Telugu Global
Telangana

ఇక్కడ కాపలా ఉంది రేవంత్ రెడ్డి.. జాగ్రత్త

తమ ఎమ్మెల్యేలకు హైటెన్షన్ వైర్లు అడ్డుపెట్టి కాపాడుకుంటానన్నారు రేవంత్ రెడ్డి. ఆ వైర్లను దాటి వారి వద్దకు రావాలనుకుంటే మాడి మసైపోతారు జాగ్రత్త అని చెప్పారు.

ఇక్కడ కాపలా ఉంది రేవంత్ రెడ్డి.. జాగ్రత్త
X

20మంది ఎమ్మెల్యేలతో కలసి కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు బీఆర్ఎస్ లోకి వస్తానన్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. చిటికేసినా మిద్దె ఎక్కి డప్పుకొట్టినా ఎవరూ ఆ పార్టీలోకి వెళ్లరన్నారు. గతంలోలాగే గొర్రెల్లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తారని వారు కాచుకు కూర్చున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మారిందని చెప్పారు. ఇక్కడ కాపలా ఉంది రేవంత్ రెడ్డి జాగ్రత్త అని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేలకు హైటెన్షన్ వైర్లు అడ్డుపెట్టి కాపాడుకుంటానన్నారు. ఆ వైర్లను దాటి వారి వద్దకు రావాలనుకుంటే మాడి మసైపోతారు జాగ్రత్త అని చెప్పారు రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ లో ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు.


పాలమూరుకు ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ నేతలు ఏం సాధించారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కి కనీసం జాతీయ హోదా సాధించలేకపోయారన్నారు. అసలు పాలమూరు ప్రజలు ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ హయాంలో యూనివర్శిటీకి అనుమతులు మంజూరు చేస్తే.. దాన్ని నిర్మించుకోవడం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేతకాలేదన్నారు. కారు రిపేర్‌కు వెళ్లలేదని, ఏకంగా షెడ్డుకి వెళ్లిందని, అదిక బయటకు రాదని సెటైర్లు పేల్చారు రేవంత్ రెడ్డి.

గతంలో పాలమూరు బిడ్డలు ఇతర ప్రాంతాలకు పనులకోసం వలస వెళ్లేవారని, ఇప్పుడు తాను ఇతర రాష్ట్రాలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నానని చెప్పారు రేవంత్ రెడ్డి. పాలమూరు బిడ్డను అని తాను గర్వంగా చెప్పుకుంటానన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే పాలమూరు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తెలంగాణకు ఏమీ చేయలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి.

First Published:  19 April 2024 9:46 AM GMT
Next Story