కొహ్లి దుస్థితికి రవిశాస్త్రే కారణమా? పాతాళానికి పడిపోయిన విరాట్!
ఆధునిక క్రికెట్లో భారత దిగ్గజ ఆటగాడు విరాట్ కొహ్లి గత మూడేళ్లుగా స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోడం, ర్యాంకింగ్స్ లో పాతాళానికి పడిపోడానికి మాజీ శిక్షకుడు, విఖ్యాత కామెంటీటర్ రవిశాస్త్రే కారణమా? భారత క్రికెట్ ప్రధానశిక్షకుడిగా రవిశాస్త్రి పదవీకాలం ముగిసినా ఇప్పటికీ విరాట్ కొహ్లీకి తాను శిక్షకుడినేనన్న భావన రవిశాస్త్రిలో కనిపిస్తోందా? అన్నప్రశ్నలకు..క్రికెట్ విమర్శకుల నుంచి ఔననే సమాధానం వస్తోంది. టాప్ ర్యాంక్ నుంచి 10వ ర్యాంక్ కు… క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారత అత్యుత్తమ ఆటగాడిగా, టాప్ […]
ఆధునిక క్రికెట్లో భారత దిగ్గజ ఆటగాడు విరాట్ కొహ్లి గత మూడేళ్లుగా స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోడం, ర్యాంకింగ్స్ లో పాతాళానికి పడిపోడానికి మాజీ శిక్షకుడు, విఖ్యాత కామెంటీటర్ రవిశాస్త్రే కారణమా? భారత క్రికెట్ ప్రధానశిక్షకుడిగా రవిశాస్త్రి పదవీకాలం ముగిసినా ఇప్పటికీ విరాట్ కొహ్లీకి తాను శిక్షకుడినేనన్న భావన రవిశాస్త్రిలో కనిపిస్తోందా? అన్నప్రశ్నలకు..క్రికెట్ విమర్శకుల నుంచి ఔననే సమాధానం వస్తోంది.
టాప్ ర్యాంక్ నుంచి 10వ ర్యాంక్ కు…
క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారత అత్యుత్తమ ఆటగాడిగా, టాప్ ర్యాంకర్ గా, విజయవంతమైన కెప్టెన్ గా ఓ వెలుగు వెలిగిన విరాట్ కొహ్లి..2019 సీజన్లో తన చిట్టచివరి అంతర్జాతీయ శతకాన్ని సాధించాడు. ఆ తర్వాత నుంచి విరాట్ ను మూడంకెల స్కోరు వెక్కిరిస్తూ వస్తోంది. అలవోకగా శతకాలు బాదే విరాట్…కనీసం అర్థశతకాలు సాధించడానికి ఆపసోపాలు పడాల్సి వస్తోంది.
అరుదైన విజయాలు సాధించినా?
2017లో భారతజట్టు ప్రధాన శిక్షకుడిగా రవిశాస్త్రి పగ్గాలు చేపట్టడం వెనుక కెప్టెన్ విరాట్ కొహ్లి చొరవ, పూనిక ఎంతో ఉంది. కొహ్లి నాయకుడిగా, రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా భారత్ పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించడం ద్వారా సిరీస్ నెగ్గి నాలుగు దశాబ్దల కలను సాకారం చేసుకుంది. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చతికిలబడినా రన్నరప్ గా నిలిచింది. ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ మొదటి నాలుగు టెస్టుల్లోనే 2-1తో పైచేయి సాధించగలిగింది. ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ ఫైనల్స్ చేరినా రన్నరప్ గా నిలిచింది. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్స్ లో విఫలమైన భారత్…టీ-20 ప్రపంచకప్ లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టింది. రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా…విరాట్ కొహ్లి పని ఆడిందే ఆటగా సాగింది. శాస్త్రి అండ చూసుకొని విరాట్ కొహ్లి తనకు అడ్డేలేదన్నట్లుగా ప్రవర్తించడం విమర్శలకు దారితీసింది. చివరకు క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కొహ్లి కెప్టెన్సీని కోల్పోవాల్సి వచ్చింది.
ఫ్లాప్ వెంట ఫ్లాప్….
భారతజట్టు ప్రధాన శిక్షకుడిగా రవిశాస్త్రి పదవీకాలం ముగియటంతోనే విరాట్ కొహ్లి ప్రభ మసకబారటం మొదలయ్యింది. దీనికితోడు..వ్యక్తిగతంగా కూడా విరాట్ ఆటతీరు పతనం అంచులకు చేరింది. భారత టాపార్డర్ కు కొండంత అండగా ఉండాల్సిన కొహ్లి వరుస వైఫల్యాలతో చివరకు జట్టుకే భారంగా తయారయ్యాడు. దానికితోడు ఐపీఎల్ -2022 టోర్నీలోనూ దారుణంగా విఫమయ్యాడు. దీంతో…కొంతకాలం ఆటకు దూరంగా ఉండాలంటూ కొహ్లికి రవిశాస్త్రి సలహా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కొహ్లి లాంటి అసాధారణ ఆటగాళ్లు ఆటకు దూరంగా ఉండటం మంచిది కాదని, కామెంటీటర్ గా ఉన్న రవిశాస్త్రి ఇప్పటికీ తానే భారత ప్రధాన శిక్షకుడినేనన్న భావనతో సలహాలు ఇవ్వటం ఎంతవరకూ సబబు అని పాక్ మాజీ కెప్టెన్, క్రికెట్ వ్యాఖ్యాత రషీద్ లతీఫ్ ప్రశ్నించాడు. రవిశాస్త్రితో విరాట్ కొహ్లి మితిమీరిన సాన్నిహిత్యం అసలుకే మోసం తెచ్చిందని, విరాట్ లాంటి ఆటగాడు మూడేళ్లపాటు వరుసగా విఫలం కావటానికి రవిశాస్త్రే బాధ్యుడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లండ్ తో త్వరలో జరిగే ఆఖరి టెస్టులోనైనా విరాట్ కొహ్లి సత్తా చాటుకోడం ద్వారా విమర్శకులకు తగిన సమాధానం చెప్పాల్సి ఉంది.