Telugu Global
WOMEN

ఆ ఏడుగురు అక్కాచెళ్ళెళ్ళు పోలీసులే..

బీహార్ రాష్ట్రంలో ఒకే కుటుంబంలోని ఏడుగురు అక్కాచెల్లెళ్లు అద్భుతం సృష్టించారు. పోలీసు శాఖతో పాటు దేశంలోని వివిధ భద్రతా విధుల్లో ఉద్యోగం సాధించారు.

ఆ ఏడుగురు అక్కాచెళ్ళెళ్ళు పోలీసులే..
X

బీహార్ రాష్ట్రంలో ఒకే కుటుంబంలోని ఏడుగురు అక్కాచెల్లెళ్లు అద్భుతం సృష్టించారు. పోలీసు శాఖతో పాటు దేశంలోని వివిధ భద్రతా విధుల్లో ఉద్యోగం సాధించారు. దీంతో సెవెన్​ సిస్టర్స్​’ పేర్లతో పాటు వారిని సరైన మార్గంలో నడిపించిన ఆ తల్లి దండ్రుల పేర్లు కూడా మార్మోగిపోతున్నాయి.

సరాన్‌ జిల్లా మాంఝీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నచాప్‌ గ్రామానికి చెందిన కమల్‌ సింగ్‌, శారదా దేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు , ఒక కుమారుడు. ఒక్క కొడుకు ఉంటే బాగుంటుందన్న ఆశతో వాళ్లు పిల్లలను కనుకుంటూ వెళ్లారు. చిట్టచివరికి కొడుకు జన్మించడంతో వారి కోరిక నెరవేరింది. అయితే 8 మంది పిల్లలను పోషణ కష్టమై కమల్‌సింగ్‌ దంపతులు నానా ఇబ్బందులు పడేవారు. వారిని చూసి గ్రామస్తులు నవ్వుకునేవారు. ఏడుగురు ఆడ పిల్లల పెళ్లిళ్లు ఎలా చేస్తారంటూ అవహేళనలు, అవమానాలు ఎదుర్కొంది ఆ జంట. ఇరుగుపొరుగువారు మానసిక వేదనకు గురి చేయటంతో ఒకానొక సమయంలో వారు సొంత గ్రామాన్ని విడిచి పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చప్రాలోని ఎక్మాకు వచ్చి స్థిరపడ్డాడు. వ్యవసాయం చేసుకుంటూనే తన కూమార్తెల సహాయంతో ఇంటి దగ్గర ఓ చిన్న పిండి గిర్నీని నడిపేవాడు తండ్రి కమల్ సింగ్ . వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే ఏడుగురు ఆడపిల్లలను చదివించారు.


అయితే, ప్రస్తుతం ఈ ఏడుగురు అక్కాచెల్లెళ్లు బీహార్​ పోలీసు శాఖతో పాటు వివిధ కేంద్ర సాయుధ బలగాలకు పోలీసులుగా ఎంపికై విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో మొదటి కుమార్తె 2006లోనే కానిస్టేబుల్​ గా ఎంపికయ్యారు. దీంతో మిగతా వారందరూ పోలీసు శాఖలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, వీరిలో రెండో సోదరి రాణి పెళ్లి తర్వాత 2009లో బీహార్​ పోలీస్​ శాఖలో కానిస్టేబుల్‌గా జాయిన్ అయ్యారు. అలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా మరో ఐదుగురు కూడా ఎక్సైజ్​ శాఖ, సీఆర్​పీఎఫ్, జీఆర్‌పీ సహా వివిధ కేంద్ర బలగాల్లో ఎంపికయ్యారు. ఉద్యోగానికి ఎంపిక అయ్యేందుకు ముందు కావాల్సిన నైపుణ్యాలు, మెలకువలను వీరందరూ తమ అక్కల ద్వారా నేర్చుకున్నారు. ఒకరికొకరు మార్గదర్శకులుగా మారారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తల్లిదండ్రులు గర్వపడేలా చేశారు.



ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న తమ తండ్రికి ఆసరాగా ఉండేందుకు కుమార్తెలందరూ కలిసి ఓ గొప్ప బహుమతి ఇచ్చారు. ఛప్రాలోని ఎక్మా బజార్‌లో ఓ నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. కష్టాలు పడి తమని చదివించిన తండ్రికి ఆ భవనం ద్వారా నెలకు రూ.18-20 వేల అద్దె అందేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు తమ బిడ్డలను చూసి కమల్‌ సింగ్‌ దంపతులు గర్వపడుతున్నారు. తాను ఆడబిడ్డలు భారమని ఏనాడు భావించలేదని, వారిని పెంచి పెద్దచేస్తే వాళ్ల బతుకు వాళ్లే బతుకుతారు అనే ధైర్యంతోనే ఉండేవాడినని చెప్పారు. కానీ ఇప్పుడు అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించితాను అనుకున్నదాని కంటే గొప్పగా బతుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశాడు కమల్ సింగ్.

ఇక వీరి తమ్ముడి ఆనందం అయితే అంతా ఇంతా కాదు. చాలాకాలం వరకు కొందరు స్నేహితులు, బంధువులు నీ ఏడుగురు అక్కలు నీ మొత్తం ఆస్తిని లాగేసుకుంటారు, నీ కోసం ఏమీ వదిలిపెట్టరు అని అనేవారట. అయితే ఇప్పుడు వారికి సమాధానంగా నా అక్కాచెల్లెళ్లు నా నుంచి ఏమీ తీసుకుపోలేదు సరి కదా, నా కోసం ఇంకా చాలానే చేసి పెట్టారని గర్వంగా చెబుతున్నానంటున్నాడు తమ్ముడు రాజా సింగ్.

First Published:  27 March 2024 7:22 AM GMT
Next Story