Telugu Global
Andhra Pradesh

మళ్లీ అంబేద్కర్ కి అవమానం.. లైటింగ్ పెట్టలేదు

విజయవాడలో ప్రతి చెట్టుని, ప్రతి వీధిని విద్యుత్ దీపాలతో అలంకరించారని, అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం మరచిపోయారని వైసీపీ ఆరోపిస్తోంది.

మళ్లీ అంబేద్కర్ కి అవమానం.. లైటింగ్ పెట్టలేదు
X

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విజయవాడలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణ ఏర్పాట్లు చేసిన కూటమి ప్రభుత్వం... అంబేద్కర్ స్మృతి వనాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసిందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అసలు అంబేద్కర్ ఏం తప్పు చేశారని, దళితుల దైవాన్ని టీడీపీ ఎందుకింతలా అవమానిస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. విజయవాడలో ప్రతి వీధికీ, ప్రతి చెట్టుకీ అలంకరించిన విద్యుత్ దీపాలను, అంబేద్కర్ స్మృతివనాన్ని వీడియో తీసి వైసీపీ అఫిషియల్ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు నేతలు.


మరోవైపు అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందంటూ వైసీపీ నేతలు ఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్సీ కమిషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు నేతలు. అసలు అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు వచ్చిదని ఆయన వైసీపీ నేతలను ప్రశ్నించారట. దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఆయన తేల్చి చెప్పారని సమాచారం. అంబేద్కర్‌ విగ్రహం జాతీయ సంపద అని, దానిపై ఎవరూ దాడి చేయకూడదని ఎస్సీ కమిషన్ చైర్మన్ చెప్పారని వైసీపీ నేతలు మీడియాకు తెలిపారు. త్వరలో జాతీయ ఎస్సీ కమిషన్ బృందం, విజయవాడ స్మృతివనం పరీశీలనకు వస్తుంది.


వైసీపీ ఫిర్యాదుపై టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి. జాతీయ ఎస్సీ కమిషన్ కి వైసీపీ నేతలు తప్పుడు సమాచారం ఇచ్చారని, కమిషన్ విచారణ చేపడితే నిజాలు బయటపడతాయని టీడీపీ నేతలంటున్నారు. జగన్ పేరుని తొలగిస్తే, అంబేద్కర్ విగ్రహాన్నే తొలగించినట్టు, దాడి చేసినట్టు వైసీపీ ప్రచారం చేస్తోందని అంటున్నారు. మొత్తమ్మీద అంబేద్కర్ స్మృతివనంపై దాడి వ్యవహారాన్ని దేశవ్యాప్తంగా వైసీపీ చర్చకు తీసుకొచ్చింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మరో అవమానం జరిగినట్టు చెబుతోంది.

First Published:  15 Aug 2024 1:53 AM GMT
Next Story