Telugu Global
Andhra Pradesh

లాటరీలో పదవులొచ్చాయి.. బాధ్యతగా ఉండండి

బాధితులకు భరోసా ఇచ్చేందుకే తాను మచ్చుమర్రి వచ్చానని.. పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేసే వాళ్లు, తన రాకను కూడా అలాగే చూస్తున్నారని, అందుకే భయపడి పోలీసులను ప్రయోగించారన్నారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.

లాటరీలో పదవులొచ్చాయి.. బాధ్యతగా ఉండండి
X

కూటమిది ప్రజా విజయం కాదని, కొంతమందికి లాటరీలో పదవులు వచ్చాయని ఘాటు విమర్శలు చేశారు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. లాటరీలో పదవులు వచ్చినవారు దాన్ని జీవితంలో ఓ గొప్ప అవకాశంగా భావించాలన్నారు. ప్రజలకు సేవ చేయడానికి, పేదలకు అండగా నిలబడటానికి, గుర్తింపు తెచ్చుకోడానికి వారు దాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంకా పాతకాలంనాటి ఆలోచనలు ఎందుకని ప్రశ్నించారు. పోలీసులతో వేధింపులు, అక్రమ కేసులు ఇలాంటివన్నీ మానుకోవాలని హితవు పలికారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.


ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగి ఐదు రోజులవుతున్నా.. ఇంత వరకు ఆ బాలిక ఆచూకీని ప్రభుత్వం, పోలీసులు కనిపెట్టలేకపోయారని మండిపడ్డారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. గతంలో టీడీపీ హయాంలోనే సుగాలి ప్రీతి ఘటన జరిగిందని, అప్పుడు కూడా ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించారని... ఇలాంటి తప్పులకు కఠిన శిక్షలు పడితేనే మరొకరు ఆ తప్పు చేయకుండా ఉంటారని అన్నారు. తన సొంత గ్రామం మచ్చుమర్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తే పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు సిద్ధార్థ్ రెడ్డి.

బాధితుల పక్షాన నిలబడేందుకు, వారికి భరోసా ఇచ్చేందుకే తాను మచ్చుమర్రి వచ్చానని.. పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేసే వాళ్లు, తన రాకను కూడా అలాగే చూస్తున్నారని, అందుకే భయపడి పోలీసులను ప్రయోగించారన్నారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. తనపై ఫోకస్ పెట్టిన పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ కూడా పక్కనపెట్టారని మండిపడ్డారు. నెలరోజుల కూటమి పాలనలో తాను తప్పులు పట్టడం లేదని.. పోలీసులు, ప్రభుత్వం తమ విధులు పక్కనపెట్టడం సరికాదన్నారు సిద్ధార్థ్ రెడ్డి.

First Published:  13 July 2024 3:09 AM GMT
Next Story