మాటంటే.....(కవిత)

మాటంటే.....(కవిత)
వదన గహ్వరంలోంచి వెలువడే
వరసచప్పుళ్ళ గోలకాదు మాటంటే!
మాటంటే పూలకడుపుల్లోంచి వెల్లువయ్యే
పరవశాల పరిమళాల వీచిక!
మాట ఒక ఎదనుండి మరోఎదలోకి
సంగీతమైప్రవహించే
సెలయేటి గలగల!
తన అమాయక రంగురంగుల ప్రపంచానుభవాన్ని
వివరించి చెప్పలేని
పసిపాప బోసినవ్వుల కిలకిల!
కన్పించినంతమేరా
మైదానాలమీద
ఆకుపచ్చని శాద్వలమై
పరచుకుంటుంది మాట!
మ్రోళ్ళనూ బీళ్ళనూ
పరామర్శించి
మాట ఆవిష్కరిస్తుందక్కడొక
పూలతోట!
గాయపడ్డ మనసులమీద
చల్లనిచందనలేపమై
మెరుస్తుందిమాట!
అది బాధాతప్తనేత్రాల్లో ఊరే అశ్రువులను తుడిచే
అరచేతి జోలపాట!
ముష్కరులయెడా
రక్కసులయెడా
అగ్నిహోత్రమై జ్వలించాలేకాని
మనసుకూ మనసుకూ మధ్య
మంటలు రాజేయకూడదు మాట!
తేనెలసోనై
వెన్నెలవానై వర్షించాలి మాట!
ఆలోచనాలోచనాలను తెరిపించాలిమాట!
అందుకే,
మాటలకు మన్నన నేర్పు!
అమర్చు మాటలకు మర్యాదల కూర్పు!
అర్థంపర్థంలేని మాటలను ఒకదానివెంట మరొకటి
వొడిసెలరాళ్ళలాగా విసరకు!
వ్యంగ్యాల,నానార్థాల,
పుల్ల విరుపుల బురదను
మాటలకు ఏమాత్రం పులమకు!
పలుకులకు కాస్త పరిమళాన్ని
మార్దవాన్నీ రుద్దు!
విలువల వలువలను తొడిగి మాటలపెదాలమీద
కొంచెం దరహాసాన్ని అద్దు!
మాటంటే ఒక మంత్రదండం!
మాటంటే ఒక అమృత భాండం!
నీకూ నాకూ మధ్య పవిత్రంగా
మాటేకదా ఒక సుందరకాండం!
- సి.హెచ్.వి.బృందావనరావు