మోతెక్కిపోతున్న మొండిబకాయిలు.. ప్రైవేట్ బ్యాంక్ ల తిప్పలు
ఆర్బీఐ తాజా లెక్కల ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ బ్యాంకులుల్లో NPAల రద్దు 47.9శాతం ఉండగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అది కేవలం కేవలం 22.2 శాతం మాత్రమే.
బ్యాంకులు లాభాల్లో ఉన్నాయా లేదా నష్టాల్లోకి వెళ్తున్నాయా అని చెప్పేందుకు వాటికి ఉన్న మొండిబకాయి(NPA)ల విలువ తెలిస్తే చాలు. అయితే ఇలాంటి మొండి బకాయిల్ని ఎప్పటికప్పుడు రైటాఫ్ పేరుతో రద్దు చేసి బ్యాంకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటాయి. ఈ విషయంలో ప్రైవేటు బ్యాంకులు ఇప్పుడు మరింత దూకుడుగా ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ లో NPA ల రద్దు విషయంలో ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వరంగ బ్యాంకులకంటే ఉదారంగా ఉన్నాయి.
ఆర్బీఐ తాజా లెక్కల ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ బ్యాంకులుల్లో NPAల రద్దు 47.9శాతం ఉండగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అది కేవలం కేవలం 22.2 శాతం మాత్రమే. అంతమాత్రాన ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి అద్భుతంగా ఉందని చెప్పలేం. ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా రైటాఫ్ ల శాతం ఏడాదికేడాది పెరుగుతోంది. అయితే ప్రైవేటు రంగంలో మాత్రం గత మూడేళ్లలో 26నుంచి 31 శాతానికి అక్కడినుంచి 47.9 శాతానికి రైటాఫ్ లు పెరిగాయి.
ఎందుకీ అవస్థ..?
రైటాఫ్ చేయడం, మొండి బకాయుల్ని వదిలేసుకోవడం బ్యాంకులకు సరదా కాదు. అయితే ఎప్పటికప్పుడు ఇలాంటి బాకీలను లెక్కల్లోనుంచి తొలగిస్తేనే షేర్ మార్కెట్లో ఆయా బ్యాంకుల విలువ పడిపోకుండా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు రైటాఫ్ ద్వారా తమ బ్యాలెన్స్ షీట్ లను అద్భుతంగా చూపించుకుంటాయి బ్యాంకులు. ఒకరకంగా ఇది ఆత్మవంచన లాంటిదే. వసూలు చేసుకోలేని బాకీల సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతుండటం ప్రమాదమే. ఈ ఏడాది ప్రైవేటు రంగంలోని బ్యాంకుల్లో అది 47.9శాతానికి చేరుకోవడం ప్రమాదాలకు సంకేతంగా కనపడుతోంది.
అయితే రైటాఫ్ అనేది రుణమాఫీ కాదు. బాకీదారుడికి ఆస్తులకు విలువ లేనట్టుగా లెక్కల్లో చూపెడతారు. ఆ తర్వాత తిరిగి బాకీ చెల్లింపులు జరిగితే వాటిని జమా ఖర్చులో చూపిస్తారు. మొండిబకాయిల రద్దు పెరిగిపోతుంది అంటే.. దురుద్దేశపూరితంగా రుణాలు తీసుకుని, కావాలని ఎగవేస్తున్న వైట్ కాలర్ మోసగాళ్ల సంఖ్య పెరిగిపోతున్నట్టే లెక్క.