కరోనా కంటే క్రూరం... పేషంటుపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం !
కరోనా విపత్తు… అంతకంటే ప్రమాదకరమైన మానవ ప్రవర్తనలను మన కళ్లముందుకు తెస్తోంది. కోవిడ్ 19తో బాధపడుతూ చికిత్స కోసం అంబులెన్స్ ఎక్కిన యువతిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం చేసిన అత్యంత దారుణమైన ఘటన కేరళలోని పతనంతిట్ట అనే జిల్లాలో చోటు చేసుకుంది. డ్రైవర్ పేరు నౌఫాల్. పోలీసులు డ్రైవర్ ని అరెస్టు చేశారు. అతనిపై… హత్యా ప్రయత్నం కేసు ఒకటి పెండింగ్ లో ఉందని వారు వెల్లడించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జివికె ఎమర్జన్సీ మేనేజ్ మెంట్ […]

కరోనా విపత్తు… అంతకంటే ప్రమాదకరమైన మానవ ప్రవర్తనలను మన కళ్లముందుకు తెస్తోంది. కోవిడ్ 19తో బాధపడుతూ చికిత్స కోసం అంబులెన్స్ ఎక్కిన యువతిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం చేసిన అత్యంత దారుణమైన ఘటన కేరళలోని పతనంతిట్ట అనే జిల్లాలో చోటు చేసుకుంది. డ్రైవర్ పేరు నౌఫాల్. పోలీసులు డ్రైవర్ ని అరెస్టు చేశారు. అతనిపై… హత్యా ప్రయత్నం కేసు ఒకటి పెండింగ్ లో ఉందని వారు వెల్లడించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జివికె ఎమర్జన్సీ మేనేజ్ మెంట్ అండ్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్… కేరళలో అంబులెన్స్ సర్వీసుని నడుపుతోంది. ఉద్యోగంలో చేరేముందు నౌఫాల్ అందుకు అవసరమైన చట్టపరమైన అనుమతి పత్రం కూడా తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు.
ఎస్ పి కెజి సిమోన్ వెల్లడించిన వివరాలను బట్టి… బాధితురాలైన 19 ఏళ్ల యువతి, నలభై ఏళ్ల మహిళ ఆదూర్ అనే ఊళ్లో అంబులెన్స్ ఎక్కారు. యువతిని పెండలమ్ లో ఉన్న కోవిడ్ ఫస్ట్ టైమ్ చికిత్సా సెంటరుకి తీసుకుని వెళ్లాల్సి ఉంది. అలాగే మహిళను అరన్ ములా అనే ప్రాంతంలో ఉన్న కోవిడ్ సెంటర్ లో చేర్చాలి. ఆదూర్ నుండి అరన్ ములా వెళుతున్నపుడు మధ్యలో పెండలమ్ వస్తుంది. కానీ అంబులెన్స్ డ్రైవర్ నేరుగా అరన్ ములా వెళ్లిపోయి మహిళను అక్కడ దింపేసి… అప్పుడు యువతితో పెండలమ్ బయలుదేరాడు. మధ్యలో ఎవరూలేని ఒక ప్రాంతంలో అంబులెన్స్ ఆపి యువతిపై అత్యాచారం చేశాడు. తరువాత ఆమెని కోవిడ్ సెంటర్ కి తీసుకుని వెళ్లాడు.
హాస్పటల్ లో దింపేముందు యువతికి క్షమాపణ చెప్పి ఎవరికీ చెప్పవద్దని కోరాడు. అయితే యువతి తమ మధ్య జరిగిన సంభాషణని ఫోన్ లో రికార్డు చేసి… హాస్పటల్ సిబ్బందికి వినిపించింది. దాంతో పోలీసులు డ్రైవర్ ని అరెస్టు చేశారు. యువతి పరిస్థితి నిలకడగా ఉందని ఎస్ పి తెలిపారు.
ఒకరికంటే ఎక్కువమంది పేషంట్లు ఒకే ప్రాంతంలో ఉన్నపుడు వారికి అంబులెన్స్ పంపుతున్నామని హాస్పటల్ సిబ్బంది వెల్లడించారు. పేషంట్ పరిస్థితి సీరియస్ గా ఉన్నపుడు నర్సులను పంపుతున్నామని… ఈ సంఘటనలో ఇద్దరు పేషంట్ల ఆరోగ్య స్థితి నిలకడగా ఉండటం వలన డ్రైవర్ ఒక్కడే వెళ్లాడని వారు తెలిపారు.
ఈ ఘటన రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో విపరీతమైన కలకలం రేపటంతో ఆరోగ్యశాఖా మంత్రి కెకె శైలజ దీనిపై స్పందించారు. ఇది చాలా షాక్ కి గురిచేసిన ఘటన అని… అంబులెన్స్ సర్వీసుని నిర్వహిస్తున్న జివికె ఎమర్జన్సీ మేనేజ్ మెంట్ అండ్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ ని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని ఆమె తెలిపారు.
డ్రైవర్ ని ఉద్యోగం నుండి తొలగించామని అతనిపై పోలీసు కేసు పెట్టామని జివికె ఇఎమ్ ఆర్ ఐ ఒక ప్రకటనలో పేర్కొంది. నౌఫాల్ ఉద్యోగంలో చేరేటప్పుడు పోలీసులనుండి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదని, త్వరలోనే ఆ సర్టిఫికెట్ అందజేస్తానని రాతపూర్వకంగా వెల్లడించి డ్యూటీలో చేరాడని జివికె ఇఎమ్ ఆర్ ఐ ఆ ప్రకటనలో తెలిపింది. మహిళా పేషంట్లను హాస్పటల్స్ కి తరలించేటప్పుడు సరైన భద్రత కల్పించాలనే డిమాండ్ ఇప్పుడు అక్కడ బలంగా వినబడుతోంది.