Telugu Global
Arts & Literature

లోపలిమనిషి

లోపలిమనిషి
X

ఎప్పుడైనా...

నువ్వు నీలోనికి

నిశ్శబ్దంగా తొంగి చూసావా

ఏం కనిపించిందీ

అడుగంటిన ఆశలతటాకమా..

ఏనాడైనా ఒక్కసారి

నీ గుప్పెడు గుండె పై

ప్రశ్నల వర్షం గుప్పించావా...

ఏం వినిపించిందీ సమాధానం

అణగారిన ఆశయాల ఆక్రోశమా..

వెన్నెలదారులనే అన్వేషిస్తూ

అలసిపోయావుగానీ కన్నులముందు

విప్పారిన వేకువనెందుకు

విస్మరించావు

తెల్లారేటప్పటికల్లా చెల్లాచెదురయ్యే

స్వప్నసౌధాలలో

రెక్కలార్చి విహరించావే గాని

ఉదయించిన వాస్తవాన్నెపుడైనా

హృదయంతో ఆహ్వానించావా..

ఒకపరి పరీక్షగా

పరికించి చూడు

గుట్టలుగా పడివున్న ఎండిపోయిన క్షణాలు తీక్షణంగా

నీకేసి చూస్తున్నట్టులేవూ

అందలం ఎక్కాలని అంగలార్చావే గానీ

అంతరంగం గోడు

ఏనాడైనా ఆలకించావా

లోపలిమనిషి వేసే ప్రశ్నలకు

ప్రత్యుత్తరం నీ మౌనమైతే ఎలా

మహాసముద్రం లాంటి మనసెందుకు

మౌనముద్రను ఆశ్రయించిందో

అసలు అవలోకించావా

కర్తవ్యానికి నీళ్ళొదిలేసి

నిర్లక్ష్యపుగోడలకింద సేదదీరుతానంటే

లక్ష్యమెందుకు సాక్షాత్కరిస్తుంది

గమనమే సరిగా లేనప్పుడు

గెలుపుగుమ్మమెలా చేరుకోగలం

సాధించాలనుకున్నప్పుడు

ఛేదించాల్సిందే వ్యూహాలెన్నున్నా

ప్రయత్నమన్నదే లేకుండా

ఫలితాన్ని ఆకాంక్షించడం

హాస్యాస్పదమేగా..

నిట్టూరుస్తూ నిలబడిపోతూ

కాలం ఇనుపరెక్కలక్రింద

నలిగి నాశనమైపోతానంటే

తప్పెవరిదీ..

ప్రారబ్ధం మాట ఎలావున్నా

ప్రారంభం అయితే చెయ్యాల్సింది నువ్వే

కాలం కాళ్ళకు చక్రాలున్నాయి

నువ్వేం సాధించినా,లేకున్నా

నిన్ను రేపటి వాకిట్లో

నిలబెట్టే తీరుతుంది

నేలకొరిగిన మాట

వాస్తవమే అయినా

చిగురులు వేయడానికీ అవకాశం వుందేమో...

అన్వేషించాల్సింది నువ్వే.

-సాలిపల్లి మంగామణి (శ్రీమణి)

First Published:  6 Sept 2023 11:09 PM IST
Next Story