RRR ఫార్ములా అత్యవసరం.. మంత్రి కేటీఆర్ పిలుపు
ఇకపై ప్రతి శనివారం 'రీథింక్ డే' గా పాటించాలని సూచించారు మంత్రి కేటీఆర్. రీథింక్ నాలెడ్జ్ హబ్ లో ప్రజల భాగస్వామ్యం ఉండాలని కోరారు.
RRR ఫార్ములా ఫాలో కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. రెడ్యూస్, రీ యూజ్, రీసైకిల్ అనే మూడింటిని అందరూ అలవాటు చేసుకోవాలంటున్నారాయన. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రీ థింక్ నాలెడ్జ్ హబ్ ని ప్రారంభించిన కేటీఆర్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు మనం ఆదర్శంగా నిలవాలని చెప్పారు.
పర్యావరణ హానికారకాల్లో ప్రథమ ముద్దాయి ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ ని విచ్చలవిడిగా వాడేస్తూ కాలుష్యానికి ప్రత్యక్ష, పరోక్ష కారణంగా నిలుస్తోంది మనమే. ప్లాస్టిక్ మాత్రమే కాదు, మిగతా వస్తువుల వినియోగంలో కూడా జాగ్రత్తపడితేనే ముందు తరాల మనుగడ సజావుగా ఉంటుంది. అందుకు RRR అవసరం అని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇకపై ప్రతి శనివారం 'రీథింక్ డే' గా పాటించాలని సూచించారు మంత్రి కేటీఆర్. ఈ కాన్సెప్ట్ ని డెవలప్ చేసినందుకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాని ఆయన అభినందించారు. రీథింక్ నాలెడ్జ్ హబ్ లో ప్రజల భాగస్వామ్యం ఉండాలని కోరారు. వారినుంచి కొత్త ఆలోచనలు వస్తే, ఆచరణ మరింత సులభతరం అవుతుందని చెప్పారు.
ప్లాస్టిక్ సహా, ఇతర వస్తువుల వినియోగాన్ని వీలైనంత తగ్గించడం, వీలైతే వాటిని పదే పదే వినియోగిస్తూ కొత్త వస్తువుల కొనుగోళ్లను తగ్గించడం, పూర్తిగా పనికిరాకుండా పోయిన తర్వాత వాటిని రీసైకిల్ చేయడం ద్వారా కొత్త ఉత్పాదనలో వాటి భాగస్వామ్యాన్ని కూడా చేర్చడం వంటివి RRR ఫార్ములాలో ఉన్నాయి. వినియోగాన్ని తగ్గించడం, పునర్వినియోగాన్ని పెంచడం, రీసైకిల్ చేయడం.. ఈ మూడింటి ద్వారా పర్యావరణాన్ని వీలైనంత మేర కాపాడుకోగలం.