మేధ అమ్ముల పొదిలో
అక్షర అస్త్రములెన్నో…
భావ గాండీవముతో
సంధించు పదశరములెన్నో!
ప్రకృతి పరిరక్షణకు పాటుపడే వారుణాస్త్రమై…
మూఢ విశ్వాసాలపై విరుచుకుపడే
ఆగ్నేయాస్త్రమై…
అన్యాయ, అసమానతల రీతులపై
బుస కొట్టే నాగాస్త్రమై!
అనారోగ్య సమస్యలను
అవగాహనతో ఖండించే
వైద్యాధర అస్త్రమై…
అమానవీయతను మాయం
చేసే సమ్మోహనాస్త్రమై!
ప్రపంచం నలుమూలలా జరిగే
అక్రమాలను శబ్దభేదితో ఛేదించి…
వివక్షను ఎత్తి చూపే రౌద్రాస్త్రమై…
అజ్ఞానాన్ని తరిమే వాయవ్యాస్త్రమై!
పలురూపాల ప్రయోగాల…
సమాజ సంస్కరణను గావించే
పాశుపతాస్త్రం అక్షరం!
-చంద్రకళ. దీకొండ