Telugu Global
Andhra Pradesh

పొడిచింది మీవాడే..! కాదు మీవాడే

హంతకుడు మీ పార్టీ అంటే, కాదు మీ పార్టీ అంటూ ఇరు వర్గాలు సోషల్ మీడియాలో గొడవకు దిగడం మరింత ఆందోళనకరంగా మారింది.

పొడిచింది మీవాడే..! కాదు మీవాడే
X

చనిపోయింది రషీద్..

చంపింది జిలానీ..

అది సరిపోదు, అంతకు మించి అంటున్నారు సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ ఫాలోవర్లు. హంతకుడు జిలానీ మీ పార్టీ వాడంటే, కాదు మీ పార్టీ వాడంటూ సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై జరిగిన హత్య భయాందోళనలకు కారణం అవుతుంటే.. హంతకుడు మీ పార్టీ అంటే, కాదు మీ పార్టీ అంటూ ఇరు వర్గాలు సోషల్ మీడియాలో గొడవకు దిగడం మరింత ఆందోళనకరంగా మారింది.

హత్య జరిగిన వెంటనే అది రాజకీయ ప్రతీకార హత్య అంటూ సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ అయ్యాయి. వైసీపీ సానుభూతిపరుడిని టీడీపీ కార్యకర్త హత్య చేశాడంటూ ట్వీట్లు పడ్డాయి. ఆ తర్వాత కాసేపటికి పోలీస్ అధికారుల వివరణ బయటకొచ్చింది. వారిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయని, అది వ్యక్తిగత దాడి అని పోలీసులు స్పష్టం చేశారు.



వైసీపీ కూడా వెనక్కు తగ్గలేదు. నిందితుడు జిలానీ పాత ఫొటోలను బయటకు తీసింది. టీడీపీ నేతలతో జిలానీ కలసి ఉన్న ఫొటోలు, టీడీపీ కండువాలు వేసి ఆయన దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


టీడీపీ కూడా వైసీపీ ట్వీట్లకు కౌంటర్ ఇచ్చింది. చనిపోయింది, చంపింది ఇద్దరూ వైసీపీ నేతలేననేది టీడీపీ వాదన. వారిద్దరితో పీఎస్ ఖాన్ అనే రౌడీషీటర్ కి పరిచయం ఉందని, సదరు పీఎస్ ఖాన్, జగన్ కు సన్నిహితుడని టీడీపీ అంటోంది. జగన్ తో పీఎస్ ఖాన్ ఉన్న ఫొటోలను బయటపెట్టింది.


ఇక్కడ చనిపోయింది ఒక మనిషి, చంపింది మరో మనిషి, జరిగింది అమానుషం అనేది ఫైనల్. అయితే చనిపోయిన వ్యక్తి ఏ పార్టీ, చంపిన వ్యక్తి ఏ పార్టీ అనేది మాత్రమే సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది.

First Published:  18 July 2024 5:15 AM GMT
Next Story