దేవుడి కథ
నీతిమార్గాన్ని మాత్రమే నమ్ముకుని జీవించే ధర్మపరుల పోరాటానికి ఆయుధాలు అందించడం, అంతిమంగా దుర్మార్గంపై సత్యవంతులు మాత్రమే విజేతలుగ నిలిచేలా చూసే బాధ్యత భగవంతుడికి అప్పగించడం మనిషి చేసిన పనే!
తనను తాను ప్రకాశవంతం, ఆనందమయంగా మలుచుకుంటూనే పరిసరాలనూ తదనుగుణంగా ప్రభావితంచేయడం దేవుడి విశిష్ట లక్షణాలుగా భావన చేసిందీ మానవుడే.
ప్రాణుల తాత్కాలిక విశ్రాంతి కోసం రాత్రిని, శాశ్వత విశ్రాంతి కోసం ప్రళయాన్ని సృష్టించడం భగవంతుడి ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యపడే కార్యమని నమ్మాడు మనిషి.
భగవంతుడిని సకల సద్గుణ సంపదల రాశిగా భావన చేసి ఆ సమ్మోహన విశ్వంభర రూపాన్నే ఊహ మేరకు ‘దైవం’గా కల్పన చేసుకుని భజించి తరించమంటూ 'క్రీడా, విజిగీషా, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతిషు' అన్న ధాతువులను కలగలిపి ‘దైవం’ అనే పదాన్ని రాబట్టడంతో దేవుడి కథ మొదలయినట్లయింది.
ఆయుర్వేదమంత్రం(14 -20) ప్రకారం అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, ఇంద్రుడు ఇత్యాదులందర్నీ దేవుళ్లుగానే భావించుకోమని బోధించిందది.
సంస్కృత వాజ్ఞ్మయాన్ని ఓ పట్టు పట్టిన జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్ మాత్రమే భగవంతుణ్ని అత్యంత సులువైన శైలిలో 'దేవుడు అంటే వెలుగు. వెలుగు తప్ప మరేదీ కాదు' (Deva meant originally Bright and nothing else) పొమ్మని రెండు ముక్కల్లో తేల్చేసింది.
అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా మసలే శ్రీసాయణాచార్యుడు ‘స్వర్గం’ అనే ఓ లోకాన్ని ఊహించి దాని సింహద్వారం తాళాల గుత్తి ‘దేవుడి’ చేతికి అప్పగించాడు. దేవుడే యజమాని, ఆయనను పొగడ్తలతో ముంచెత్తడమే మనిషిగా పుట్టినందుకు మనం చేయదగ్గ పని’ అన్న భావన సాయణాచార్యుడి జమానా నుంచే బలపడుతూవచ్చిందని ప్రాచీన వాజ్ఞ్మయ పరిశోధకుల అభిప్రాయం.
ప్రకృతి శక్తులు, వాటిలోని అంతర్భాగం సూర్య చంద్రులు వంటి గ్రహాల చలవ వల్లనే మనిషి మనుగడ సాధ్యమయింది. ప్రాణి ఉనికి కొనసాగడానికి తోడ్పడే నేల, నీరు, ఆకాశం, కాంతి, గాలి- వంటి పంచభూతాలనూ స్థూలంగా దేవుళ్లుగా భావించుకోమంటే హేతువాదికైనా ఏ అభ్యంతరం ఉండబోదు. చెట్టూ చేమా, పుట్టా గుట్టా సైతం దైవసమానమేనని డాక్టర్ దాశరథి రంగచార్యులు పలు సందర్భాలలో బల్లగుద్ది మరీ వాదించేవారు. మానవజన్మకు మేలు చేకూర్చే ఏ పదార్థంలోనయినా నిస్సందేహంగా దైవత్వం ఉన్నట్లే లెక్క! సందిగ్ధమెందుకు?
దేవుని పుట్టుక ఎప్పటిదని ప్రశ్నిస్తే మనిషి దగ్గర చెప్పేందుకు సబబైన సమాధానం లేదు. వేదకాలంలో అతగాడు ప్రకృతి క్రమాన్ని అర్థం చేసుకొనే సామర్థ్యం లేక భయం పుట్టించే శక్తులను దేవుళ్లుగా భావించి పూజాదికాలతో ఉపశమింపచేసే ప్రయత్నాలేవో తనకు తోచినవి చేసివుండవచ్చు. పురాణకాలం నాటికి ఆ అదృశ్య శక్తుల స్థానంలో అటూ ఇటూగా మనవాకారాలను బోలే దేవతావిగ్రహాల ప్రతిష్ఠాపనలు ప్రారంభమవడం.. అదో విచిత్ర గాథ.
దేవుళ్లకూ మన మానవులకు మల్లేనే భావోద్వేగాలు, సంసార లంపటాలు తగులుకున్నాయి భక్తజనుల భావనల పుణ్యమా అని! ఎంత నిరాకారుడైనా ఒక చట్రంలో ఇమడాలంటే సృష్టించే మానవ మేధస్సు పరిమితులకు లోబడే ఆ రూపం ఏర్పడాలి! దైవలోకాల సృష్టి కథలోనూ అదే తమాషా! ఊహకు హద్దులు అక్కర్లేదు. కనక మానవమాత్రుడిగా తన చేతలకు సాధ్యంకాని అద్భుతాలేవైనా సరే అవలీలగా సాధించే దివ్యశక్తులు తాను సృష్టించిన దేవుడికి ప్రసాదించాడు మానవుడు. రూపం, గుణం, శక్తి ఏదైతేనేమి.. ప్రేరణనిచ్చి సన్మార్గదర్శనం చేయించి మనిషిని మంచి దారికి మళ్లించే ఒక చమత్కారం.. మేలుచేసేదయితే సదా ఆహ్వానించదగ్గదే కదా! ఆ మేరకు హాని కలగనంత వరకు దేవుడి ఉనికి పట్ల ఎవరికీ ఏ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేనే లేదు!
భూమ్మీద దేవతలు మన కళ్లకు ఎలాగూ కనబడుతున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు. విద్యాబుద్ధులు గరిపే ఉపాధ్యాయులు భారతీయ సంస్కృతిలో దైవసమానులు. ఆపదలు దాపురించిన వేళ ఆదుకున్నవాళ్లనూ దేవుళ్లుగా భావించడం భారతీయుల సత్సంప్రదాయం. కరోనా కాలంలో వలస కూలీల కడగండ్లకు కరగి చేతనయినంతలో ఆర్తులకు సాయమందిస్తున్న మంచిమనుషులు ఎందరినో చూస్తున్నాం. ఎక్కడో ముంబయ్ బాలీవుడ్ సినిమా నటుడు ఆంధ్రాకు ఈ మూలనున్న చిత్తూరు ఇలాకా పేద రైతుకు ఓ చిన్న ట్రాక్టర్ కొని ఇస్తేనే ‘దేవుడు’ అని ఆకాశానికి ఎత్తేస్తున్నాం మనమివాళ అన్ని సామాజిక మాధ్యమాలలో
ఎడతెరిపి లేకుండా మనిషికి, మానవ సంఘానికి మేలు చేకూర్చే శక్తినైనా, వ్యక్తినైనా దేవుడిగా భావించడం మానవ ప్రవృత్తిలోనే అంతర్గతంగా ఇమిడివున్న సానుకూల దృక్పథం. అది ఆపితే ఆగేది కాదు. మొహమాట పెట్టినా పొంగి పోటెత్తి పారేదీ కాదు. ఎంత లౌకికలోక వ్యవహారమైనా దైవభావానికీ ఓ లెక్కంటూ ఉన్నట్లు వివరంగా చెప్పడమే భారతీయ తత్త్వశాస్త్రాలలోని విశిష్ఠత.
స్వాతంత్ర్య సమరం ఉధృతమయిన సమయంలో ప్రముఖమైన స్థానంలో ఉన్నందు వల్లనే గదా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భరతజాతి మొత్తానికి, ముందు బాపూజీ ఆనక మహాత్మా ఇప్పుడు విగ్రహ రూపంలో దైవంగా మారింది! డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా ఫూలేల లాగా దళిత జాతుల ఉద్ధరణకై జీవితాంతం పాటుబడ్డ మహనీయులను దేవతామూర్తులుగా భావించడం సర్వసాధారణం ఈ కర్మభూమిలో.
పూజ్యభావంతో ప్రతిష్ఠించిన సుప్రసిద్ధుల విగ్రహాలను గుళ్లలోని దేవుళ్లకు మల్లే పూజించడాన్ని తార్కిక దృష్టితో చూసి కొందరు తప్పుపడుతుంటారు. భక్తిభావనకు, తర్కానికి ఎప్పుడూ చుక్కెదురే. 'విశ్వాంసో ధర్మ మూలాంహి' అన్నది పెద్దలు అన్న వట్టిమాట కాదు. అనుభవం మీద రాబట్టిన సూక్తులవన్నీ!
భక్తి అనే హర్మ్యానికి విశ్వాసమే పునాది. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ తర్కంతో ఆ దివ్య భవనాల మీదకెక్కి ఆవలి పార్వ్యం చూడడం అసంభవం.
దేవుళ్ల రూపాలు మారడం గమనిస్తున్నాం. దైవారాధనలూ కాలానికి తగ్గట్లు ఆర్భాటంగా మారడం చూస్తున్నాం. మనిషి పిచ్చి గానీ, ఏ హడావుడీ దైవిక శక్తుల మౌలిక స్వభావాలలో మార్పు తేలేవు. అగ్నిని దేవతే అనుకో! ఏ రూపంలో అయినా పూజించుకో! అయినా చెయ్యి పెడితే చుర్రుమని కాల్చి తీరుతుంది భావనలో దైవాలకు తరతమ భేదాలు లేకపోవచ్చును గానీ, భౌతికరూపంలో పారే గంగమ్మ తల్లికి ఎన్ని విధాల మొక్కినా ముక్కుల్దాకా మునిగితే ప్రాణాలు గుటుక్కున పోవడం ఖాయం.
దైవభావనలలో పొడగట్టే ఏ మార్పయినా మనిషి స్వభావంలో వచ్చే మార్పులకు మాత్రమే సంకేతమనేది మానసిక శాస్త్రవేత్తల సిద్ధాంతం. ఈ ఇంగితం లేకనే.. దేవుళ్ల విషయమై నాడూ నేడూ మనిషికి మనిషికి మధ్యన, జాతుల పేరున, దేశాల వంకన, సంస్కృతుల మిషన ఎన్ని తరాలు గడచినా ఆగకుండా ఆధ్యాత్మిక ఘర్షణలు విశ్వమంతటా ప్రస్తుతం నిష్కారణంగా చెలరేగుతున్నాయి.
కవులూ తమ కావ్యాలకు అవతారికలు రాసే సందర్భంలో 'ఇష్ట'దేవతాప్రార్థనల వంకన దేవుళ్ల మధ్యన ప్రదర్శించే వలపక్షం విచిత్రం. వైదిక దేవతలు, పౌరాణిక దేవతలు, జానపద దేవతలు, ఆధునిక దేవతలు.. అంటూ దేవజాతులను సైతం కవులు మనుషులకు మల్లేనే వివిధ తరగతుల కింద విభజించి చూడడం, ఇష్టులైన దేవుళ్లంటూ మళ్లా కొన్ని అవతారాలకు ప్రత్యేక ప్రతిపత్తులు కల్పించడం! మనిషి మానసికంగా ఎదిగాడని టముకేసుకోవడమే తప్పించి.. ఎంత ఎదిగినా వేపను వదలని చేదులా ఎంతో కొంత వెర్రితనం తప్పదా!
'కతివై దేవాః?' దేవుళ్లు ఎందరు? అని యాస్కుడు తనను తాను ప్రశ్నించుకుని 'త్రయం త్రింశోవైదేవాః'-ముఫ్ఫైముగ్గురు అని చెప్పుకున్నాడుట. ఆ నిరుక్తకారుడి లెక్క ప్రకారం, వసువులు ఎనిమిదిమంది, రుద్రులు పదకొండుమంది, ఆదిత్యదేవతలు డజనుమంది, ఇంద్రుడు, ప్రజాపతి– వెరసి ముచ్చటగా ముఫ్ఫైముగ్గురు. జగత్తు నివాసయోగ్యత వీటి చలవే కాబట్టి పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రజాతి వసుదేవతలయారు.
దేహానికి ఆత్మ స్వస్తి చెప్పే వేళ ప్రాణులను పీడిస్తాయి కాబట్టి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, జీవాత్మ రుద్రదేవతలుగా దూషింపబడుతున్నారు. ఏడాది మొత్తం చైత్రాది పన్నెండు మాసాల ద్వారా ఆయుష్షును హరించే సూర్యుడు, వరుణుడు, పూర్ణ, తృష్ణల వంటి పన్నెండు మంది ఆదిత్య దేవతల కోవలో చేరారు. లెక్కకే ముప్పై ముగ్గురు. భూమ్మీది నిప్పు, మబ్బులోని గాలి.. మెరుపు, ఆకాశంలోని సూర్యుడు మనిషికి ముఖ్యమైన దేవతలని మళ్లీ యాస్కుడే లెక్క కుదించాడు!
రుగ్వేదం మొదటి మంత్రం 'ఓం అగ్నిమీళే’ అగ్నికి సంబంధించిందే! రుగ్వేద సూక్తులలోని నాలుగో వంతు ఇంద్రుడికి ధారాదత్తం. వ్యవసాయాధారిత భారతదేశంలో మేఘాలను ఛేదించి వర్షాలు కురిపించగల సత్తా వజ్రాయుధపాణి ఇంద్రుడొక్కడి దగ్గరే ఉందని నమ్మకం. వేదపరంగా ఇంద్రుడు ఐశ్వర్యానికి ప్రతీక. పురాణాల దృష్టిలో స్వర్గాధిపతి. వైదికుల భావనలో దేహంలోని జీవుడు. దేవతల రాజుగా, రాక్షసుల వైరిగా, తాపసుల అడ్డంకిగా ఇంద్రుడివి బహుముఖపాత్రలు.
ఆకాశదేవతలలో సూర్యుడు అత్యంత ప్రముఖుడు. సౌర మండలం తాలూకు సమస్త శక్తులకూ ఉత్పత్తి కేంద్రమైన సూర్యదేవుడిని వేదాలు 10 సూక్తాలలో ప్రస్తుతించాయి. సుదూరం నుంచి చూసినా ప్రసన్న ధృక్కులతో దర్శనమిచ్చే దివ్యజన్ముడిగా, సకల లోకాలను క్రమబద్ధంగా ప్రకాశింపచేసే మహాదేవుడిగా, మానుషకార్యాలన్నిటిని యాజ్ఞిక రూపంలో స్వీకరించే ఆకాశపుత్రుడిగా' ప్రస్తుతించాయి. సూర్యుడొక్కడే నరుడికి నిత్యం ప్రత్యక్షమయే నారాయణుడు.
సోముడు నుంచి వరుణుడు వరకు దేవతలు ఇంకెందరో వేదాలలో తమ తమ యోగ్యతలను బట్టి ప్రస్తుతులు అందుకున్నారు. ఆ వివరాల జోలికి ప్రస్తుతం పోలేం.. కారణం స్థలాభావం.
వేదకాలంనాడు సోదిలో కూడా లేని ప్రజాపతి, పశుపతి వంటి దేవుళ్లకు మలివేదకాలానికి దశ తిరిగింది. విష్ణువు, అతని ప్రతిరూపాలైన కృష్ణుడు వంటి దేవతలకు ఆరాధనలు అధికమయ్యాయి. యజ్ఞయాగాదులంటే తడిసిమోపడయ్యే ఖర్చులు. తలకు మించిన పని ఎత్తుకోవడం కన్నా నమ్మకం కుదిరిన విశ్వాసానికి సంబంధించిన ఓ దేవతాకారాన్ని కల్పించుకుని ఆరాధించడం సామాన్యుడికి సులువైన ముక్తిమార్గంగా తోచింది.
తనను బోలిన ఆకారమే దేవుళ్లకూ కల్పించడం, తన ఈతి బాధలను సైతం దేవతలకు చుట్టబెట్టి కథలుగా వాటిని చెప్పుకుని విని తరించడం ఒక ముక్తిమార్గమనే భావన ప్రచారంలోనికి వచ్చినప్పటి నుంచి దేవుళ్ల వైభోగాలు, వారి వారి బంధుబలగాల వ్యవహారాలు ఆరాధనలో ప్రధాన ఆకర్షణీయ భాగాలయ్యాయి.
యజ్ఞయాగాదులకు బదులుగా పూజాపునస్కారాలు ప్రారంభమైన పురాణకాలంలో లోకవ్యవహారాన్ని బట్టి ధర్మసంస్థాపన కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త దైవరూపాలు ఉనికిలోనికి రావడం సరికొత్త పరిణామం.
జైనుడైన అమరసింహుడు తన అమరకోశం స్వర్గవర్గంలో దేవుళ్లకు ఉండే 'అమరా నిర్జరా దేవాస్త్రిదశా విబుధాః సురాః' వంటి 26 రకాల పేర్లు చెప్పుకొచ్చాడు. జరామరణాలు లేనివాళ్లని, ఎప్పుడూ మూడుపదుల వయసులో కనిపించే యవ్వనవంతులని, మానవవాతీత శక్తులున్న అదితి కుమారులని.. ఇట్లా ప్రతి పదం వ్యుత్పత్తి అర్థం ఆ నామలింగానుశాసనమ్ వివరిస్తుంటే ఎన్నడూ కనిపించని దేవుడి శక్తియుక్తుల మాటకు మించి ముందు కంటి ముందు తిరిగే మనిషి బుద్ధి నైశిత్యాన్ని వేనోళ్ల పొగడబుద్ధవుతుంది.
హద్దులెరుగని కల్పన చేయగల మేధోసామర్థ్యం సృష్టి మొత్తంలో మనిషికి మాత్రమే సాధ్యమన్న వాదన తిరుగులేనిదనడానికి దేవతల పుట్టుకను గురించి అతగాడు చేసిన కల్పనే ఓ గొప్ప ఉదాహరణ.
వాల్మీకి రామాయణం 14వ సర్గలోనూ దేవతల పుట్టుకను గురించిన ప్రస్తావన ఉంది. జటాయువు తన జన్మరహస్యం రామచండ్రుడికి వివరించే సందర్భంలో సృష్టి, దాని క్రమం, దేవతల పుట్టుకల ప్రస్తావనలు వస్తాయి. ఆఖరి ప్రజాపతి కశ్యపుడికి అదితి వల్ల కలిగిన ముప్పైముగ్గురు దేవతల వివిధ రూపాలని వాల్మీకి వివరంగా చెప్పుకొస్తాడు. మలివేదకాలం నుండి ఈ పౌరాణిక దేవతలకే అగ్రతాంబూలం.
జానపద దేవతలు ఉనికిలోనికి వచ్చినప్పటి బట్టి సమాజంలోని ఒక ప్రధానవర్గం చేసే పూజావిధానాలలో మౌలికమైన మార్పులు చాలా చోటుచేసుకున్నాయి. పౌరాణిక దేవతలది లిఖితసాహిత్య ప్రచారమైతే, జానపద దేవతల ప్రాభవానికి మౌఖిక మాధ్యమం ఆధారం. ఆధునిక కాలంలో గ్రామదేవతలకూ లిఖితసాహిత్యం ద్వారా నీరాజనాలు అందడం సర్వసాధారణమయిపోయింది. అమ్మవారు, పోతురాజుల వంటి గ్రామదేవతల ఆరాధనల్లో జానపదులు తమ అలవాట్లను ఏ దాపరికం లేకుండా పూజావిధానం ద్వారా ప్రదర్శించడం గమనార్హం.
వ్యవసాయసంబంధమైన కేటగిరీలో స్త్రీ దేవతలకే అధిక ప్రాధాన్యం. జానపద దేవతలలో ప్రధానంగా రెండు విభాగాలు. పార్వతీదేవి తరహా శక్తిమూర్తులకు ప్రతినిధులుగా గౌరమ్మ(బతుకమ్మ), ఆదిశక్తి వంటి అమ్మవార్లు ఒక తరగతి; ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఊరి ఆడపడుచులు రెండో తరగతి గ్రామదేవతలు.
వీరులను దేవుళ్లతో సమానంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచమంతటా ఉన్నట్లే, భరతఖండంలోనూ ముందు నుంచి ముమ్మరంగానే ఉంది. రాముడు, కృష్ణుడు, పరశురాముడు, సమ్మక్క, సారలమ్మ, శివాజీ.. వంటి సాహసవంతులెందరో దేవతల స్థాయికి ఎదిగి పూజలందుకోవడం ఇందుకు ఉదాహరణ.
ఆధునిక కాలంలో షిర్డీ సాయిబాబా, రాఘవేంద్రస్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంటి వ్యక్తులు వివిధ కారణాల వల్ల దేవతలుగా పరిగణింపబడి ఆరాధనలు అందుకుంటున్నారు.
మతాలను గురించి ఈ కలికాలంలో మనలో మనమే ఏవేవో కారణాలు కల్పించుకుని సతమతమవుతున్నామే తప్పించి, వేదకాలంలో ఈ వృథాప్రయాసలేవీ లేని చక్కని స్పష్టత ఉండేది. 'ఇన్ద్రమ్ మిత్రమ్ ‘ అనే శ్లోకార్థాన్ని బట్టి బుద్ధిబలం అధికమై ఆకారమే లేని పరమేశ్వరుడిని ఇంద్రుడని, సూర్యుడని, వరుణుడని, వాయువని భిన్నరూపాలలో భావిస్తున్నప్పటికీ వాస్తవానికి ఉన్నది ఒక్కటే దైవం. ఒక్కటే రూపం. ‘ఏకం సత్’ అన్న రుగ్వేద సూత్రం అంతరార్థం అంతుబడితేనే తప్ప ప్రస్తుతం మతం పేరుతో పెచ్చుమీరే విద్వేషభావనలు శాశ్వతంగా మాసిపోయే శాంతి మార్గం మనిషి కంటబడదు.
కంటికి కనిపించని దేవుళ్ల లెక్క కన్నా.. కంటి ముందు కదిలే మనుషులే మనుషులకు దేవుళ్లనే భావన బలపడితే అసలు గొడవే ఉండదు.
కర్లపాలెం హనుమంతరావు
(బోథెల్; యూ.ఎస్.ఎ)