మంత్రుల్ని టార్గెట్ చేస్తే బీజేపీలో గెలిచేదెవరు..?

సీఎం కేసీఆర్ సహా బీఆర్ఎస్ మంత్రుల్ని టార్గెట్ చేసుకుని బీజేపీ కీలక నేతల్ని బరిలోకి దింపుతోందని అంటున్నారు. ప్రస్తుతానికి ఇది అధికారికం కాకపోయినా బీజేపీ నుంచి మాత్రం బలమైన లాజిక్ వినపడుతోంది.

Advertisement
Update:2023-08-31 13:49 IST

సీఎం కేసీఆర్ పై గజ్వేల్ లో ఈటల రాజేందర్..

కామారెడ్డిలో కేసీఆర్ పై ఎంపీ అర్వింద్

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్

సిద్ధిపేటలో హరీష్ రావుపై బూర నర్సయ్య గౌడ్

మహేశ్వరంలో మంత్రి సబితకు పోటీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి పోటీగా డీకే అరుణ

కరీంనగర్ లో మంత్రి గంగులపై గుజ్జుల రామకృష్ణారెడ్డి

ఇలా బీజేపీ నుంచి ఓ 15మంది అభ్యర్థుల జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సీఎం కేసీఆర్ సహా బీఆర్ఎస్ మంత్రుల్ని టార్గెట్ చేసుకుని బీజేపీ కీలక నేతల్ని బరిలోకి దింపుతోందని అంటున్నారు. ప్రస్తుతానికి ఇది అధికారికం కాకపోయినా బీజేపీ నుంచి మాత్రం బలమైన లాజిక్ వినపడుతోంది.

ఎందుకీ వ్యూహం..?

తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలు కేసీఆర్ కి మళ్లీ పట్టం కట్టే అవకాశాలు బలంగా ఉన్నాయి. రాగా పోగా కాంగ్రెస్ కి కొన్ని స్థానాలు దక్కుతాయనే అంచనాలున్నా, బీజేపీ అధికారంలోకి వస్తుందనేది మాత్రం దాదాపుగా అసాధ్యం. దీంతో ఇప్పుడు బీజేపీ ఓ ట్రిక్ ప్లే చేయాలనుకుంటోంది. సీఎం కేసీఆర్ సహా మంత్రులందరికి పోటీగా బీజేపీలోని కీలక నేతల్ని బరిలో దింపాలనుకుంటోందట. ఈటల రాజేందర్ గజ్వేల్ లో, సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తారని, కామారెడ్డిలో అర్వింద్ పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

పోతే పోనీ..

మంత్రులందరిపై కీలక నేతల పోటీ అంటే బీజేపీ పెద్ద సాహసం చేస్తుందనే చెప్పాలి. ఆ సాహసం బెడిసికొట్టి బీజేపీ కీలక నేతలు ఓడిపోతే, అసలు కమలదళం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టేదెవరు..? ఈ ప్రశ్నే ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే, ఏడాదిలో జరగబోతున్న లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన వారందరికీ సీట్లిస్తామని బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చిందట. అందుకే ఈ సాహసం చేయబోతున్నట్టు తెలుస్తోంది.

నిజమెంత..?

ప్రస్తుతానికి బీజేపీకి చెందిన 15మంది లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్నికల వేళ ఇలాంటి జిమ్మిక్కులు చాలానే జరుగుతుంటాయి. ఈ వారంలోనే జాబితా అధికారికం అవుతుందని కూడా అంటున్నారు. అయితే వీరంతా మంత్రులపైనే పోటీ చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. అదే నిజమైతే.. మిగతా స్థానాలపై కాంగ్రెస్ కూడా ఫోకస్ పెంచే అవకాశముంది. 


Tags:    
Advertisement

Similar News