బయ్యారం ఏమైంది..? గిరిజన వర్శిటీ సంగతేంటి..? కేటీఆర్ సూటి ప్రశ్నలు

తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం ములుగులో 350 ఎకరాలను గుర్తించి అప్పగించినా కేంద్రం మాత్రం గిరిజన యూనివర్శిటీ స్థాపించడంలో విఫలమైందని అన్నారు కేటీఆర్.

Advertisement
Update:2023-07-08 11:43 IST

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ వరుస ప్రశ్నలు సంధించారు. విభజన చట్టంలోని అంశాలను ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేసిన మోసం వల్ల ఉద్యోగ అవకాశాల్లో యువత నష్టపోయిందని అన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాలను కేంద్రం తొక్కిపెట్టిందని దుయ్యబట్టారు.


బయ్యారంలో సమీకృత ఉక్కు కర్మాగారంపై విభజన చట్టంలో స్పష్టమైన హామీ ఇచ్చినా ప్రధాని మోదీ నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. 9 ఏళ్ల కాలంలో తాము చేసిన విజ్ఞప్తులను ఆయన మరోసారి గుర్తు చేశారు. 9 ఏళ్లుగా గుర్తు చేస్తూనే ఉన్నా కేంద్రం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయలేదని, ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదని, తెలంగాణ ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు. బయ్యారంలో ఇనుప ఖనిజం, కర్మాగారానికి అవసరమైన భూమి, నీరు, విద్యుత్ బొగ్గు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి.. ఇతర వనరులన్నీ అందుబాటులో ఉన్నా కూడా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అన్నారు కేటీఆర్. అక్కడ కర్మాగారం ఏర్పాటు చేస్తే 15వేలమందికి ఉపాధి లభిస్తుందన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని డిమాండ్ చేశారు.


గిరిజన వర్శిటీ ఏమైంది..?

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన గిరిజన యూనివర్శిటీ హామీని కూడా కేంద్రం ఇప్పటి వరకూ నెరవేర్చలేదని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. గిరిజన వర్శిటీ ఉంటే రాష్ట్రంలోని వేలాదిమంది గిరిజన యువతకు ఉన్నత విద్యావకాశాలు లభించే అవకాశముందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం ములుగులో 350 ఎకరాలను గుర్తించి అప్పగించినా కేంద్రం మాత్రం యూనివర్శిటీ స్థాపించడంలో విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఉదాసీన వైఖరి విడనాడాలని, తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపించొద్దని కోరారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News