Telugu Global
Andhra Pradesh

నవంబర్ నుంచి పోలవరం పనులు

నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు సీఎం చంద్రబాబు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మొదలు పెడతామన్నారు.

నవంబర్ నుంచి పోలవరం పనులు
X

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 15వేల కోట్ల రూపాయలు అప్పు ఇప్పించడానికి హామీ ఉంటామని బడ్జెట్ లో కేంద్రం ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై గట్టి హామీ లభించినా నిధులకు సంబంధించి ఎలాంటి గణాంకాలు బడ్జెట్ లో పొందుపరచకపోవడం విశేషం. దీంతో పోలవరం సంగతేంటని ప్రతిపక్ష వైసీపీ గట్టిగా నిలదీస్తోంది. మరోసారి తన సొంత ప్రయోజనాలకోసం సీఎం చంద్రబాబు ఏపీని కేంద్రం వద్ద తాకట్టుపెట్టారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పోలవరం నిర్మాణంపై ఓ అప్ డేట్ ఇచ్చారు.


నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు సీఎం చంద్రబాబు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మొదలు పెడతామన్నారు. గతంలో వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడంతో అక్కడ కొత్తగా నిర్మాణం చేపట్టాల్సి వస్తోంది. దీనికోసం నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. శ్రమశక్తిభవన్‌లోని జల్‌శక్తిశాఖ కార్యాలయంలో కేంద్రమంత్రిని ఆయన కలిశారు. 45 నిమిషాలకు పైగా వారిద్దరూ పోలవరం ప్రాజెక్ట్ గురించి చర్చించారని టీడీపీ వర్గాలంటున్నాయి.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు తాము పెట్టిన డెడ్ లైన్లను తామే పొడిగించాయి. పోలవరంలో తప్పు మీదంటే మీదంటూ నిందలు వేసుకున్నాయి. అప్పుడు పూర్తి చేస్తాం, ఇప్పుడు చేస్తామంటూ డెడ్ లైన్లు పెట్టారు కానీ, పోలవరం పూర్తి చేయడం రెండు ప్రభుత్వాలకు సాధ్యం కాలేదు. తాజాగా చంద్రబాబు డెడ్ లైన్ల జోలికి పోలేదు. వీలైనంత త్వరగా కేంద్రం సహకారంతో పోలవరం పూర్తి చేస్తామంటున్నారు. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే కేంద్రం సహకారం అనే విషయాన్ని ఆయన హైలైట్ చేస్తారు. ఆ సహకారం కొరవడటం వల్లే ప్రాజెక్ట్ ఆలస్యమైందని చెప్పడానికి చంద్రబాబు ఆల్రడీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.

First Published:  28 July 2024 9:36 AM IST
Next Story