Telugu Global
Telangana

పొంగులేటి వర్సెస్ భట్టి.. సోషల్‌ మీడియా వార్‌

ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ ఎమ్మెల్యేలు, ఇద్దరు డీసీసీలు నందినికి మద్దతుగా నిలిచినప్పటికీ.. ఆమె అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పొంగులేటి వర్సెస్ భట్టి.. సోషల్‌ మీడియా వార్‌
X

కాంగ్రెస్‌లో ఖమ్మం సీటు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సీటు కోసం కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఓ వైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందినికి ఎంపీ టికెట్ కావాలని అడుగుతుండగా.. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్‌ రెడ్డి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరో మంత్రి తుమ్మల సైతం తన తనయుడు యుగేందర్‌కు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఖమ్మం కాంగ్రెస్‌లో సోషల్‌మీడియా వార్ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా పొంగులేటిపై భ‌ట్టి అనుచరులు మండిపడుతున్నారు. మల్లు నందినికి టికెట్ రాకుండా పొంగులేటి అడ్డుపడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మల్లు నందిని రాజకీయ భవితవ్యంపై కుట్ర జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు. పార్టీని కబ్జా చేసేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని.. అలాంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఖమ్మంలో పొంగులేటి సోదరుడికి టికెట్ ఇస్తే బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు.

మల్లు నందినికి చెక్‌ పెట్టేందుకు తెరపైకి ప్రియాంక, రాహుల్‌ గాంధీల పేర్లు తీసుకువస్తున్నారని చెప్తున్నారు భట్టి అనుచరులు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ ఎమ్మెల్యేలు, ఇద్దరు డీసీసీలు నందినికి మద్దతుగా నిలిచినప్పటికీ.. ఆమె అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిందెవరో కనిపించట్లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అభ్యర్థి విషయంలో జాప్యం చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని కాంగ్రెస్‌ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

First Published:  29 March 2024 5:26 AM GMT
Next Story