ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
కొత్త నిర్ణయాల కంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిలిపివేసే విషయంపైనే కేబినెట్ ఎక్కువగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.
ఈరోజు ఏపీ సచివాలయంలో కేబినెట్ కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను తాజా ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు జగన్. దానివల్ల రాష్ట్ర ఖజానాకు భారీ స్థాయిలో లాభం చేకూరిందని, టెండర్ల ప్రక్రియలో అదో విప్లవం అని చెప్పేవారు. ఆ రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఇకపై ఏపీలో పాత టెండర్ల విధానమే కొనసాగుతుందని కేబినెట్ తీర్మానించింది. వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ పై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. కేబినెట్ భేటీకి మంత్రులు హాజరయ్యారు.#APCabinetMeeting #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/uHDsgqXyz2
— Telugu Desam Party (@JaiTDP) August 28, 2024
సెబ్ రద్దు..
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆబ్కారీ శాఖకు అనుబంధంగా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోని ఏర్పాటు చేశారు. ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్, మద్యం అక్రమ అమ్మకాలు, గంజాయి సరఫరా వంటి వాటిపై సెబ్ సిబ్బంది దాడులు చేసేవారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెబ్ ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గతంలోని ఆబ్కారీ శాఖను పునర్ వ్యవస్థీకరిస్తామని తెలిపింది.
ఏపీలో పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో తొలగించేందుకు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ అంగీకారం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడున్న కాంట్రాక్ట్ సంస్థతే ఈ పనులు కూడా అప్పగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. కొత్త నిర్ణయాల కంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిలిపివేసే విషయంపైనే కేబినెట్ ఎక్కువగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. పేపర్ లెస్ కేబినెట్ మీటింగ్ గా దీన్ని ప్రభుత్వం అభివర్ణిస్తోంది. అజెండా కాపీ, నోట్స్.. ఇలా అన్నీ ఆన్‌లైన్‌లోనే మంత్రులకు అందజేశారు. ఈ-కేబినెట్ నిర్వహణపై మంత్రులకు, వారి పీఏలకు సాధారణ పరిపాలన శాఖ ముందుగానే శిక్షణ ఇచ్చింది.