గుండెపై గాబరా.. ఆన్ లైన్ కన్సల్టేషన్లే ఆసరా..
ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బుల కేసులు పెరుగుతున్నాయి. భారత్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. భారత్ లో ప్రతి ఏటా 30లక్షల మంది గుండె సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా తర్వాత ఆ ప్రభావం మరంత పెరిగిందనే అనుమానాలూ ఉన్నాయి. అదే సమయంలో 40-50 మధ్య వయసు వారు ఎక్కువగా గుండెపోటుకి గురికావడం, కార్డియాక్ అరెస్ట్ తో మరణించడం, కొంతమంది ప్రముఖుల మరణాలు కూడా ప్రజల్లో ఆందోళనకు కారణం అవుతున్నాయి. దీంతో గుండెపై గాభరాతో […]
ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బుల కేసులు పెరుగుతున్నాయి. భారత్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. భారత్ లో ప్రతి ఏటా 30లక్షల మంది గుండె సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా తర్వాత ఆ ప్రభావం మరంత పెరిగిందనే అనుమానాలూ ఉన్నాయి. అదే సమయంలో 40-50 మధ్య వయసు వారు ఎక్కువగా గుండెపోటుకి గురికావడం, కార్డియాక్ అరెస్ట్ తో మరణించడం, కొంతమంది ప్రముఖుల మరణాలు కూడా ప్రజల్లో ఆందోళనకు కారణం అవుతున్నాయి. దీంతో గుండెపై గాభరాతో ఆస్పత్రులను సంప్రదించేవారి సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆన్ లైన్ కన్సల్టేషన్ల సంఖ్య అధికంగా ఉండటం.. ఆస్పత్రుల్లో నేరుగా సంప్రదించేవారి సంఖ్య 150శాతానికి పెరగగా, ఆన్ లైన్ లో సంప్రదించేవారి సంఖ్య 300 శాతానికి పైగా పెరగడం గమనార్హం.
కొవిడ్ తర్వాత పెరిగిన ఆందోళన..
కొవిడ్ నుంచి కోలుకున్న చాలామందిలో తర్వాత ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తిన ఉదాహరణలున్నాయి. అందులో కొంతమంది గుండె సంబంధిత అనారోగ్యాల బారిన పడ్డారు. దీంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారి సంఖ్య పెరిగింది. గుండె ఆరోగ్య రక్షణపై ప్రజల్లో శ్రద్ధ పెరిగింది. గడిచిన ఏడాది కాలంలో కార్డియాలజీకి సంబంధించి పురుషుల ఆన్ లైన్ సంప్రదింపులు 300 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ (IHA) నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆస్పత్రుల్లో నేరుగా సంప్రదించేవారు, ఆన్ లైన్ ద్వారా డాక్టర్లను కన్సల్ట్ అవుతున్నవారిలో 60 శాతం మంది 21-40 ఏళ్ల మధ్య వయసువారు ఉన్నట్టు తేలింది.
50 ఏళ్ల లోపువారే ఎక్కువ…
దేశంలో గుండెపోటుకు గురవుతున్న పురుషుల్లో 50 శాతం మంది 50 ఏళ్ల లోపు వారు, 25 శాతం మంది 40 ఏళ్ల లోపు వారు ఉన్నట్టు IHA తెలిపింది. ఆన్ లైన్ ద్వారా గుండె నిపుణులను సంప్రదిస్తున్న వారిలో 60 శాతం మంది మెట్రో నగరాలకు చెందినవారు కాగా.. మిగిలిన 40శాతం మంది చిన్న స్థాయి పట్టణాలకు చెందినవారు ఉన్నారు. ఇలా ఆన్ లైన్ లో సంప్రదిస్తున్నవారిలో ఎక్కువమంది కరోనా ప్రభావం గుండెపై ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నారట. కార్డియాక్ అరెస్ట్, కరోనరీ ఆర్డరీ డిసీజ్.. ఇతర గుండె సమస్యల వివరాలు అడిగి తెలుసుకుని.. ఆన్ లైన్ లోనే వైద్య సలహాలు తీసుకుంటున్నారట. ప్రజల్లో అవగాహన పెరగడం మంచిదే అయినా.. ఆన్ లైన్ సంప్రదింపుల కంటే.. నేరుగా వైద్యులను కలవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి జీవనశైలి అలవాటు చేసుకోవాలని, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.