ఎలా మంత్రి అయ్యాడో.. పవన్‌పై జగన్ షాకింగ్ కామెంట్స్
సీఎం చంద్రబాబును పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేకనే దళిత మంత్రి పై ఆగ్రహం వ్యక్తం చేశారని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్ ఆశ్చర్యకరంగా ఉన్నాయని మాజీ సీఎం పేర్కొన్నారు. సీఎం చంద్రబాబును పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేకనే దళిత మంత్రి పై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. డిప్యూటీ సీఎం సొంత ఇలాకా పిఠాపురంలో ఓ మహిళను టీడీపీ నాయకుడు అత్యాచారం చేస్తే పవన్ ఏం చేశారని ప్రశ్నించారు. సినిమా డైలాగులు మాత్రమే కొడతారని విమర్శించారు. అలాగే ముఖ్యమంత్రి బావమరిది బాలయ్య సొంత నియోజకవర్గం హిందూపురంలో జరిగిన ఘటన పై కనీసం బాధితులను ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించే స్థాయిలో లేడన్నారు. హోంమంత్రి కూడా తన పక్క నియోజకవర్గంలో తొమ్మిదో తరగతి బాలిక ను ప్రేమోన్మాది నరికి చంపినా కానీ ఆమె పరామర్శించలేదన్నారు. మరోవైపు టీడీపీ అధికారిక వెబ్ సైట్ లో ఫేక్ పోస్టులు పెడుతున్నారని మండి పడ్డారు జగన్. ఇక వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ ను అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.
అసలు పవన్ మంత్రిగా ఎలా అయ్యారోనని, ఇంతకు ఆయనకు తెలివి ఉందా లేదోనని జగన్ అన్నారు సరస్వతి సిమెంట్ కంపెనీ భూముల పరిశీలించి చేసిన పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సరస్వతి భూముల్లో ఎలాంటి ఆక్రమణలు లేవని స్వయాన ఎమ్మెర్వో ప్రకటించారని వెల్లడించారు. అధిక ధర చెల్లించి రైతుల వద్ద భూములను కొనుగోలు చేశానని వివరించారు. పర్యావరణశాఖకు మంత్రిగా ఉండి వాస్తవాలు తెలుసుకోకుండా ల్యాండ్ లీజు గురించి తప్పుగా మాట్లాడడం ఘోరమన్నారు. 2014లోనే కేంద్రం భూముల లీజును 50 ఏళ్లకు పెంచిందని గుర్తు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీకి నీళ్లు, కరెంట్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. సరస్వతి భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అనతికాలంలోనే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశముందని, ఈ కూటమి ప్రభుత్వం పడిపోవచ్చు. అధికారంలోకి వచ్చేది మేమే. అప్పుడు అందర్నీ బయటకు తీస్తాం. సప్తసముద్రాలైన దాటి పట్టుకొస్తామని వెల్లడించారు. పోలీసులు బాధితులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని జగన్ హెచ్చారించారు.