించిన షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళి, వాళ్ళ పురుళ్ల బాధ్యతలు నెరవేర్చుకుంటూ... ఇద్దరు మగపిల్లలకు తండ్రయ్యాడు రాజు. అత్తమామల మెప్పుని పొందుతూ...భర్త అడుగుజాడలలో నడుస్తూ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతున్న సమయంలో అనారోగ్యం పాలైంది సుధ.

భార్యకు కేన్సర్ అని తెల్సి...

"ఎంత డబ్బైనా ఖర్చుపెట్టి నిన్ను బతికించుకుంటాను" అంటూ సుధకు ధైర్యం చెప్పి డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించేడు, అయినా సుధ దక్కలేదు.

తల్లి, చనిపోయిన వేళా విశేషమేమో... సుధ చనిపోయిన ఆరు నెలలలో ఇద్దరు కొడుకులకు సరైన ఉద్యోగాలు రావటం పెళ్ళిళ్ళు అవటం జరిగింది.

సుధ, చనిపోయాక సిగరెట్ తాగే అలవాటు రాజుకి ఎక్కువైంది. రిటైర్ అయిన తండ్రిని ఇద్దరు కొడుకులూ చెరొక ఆరునెలలు పంచుకున్నారు. ఆ ప్రయత్నంలోనే చిన్న కొడుకు దగ్గర వుంటూ సత్యకు ఎదురు పడ్డాడు రాజు.

***

"తీసుకో, వేడిగా వున్నాయి" అంటూ సత్య అందిస్తున్న ప్లేట్ చూస్తూ...

"రెండు చాలు" అన్నాడు.

"నీకు ఎన్ని కావాలో అన్నే తిను. నేనేమీ బలవంతం చెయ్యను" అంటూ నవ్వుతున్న సత్యను చూస్తూ...

' అదే నవ్వు, తనేమీ మారలేదు' అనుకుంటూ...

"మీ వారు, మీ పిల్లలూ...?" అంటూ సందిగ్ధంగా ఆగిపోయాడు.

సత్య చెరగని చిరునవ్వుతో...

"నువ్వు దూరమయ్యేక నేను ఏడుస్తూ కూర్చోలేదు. పరీక్షలు పాసై అనుకున్నది సాధించేను. అంచెలంచెలుగా ప్రమోషన్స్ తో తాసిల్దారుగా రిటైర్ అయ్యాను. నాకెప్పుడూ పెళ్ళి అవసరం అనిపించలేదు" అంటున్న సత్యను చూస్తూ...

"సత్యా, ఒక్క సిగరెట్ తాగుతాను ప్లీజ్" అన్నాడు.

"అప్పుడు, సిగరెట్ తాగే వాళ్ళ స్టైలే వేరు అన్నానని, సిగరెట్ తాగడం నేర్చుకున్నావు. ఇప్పుడు రిక్వెస్ట్ ఎందుకు?" అంటున్న సత్య మాటలకు రాజూ సిగ్గు పడుతూ...

"నేను వెళతాను" అంటూ లేచి నిల్చున్న స్నేహితుడిని బయట దాకా పంపి...

"రేపు వస్తావు కదా!" అంటూ అడుగుతున్న సత్యను చూస్తూ అడుగు ముందుకు వెయ్యాలని లేకపోయినా బయలుదేరాడు.

సత్యను, కలిసిన దగ్గరనుంచీ ఒంటరితనం దూరమై జీవితం రంగుల హరివిల్లులా మారింది రాజుకి. ప్రతీరోజూ సాయంత్రం సత్య ఇంటికి వెళ్లి ఎన్నో కబుర్లు చెప్పుకుని, అక్కడ నించీ రావాలని లేకపోయినా తప్పదని ఏ రాత్రికో ఇంటికి చేరుకునేవాడు.

మావగార్ని ఎప్పుడూ అభిమానంగా చూడని కోడలు, మావగారు సంతోషంగా కనిపించటం ఓర్చుకోలేక...

"చూసేరా! మీ నాన్నగారు టింగురంగా మంటూ తిరుగుళ్ళు" అంటూ మొగుడి చెవికొరకడం మొదలుపెట్టింది.

"ఆయనింట్లో ఉంటే ఓర్చుకోలేవు. అతనికి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడకు వెళ్ళనీ" అంటున్న మొగుడితో...

"ఆయనగారు వేసుకునే కొత్త బట్టలు ఎక్కడివి? ఈ కొత్త స్నేహాలు, కారులో షికార్లు మీరడుగుతారా? నన్నడగమంటారా?" అంటూ రెచ్చిపోతున్న భార్య నోరు మూయించటానికి...

"నేనే అడుగుతాను. నువ్వు ఊరుకో" అంటూ అప్పటికి భార్యని శాంతింపచేసాడు.

తన గదిలో మధ్యాహ్నం నిద్రకు ప్రయత్నిస్తున్న రాజుకి కోడలు, కొడుకు మాటలు వినిపించి మనసు మూలిగింది. 'సత్యను, చూడకుండా వుండాలంటే జరిగేపనికాదు ' అనుకుని సాయంత్రం సత్య ఇంటివైపు అడుగులు వేస్తున్న మావగార్ని, చులకన మాటలు అంటూనే వుందా కోడలు.

మౌనంగా ఉన్న రాజుని చూస్తూ...

"ఎందుకలా ఉన్నావు?" అంటూ ప్రశ్నించింది సత్య.

"నిన్ను చూసిన క్షణం నించీ నాకు కొత్త జీవితం ప్రారంభమైంది. రేపటినుంచి, ఆ సంతోషం ప్రాప్తం ఉండదేమో? నన్ను ఇక్కడనుంచి పెద్ద కొడుకు వద్దకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి" అంటూ బాధగా చెప్తున్న రాజు చెయ్యి పట్టుకుని...

"రాజూ, నన్ను పెళ్ళి చేసుకుంటావా?" అంటున్న సత్యను ఆశ్చర్యంగా చూస్తూ...

"ఈ వయసులో మనకు పెళ్ళా?" అన్నాడు రాజు.

"అవును, మనం కోరుకున్న వయసులో మనకు పెళ్ళి జరగలేదు. ఇప్పుడు చేసుకుంటే తప్పేంటి?" అంటున్న సత్య మాటలు రాజు మదిని సందడి చేశాయి. అవును తప్పులేదు అనుకుని సత్య చేతిని అందుకుని...

"ముహూర్తం ఎప్పుడూ?" అంటూ కళ్ళు ఎగరేసాడు.

"మనం, ఎప్పుడనుకుంటే అప్పుడే" అంటున్న సత్యతో నవ్వుతూ...

"ఆఖరు పరీక్ష రోజున హనీమూన్ ఎప్పుడూ అని అడేగేవు గుర్తుందా?" అని సంబరంగా రాజు గుర్తుచేస్తే ...

"బాబూ, మనది హానీమూన్ కి వెళ్ళి సోమలింగాన్ని కనే వయసు కాదుకానీ... తీర్థయాత్రలకు వెళ్ళి జ్యోతిర్లింగాలను చూసి వద్దాము" అంటూ నవ్వుతున్న సత్య మాటలకు సిగ్గుపడ్డాడు రాజు.

(పరిస్థితులు అనుకూలించక యుక్త వయసులో దూరమైన జంట, జీవన సంధ్యలో ఒకటై ఒంటరితనం పోగొట్టుకునే ప్రయత్నం)

- తెలికిచెర్ల విజయలక్ష్మి

First Published:  18 July 2023 5:56 PM IST
Next Story