జనం కోరితే జాతీయ పార్టీ.. తగ్గేదే లేదన్న కేసీఆర్..
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయమైనట్టే కనిపిస్తోంది. ప్రజలు ఆశీర్వదిస్తే ప్రధాని మోదీని దేశం నుంచి తరిమికొడతాను, ఢిల్లీ పీఠం బద్దలు కొడతానంటూ ఇటీవల బీజేపీపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం కేసీఆర్, తాజాగా.. జాతీయ పార్టీ పెడతానంటూ ప్రకటించారు. జనం కోరితే జాతీయ పార్టీ పెడతా, ఢిల్లీలో చక్రం తిప్పుతానని అన్నారు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే వంటి వారంతా తనతో టచ్ లో ఉన్నారని.. మోదీని గద్దె దించడం, జైలుకి పంపడం ఖాయం అని […]
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయమైనట్టే కనిపిస్తోంది. ప్రజలు ఆశీర్వదిస్తే ప్రధాని మోదీని దేశం నుంచి తరిమికొడతాను, ఢిల్లీ పీఠం బద్దలు కొడతానంటూ ఇటీవల బీజేపీపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం కేసీఆర్, తాజాగా.. జాతీయ పార్టీ పెడతానంటూ ప్రకటించారు. జనం కోరితే జాతీయ పార్టీ పెడతా, ఢిల్లీలో చక్రం తిప్పుతానని అన్నారు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే వంటి వారంతా తనతో టచ్ లో ఉన్నారని.. మోదీని గద్దె దించడం, జైలుకి పంపడం ఖాయం అని అన్నారు.
కొన్నిరోజులుగా బీజేపీని ఏకిపారేస్తున్న కేసీఆర్, తాజాగా గంటన్నరసేపు విలేకరు సమావేశం నిర్వహించి మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. హిందీలో ప్రసంగిస్తూ మోదీ పాలన అంతా అవినీతి మయం అంటూ కొన్ని ఉదాహరణలు చూపించారు. రఫేల్ విమానాల కొనుగోళ్ల విషయంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, మోదీ జైలుకెళ్లడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. బీజేపీ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి కంపేనని, దేశం మొత్తం సర్వ నాశనమవుతోందని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, బీజేపీ పచ్చి అబద్ధాలతో దేశ ప్రజలను మోసం చేస్తోందన్నారు. బ్యాంకులను లూటీ చేసే ఘోరమైన గజదొంగలను సురక్షితంగా దేశం బయటికి పంపారని, రైతుల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలనడం దుర్మార్గమని, విద్యుత్ సంస్కరణలు వెంటనే నిలిపివేయాలన్నారు.
నేను దమ్మున్నోడిని..
అవసరం వస్తే తప్పకుండా జాతీయ పార్టీ పెడతానన్నారు కేసీఆర్. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు, ప్రత్యేక తెలంగాణ సాధిస్తామన్నప్పుడు అందరూ నవ్వుకున్నారని, కానీ ఇప్పుడేమైందని అన్నారు కేసీఆర్. జనం ప్రభంజనమైతే ఏదైనా సాధ్యమేనని చెప్పారు. చాయ్ అమ్ముకున్నానని చెప్పుకునే మోదీ ప్రధాని కాలేదా, సినీ నటులు ఎంజీఆర్, ఎన్టీఆర్ ముఖ్యమంత్రులు కాలేదా అని ప్రశ్నించారు. ఏం జరుగుతుందో తనకు తెలియదు కానీ.. ఏదో ఒకటి మాత్రం జరుగుతుందని, జాతీయ పార్టీ పెడతానని, తనకు ఆ దమ్ము ఉందని చెప్పారు కేసీఆర్.
కాంగ్రెస్ తో కలిసే అవసరం మాకేంటి..?
ఇటీవల రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడితే, కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కలుస్తోందనే పుకార్లు వ్యాపించాయని, తెలంగాణలో బలంగా ఉన్న తమకు ఏ పార్టీతోనూ కలిసే అవసరం లేదన్నారు. దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ పుట్టుక గురించి బీజేపీ నేతలు విమర్శించడం, కనీసం ప్రధాని వాటిని ఖండించకపోవడం సరికాదన్నారు కేసీఆర్.
ఇటీవల కాలంలో ఓ పద్ధతి ప్రకారం బీజేపీపై మాటల దాడి పెంచారు కేసీఆర్. బడ్జెట్ పై స్పందించడం, జిల్లాల పర్యటనల్లో కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించడం, ఇప్పుడు కేవలం బీజేపీని తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టడం.. ఇదంతా చూస్తుంటే కేసీఆర్ ఇక ఏమాత్రం ఆలస్యం చేసేలా లేరని అర్థమవుతోంది. రెండేళ్ల ముందుగానే జాతీయ రాజకీయాల్లో అరంగేట్రానికి ఆయన పావులు కదుపుతున్నారు. బీజేపీని ఓడించే బలమైన కూటమికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తే.. కేసీఆర్ లాంటి మరికొందరు ఆశావహులకు, కూటముల విషయంలో మరింత క్లారిటీ వస్తుంది.