కాకతీయ కళాసంస్కృతి
మల్లికా సారాబాయ్ తెలుగు రాష్ట్రానికి వస్తున్నారు. వరంగల్‌లో జరగనున్న ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె నాట్యంతో అలరించనున్నారు.
మల్లికా సారాబాయ్ తెలుగు రాష్ట్రానికి వస్తున్నారు. వరంగల్‌లో జరగనున్న ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె నాట్యంతో అలరించనున్నారు.
రామప్ప గుడిలో కాకతీయ వైభవం
వరంగల్‌లోని రామప్ప ఆలయం ప్రాంగణంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, పరంపర సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మల్లికా సారాబాయ్ నాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు.
మల్లికా సారాబాయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె నాట్యకారిణి, విద్యావేత్త, రచయిత, సామాజిక కార్యకర్త, నటి, రాజకీయ వేత్త కూడా. కూచిపూడి, భరతనాట్యాల్లో ఆమె లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చారు. ఆమె తండ్రి ప్రముఖ సైంటిస్ట్ విక్రమ్ సారాబాయ్, తల్లి ప్రఖ్యాత శాస్త్రీయ నాట్యకారిణి మృణాళినీ సారాబాయ్. దర్పణ అనే అకాడమీని స్థాపించి శాస్త్రబద్ధమైన విద్యావిధానంలో కళారూపాల్లో శిక్షణనిస్తున్నారు. మహిళను శక్తికి ప్రతిరూపంగా అనేక రచనలు చేశారు, టీవీ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. వార్తా పత్రికల్లో కథనాలు రాస్తున్నారు.
సారాబాయ్ పొలిటికల్ జర్నీ
బీజేపీ అభ్యర్థి ఎల్‌కే అద్వానీ మీద ఆమె 2009లో గుజరాత్ రాష్ట్రం, గాంధీ నగర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. అంతకు మునుపు 1984లో రాజీవ్ గాంధీ ఆమెకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయవలసిందిగా ఆహ్వానించారు. కానీ అవినీతి మకిలి అంటని రాజకీయ పార్టీలు లేవనే అభిప్రాయంతో ఆమె ఏ పార్టీ మద్దతును స్వీకరించక, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ ఎన్నకల్లో ఆమెను విజయం వరించలేదు. కానీ ఈ సంఘటనతో ఆమె వ్యక్తిత్వం మరింతగా రాణించింది. 2014లో మల్లికా సారాబాయ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
ఇదీ 'పరంపర'
ఇక వరంగల్‌లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల విషయానికి వస్తే... పరంపర అనే సాంస్కృతిక సంస్థ భారతీయ సంస్కృతి, చరిత్రను భావితరాలకు అందించాలనే సంకల్పంతో స్వచ్ఛందంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సాంస్కృతిక ప్రదర్శనలను చారిత్రక, పర్యాటక ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం వీరి ప్రత్యేకత. పిల్లల చేత చరిత్రను అక్షరాల ద్వారా పుస్తకాల్లో చదివిస్తే మన మూలాలను ఒంటపట్టించుకోలేరు. ఆ ప్రదేశానికి తీసుకు వెళ్లాలి, వెళ్లడానికి ఒక కారణాన్ని కల్పించాలి, సదరు చారిత్రక ప్రదేశం గురించి సాంస్కృతిక ప్రదర్శన ద్వారా కళ్లకు కట్టాలి అనేది దీని రూపకర్తలు శ్రీనగి, శశిరెడ్డిల మనోగతం.
ప్రముఖుల నాట్యాన్ని వీక్షించడానికి నగరాలకు వెళ్లలేని వాళ్ల కోసం... ప్రఖ్యాత నాట్యకారులనే మన ప్రదేశాలకు తీసుకువస్తున్నట్లు తెలియచేశారు. మన చారిత్రక పర్యాటక ప్రదేశాల ఇతివృత్తంగా నాట్య రూపకల్పన చేసుకుని మరీ ప్రదర్శిస్తారు ఆ నాట్యకారులు.
ఈ ఏడాది నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో వరంగల్‌లో రామప్ప గుడిలో ప్రఖ్యాత నాట్యకారిణి మల్లికా సారాబాయ్ నాట్యాన్ని వీక్షించే అవకాశం వరంగల్ వాళ్లకు వచ్చింది. ఆసక్తి ఉన్న వాళ్లు డిసెంబర్ 24వ తేదీన వరంగల్ టూర్ ప్లాన్ చేసుకుంటే... టూరిస్ట్ ప్లేస్‌లను చూడడం, సాయంత్రం ఆరు గంటలకు ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆస్వాదించడం రెండూ కలిసివస్తాయి.