Telugu Global
Telangana

బీఆర్ఎస్ లో మరికొందరిపై అనుమానం.. ఎమ్మెల్యే సబిత ఉద్వేగ ప్రసంగం

సోషల్ మీడియాలో పుకార్లు మరీ దారుణంగా ఉంటున్నాయని చెప్పారు ఎమ్మెల్యే సబిత. తనకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి కూడా రిజర్వ్ చేసిపెట్టిందంటూ రూమర్లు సృష్టించారని ఆమె మండిపడ్డారు.

బీఆర్ఎస్ లో మరికొందరిపై అనుమానం.. ఎమ్మెల్యే సబిత ఉద్వేగ ప్రసంగం
X

బీఆర్ఎస్ ని వీడిపోతున్న నేతల్లో చాలామంది ఇతర పార్టీలనుంచి వచ్చి చేరినవారే. కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటున్నారు. కాంగ్రెస్ లోనే పుట్టాను, కాంగ్రెస్ లోనే తుది శ్వాస విడుస్తాను, బీఆర్ఎస్ లో నాది తీర్థయాత్ర అని కేకే లాంటి నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ని ఓ షెల్టర్ జోన్ లా భావించారు వాళ్లంతా. ఈ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చి బీఆర్ఎస్ లో చేరిన వారిపై అనుమానాలు మొదలవుతున్నాయి. సోషల్ మీడియా కూడా అలాంటి వారిని ఫోకస్ చేస్తోంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆపాలని, తాము బీఆర్ఎస్ ని వీడేది లేదని చెప్పారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న పుకార్లను ఆమె ఖండించారు.


నాకోసం మంత్రి పదవి కూడా..

సోషల్ మీడియాలో పుకార్లు మరీ దారుణంగా ఉంటున్నాయని చెప్పారు ఎమ్మెల్యే సబిత. తనకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి కూడా రిజర్వ్ చేసిపెట్టిందంటూ రూమర్లు సృష్టించారని ఆమె మండిపడ్డారు. తన కుమారుడు కార్తీక్ రెడ్డి చెప్పినట్టుగా తమ చివ‌రి శ్వాస వ‌ర‌కు కేసీఆర్ వెంటే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారామె. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం విస్తృత స్థాయి స‌మావేశంలో పాల్గొన్న ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. తాము పార్టీ మారబోమని స్పష్టం చేశారు.

తోటి ఎమ్మెల్యేలు చేవెళ్ల చెల్లెమ్మా అని ఆప్యాయంగా పిలిచినప్పుడల్లా తన మ‌న‌సు పుల‌క‌రించిపోయేదని చెప్పారు సబిత. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ బలహీనపడలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న తట్టు తాకిందని, దాంతో వెనక్కి వెళ్లాల్సిన అసరం లేదన్నారామె. ప్రతిపక్షంలో ఉండి కూడా ఎలా పోరాటం చేయాలో మనందరికీ తెలుసన్నారు సబిత. కేసీఆర్ సైన్యం అంటే ఏంటో చూపించాల్సిన సమయం వచ్చిందని, చేవెళ్ల ఎంపీ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్‌ను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుక‌గా ఇద్దామని పిలుపునిచ్చారు.

First Published:  29 March 2024 1:14 PM GMT
Next Story