చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టు.. కక్ష సాధింపు అన్న వైసీపీ!
పులివర్తికి ఒక్క గాయం కూడా కాలేదని మెడికల్ రిపోర్ట్స్ చెప్తున్నాయన్నారు. కారుపైన మాత్రమే దాడి జరిగిందన్నారు చెవిరెడ్డి.
వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో అరెస్టు చేసి తిరుపతి యూనివర్సిటీ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఎన్నికల సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ దాడుల్లో టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానికి గాయాలయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే 34 మందిని అరెస్టు చేశారు. తాజాగా బెంగళూరు ఎయిర్ పోర్టులో మోహిత్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు.
ఇక మోహిత్ రెడ్డి అరెస్టుపై స్పందించారు ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మోహిత్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికం అన్నారు. ఘటన జరిగిన 53 రోజుల తర్వాత అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. పులివర్తికి ఒక్క గాయం కూడా కాలేదని మెడికల్ రిపోర్ట్స్ చెప్తున్నాయన్నారు. కారుపైన మాత్రమే దాడి జరిగిందన్నారు చెవిరెడ్డి. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మోహిత్ రెడ్డిని అరెస్టు చేశారని.. ఇలాంటి అరెస్టులపై ప్రజా పోరాటాలకు సిద్ధం అవుతామన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.