దేశవాళీ క్రికెట్లో ప్రపంచ రికార్డులు 42వ టైటిల్ కి ముంబై గురి!
దేశవాళీ క్ర్రికెట్లోనే అతిపెద్ద టైటిల్ సమరం ..2021-22 సీజన్ ఫైనల్స్ కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. కరోనా దెబ్బతో గత ఏడాది రద్దుల పద్దులో చేరిన రంజీమ్యాచ్ లను బీసీసీఐ ఈ ఏడాది నిర్వహిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్ర్రాలకు చెందిన 28 జట్లు తలపడిన ఈటోర్నీ నాకౌట్ దశ నుంచే ప్రపంచ రికార్డుల మోత ప్రారంభమయ్యింది. బెంగాల్, ఉత్తర ప్రదేశ్ జట్లు సెమీఫైనల్స్ దశ నుంచే నిష్క్ర్రమించడంతో మాజీ చాంపియన్ ముంబై, సంచలనాల మధ్యప్రదేశ్ […]
దేశవాళీ క్ర్రికెట్లోనే అతిపెద్ద టైటిల్ సమరం ..2021-22 సీజన్ ఫైనల్స్ కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. కరోనా దెబ్బతో గత ఏడాది రద్దుల పద్దులో చేరిన రంజీమ్యాచ్ లను బీసీసీఐ ఈ ఏడాది నిర్వహిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్ర్రాలకు చెందిన 28 జట్లు తలపడిన ఈటోర్నీ నాకౌట్ దశ నుంచే ప్రపంచ రికార్డుల మోత ప్రారంభమయ్యింది. బెంగాల్, ఉత్తర ప్రదేశ్ జట్లు సెమీఫైనల్స్ దశ నుంచే నిష్క్ర్రమించడంతో మాజీ చాంపియన్ ముంబై, సంచలనాల మధ్యప్రదేశ్ జట్లు టైటిల్ సమరానికి అర్హత సంపాదించాయి.
రంజీట్రోఫీకి మరోపేరు ముంబై…
భారత క్రికెట్ కే గర్వకారణంగా, చిరునామాగా నిలిచే రంజీట్రోఫీ 88 సంవత్సరాల చరిత్రలో 47సార్లు ఫైనల్స్ చేరిన ఒకే ఒక్కజట్టు, 41సార్లు టైటిల్ నెగ్గిన ఏకైకజట్టుగా ముంబైకి తిరుగులేని రికార్డే ఉంది. అజిత్ వాడేకర్, సంజయ్ మంజ్రేకర్, సచిన్ టెండుల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్ సర్కార్, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్, అజింక్యా రహానే లాంటి ఎందరో గొప్పగొప్ప ఆటగాళ్లను అందించిన ఘనత ముంబైకి ఉంది. దేశవాళీ క్రికెట్ దిగ్గజంగా పేరుపొందిన ముంబైజట్టు.. రోహిత్ శర్మ, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్ లాంటి పలువురు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోడంతో … యువఆటగాడు పృథ్వీ షా నాయకత్వంలో ప్రస్తుత సీజన్ పోరులో తనకే సాధ్యమైన విజయాలు సాధిస్తూ..నాలుగేళ్ల విరామం తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది.
క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రికార్డు…
రంజీ ట్రోఫీ కమ్ ఫస్ట్ క్లాస్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన జట్టుగా ముంబై చరిత్ర సృష్టించింది. ఉత్తరాఖండ్‌తో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో కనీవినీ ఎరుగని రీతిలో 725 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. గతంలో ఫస్ట్‌క్లాస్ చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించిన జట్టుగా న్యూసౌత్ వేల్స్ నిలిచింది. 92 ఏళ్ల క్రితం.. 1929-30లో షఫీల్డ్‌షీల్డ్ క్రికెట్‌లో న్యూ సౌత్‌వేల్స్‌జట్టు.. క్వీన్స్‌ల్యాండ్‌పై 685 పరుగుల తేడాతో విజయం సాధించడం ఇప్పటివరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రికార్డుగా ఉంది. తాజగా ముంబై ఆ రికార్డును బద్దలు కొట్టింది.
500 మ్యాచ్ ల ముంబై…
రంజీట్రోఫీ చరిత్రలోనే 500కు పైగా మ్యాచ్ లు ఆడిన ఏకైకజట్టు ఘనతను ముంబై దక్కించుకొంది. వాంఖెడీ స్టేడియం వేదిగా బరోడాతో జరిగిన మ్యాచ్ ద్వారా ముంబై 500 రంజీ మ్యాచ్ ల మైలురాయిని చేరుకోగలిగింది. ఇక..ఉత్తరప్రదేశ్ తో ముగిసిన సెమీఫైనల్లో సైతం ముంబై తిరుగులేని విజయం సాధించడం ద్వారా ఫైనల్లో 47వసారి అడుగుపెట్టింది. పృధ్వీ షా, సర్ ఫ్రాజ్ ఖాన్, అర్మాన్ జాఫర్,యశస్వీ జైస్వాల్ లాంటి ప్రతిభావంతుదైన యువ ఆటగాళ్లతో ముంబై రికార్డుస్థాయిలో 42వ టైటిల్ కు గురిపెట్టింది. అమోల్ ముజుందార్ ప్రధాన శిక్షకుడుగా టైటిల్ సమరంలో హాట్ ఫేవరెట్ గా నిలిచింది.
తొలిసారిగా ఫైనల్లో మధ్యప్రదేశ్…
మరోవైపు..చంద్రకాంత్ పండిట్ ప్రధాన శిక్షకుడుగా మధ్యప్రదేశ్ జట్టు తొలిసారిగా రంజీట్రోఫీ ఫైనల్ కు చేరడం ద్వారా టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉంది. స్టార్ ప్లేయర్ రజత్ పాటీదార్ పైనే మధ్యప్రదేశ్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. ఐదురోజులపాటు సాగే ఈ టైటిల్ సమరంలో ముందుగా బ్యాటింగ్ దిగి 600కు పైగా పరుగులు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. తొలి ప్రయత్నంలోనే మధ్యప్రదేశ్ టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టిస్తుందా? లేక ముంబై 42వసారి విజేతగా నిలవడం ద్వారా తన రికార్డును తానే తిరగరాస్తుందా? తెలుసుకోవాలంటే మరో ఐదురోజులపాటు వేచి చూడక తప్పదు.