Telugu Global
Arts & Literature

వనమాలీ !

వనమాలీ !
X

పసిబిడ్డ గా వున్నప్పుడే...

రాక్షస సంహారమా...

ఏవిటాసాహసం...!

గోవుల్నికాసేవు సరే..

గోపబాలురతో

చల్దులారగింపులా...

ఏవిటా కలుపుగోలుతనం...!

ఏం తక్కువని అందరింటా దూరి ,

వెన్న దొంగతనాలు చేసావు....

పైగాబడాయి బుకాయింపులా..

ఏవిటా అల్లరి దుడుకుతనాలు...!

పీతాంబరధారివి కదా..

చిలిపిగా

చీరలెత్తుకుపోవడమేంటి ...

..మోహవిఛ్ఛేదనమంటూ..

ఏవిటా తత్వోపదేశాలు..!

వెదురు వేణువు చేసావా..

మధురంగా వేలవేల రాగాలాపనలా...

గోపికాంగనలంతా..గోముగా..

ఆకర్షితులయ్యారా..

వెన్నెలవెలుగుల్లో ..

పున్నాగపూలతోటల్లో ..

యమునానది తీరాల్లో..

బృందావన భువిలో...

ఆనందవిహారాలా...

తాపసుల కోరికే తప్ప

నీకెలాంటి తపనలూ లేవంటావా...

ఇవి చాలదన్నట్టు రాధమ్మతో రాగాలూ..సరాగాలూనా...

అవ్వ!

ఏవిటా కేళీ కలాపాలు...!

ముద్దుముద్దుగా గారంచేస్తూ...బుజ్జగిస్తూ...

గోరుముద్దలు తినిపిస్తుంటే...

పోయి..పోయి మన్ను తింటావా...

ఏవిటా అర్ధం లేని ఆరగింపులని

పట్టిమందలించబోతే...

పదునాలుగు భువనాలనా

నోటిలోనే దర్శింపచేసావా...

అనురాగమయి అమ్మ యశోదమ్మ పున్నెమంటావా...

ఏవిటా అద్భుతమైన

అనుగ్రహాలు...!

నీ దయార్ద్రహృదయాన్ని

మేఘానికి దత్తతిచ్చి వర్షించమన్నావా ...

నీలమేఘశ్యామా...!

పులకించిన పుడమి ..

చిరుజల్లుల్లో తడిసి..

సశ్యశ్యామలమైంది ....

లోకాలన్నీ మురిసి

పరవశించాయి.

ఏవిటీ కరుణ..

మాకోసమే కదా...!

మోహాలేలేవంటూ....

జగత్తునెన్ని మోహాలకు గురిచేస్తున్నావు

జగన్మో హనాకారా...

ఏవిటీ రససృష్టి...!

చిన్నవాడివే కాని.....

ఎంతటి ఘనుడవయ్యా

కన్నయ్యా....

మునిపుంగవుల ..ధ్యానంలో నామమయ్యావు కదా..

గీతాచార్యా..!

గతిలో శరణాగతివయ్యావు

శిఖిపింఛమౌళీ....!

మా వాడివయ్యావు కదా మాధవా..!

ఎన్నిచెప్పను..ఎలా చెప్పను..

అమాయకఆరాధన...

ఆదిమధ్యాంతరహితా...! అనుగ్రహించు.!

వనమాలీ

వందనం స్వీకరించు!

శ్రీమతి భారతీకృష్ణ.

(హైదరాబాద్)

First Published:  30 Aug 2023 12:31 PM IST
Next Story