Telugu Global
Editor's Choice

కాళేశ్వరం పంప్ హౌస్.. ఆరోపణలు, వాస్తవాలు..

కాళేశ్వరం పంప్ హౌస్ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టే విధంగా ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే సమగ్ర వివరణ ఇచ్చారు.

కాళేశ్వరం పంప్ హౌస్.. ఆరోపణలు, వాస్తవాలు..
X

గోదావరి వరదలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం, కన్నేపల్లి పంప్ హౌస్ లు నీట మునిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పంప్ హౌస్ లు నీట మునగడానికి కారణం ఏంటి..? గోదావరి వరదలా, లేక కాళేశ్వరం నిర్మాణంలో ఇంజినీరింగ్ లోపమా..? బీజేపీ విమర్శించిందంటే ఓ అర్థముంది, కేసీఆర్ ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో బురదజల్లేందుకే బండి సంజయ్ పసలేని ఆరోపణలు చేశారు, చివరకు నెటిజన్లతో చీవాట్లు తిన్నారు. కానీ టీజేఏసీ కూడా ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఈ విషయంలో తెలంగాణ సాగునీటి శాఖ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి సమగ్ర వివరణ ఇచ్చారు. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వరదలు సంభవించాయని, 2009 లో కృష్ణా నది వరదలకు శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రం, కల్వకుర్తి పంప్ హౌస్ మునిగిపోయాయని వాటిని అతి స్వల్ప కాలంలోనే పునరుద్దరించినామని పెంటారెడ్డి పేర్కొన్నారు. ఆయన వివరణ తర్వాత కూడా టీజేఏసీ ఆరోపణలు చేయడంతో ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే వాటిని తిప్పికొట్టారు. కాళేశ్వరం పంప్ హౌస్ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టే విధంగా ఆయన సమగ్ర వివరణ ఇచ్చారు.

ఇంజినీరింగ్ పరిజ్ఞానం, నాణ్యత లేకుండా కాళేశ్వరం కట్టారని, సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) నిర్దేశించిన స్థాయి వరద రాకుండానే రెండు పంప్ హౌస్ లు మునిగిపోయాయయని కోట్ల రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైందని టీజేఏసీ ఆరోపణ చేసింది. కానీ ఈ ఏడాది గోదావరి వరద 500 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వచ్చిందని అందుకే వరద ప్రవాహానికి పంప్ హౌస్ నీటమునిగిందని వివరణ ఇచ్చారు ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే. కేంద్ర జలసంఘం కాళేశ్వరం వద్ద అత్యున్నత వరద మట్టం (High Flood Level ) 107.05 మీటర్లుగా నిర్థారించింది. దానికి అనుగుణంగానే ప్రాజెక్ట్ కట్టారు. కానీ గోదావరిలో ఈనెల 14న 108.19 మీటర్లు వరదమట్టం నమోదైంది. అంటే CWC అంచనాలు కూడా తలకిందులయ్యాయి. ఆ ఉధృతికి కాళేశ్వరం ప్రాజెక్ట్ చెక్కుచెదరలేదంటే అది ఇంజినీరింగ్ గొప్పదనంగా భావించాలి. అసాధారణ వరద పరిస్థితి వల్ల పంప్ హౌస్ లు నీటమునిగాయి. ఇందులో నాణ్యతా లోపం, డిజైన్ లోపం ఎక్కడా లేదు. ఇది పూర్తిగా ప్రకృతి విపత్తు అని స్పష్టం చేశారు శ్రీధర్ దేశ్ పాండే.

బ్యారేజీల నిర్మాణం వల్ల నదీ ప్రవాహ మార్గం కుంచించుకు పోయిందని, బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ తో గతంలో కంటే తక్కువ వరదే వచ్చినా కాళేశ్వరానికి నష్టం జరిగిందని టీజేఏసీ ఆరోపించింది. దీనికి కూడా శ్రీధర్ సమగ్ర వివరణ ఇచ్చారు. డ్యాములకు, బ్యారేజీలకు తేడా తెలియని TJAC ఇంజనీరింగ్ నిపుణులు ఎవరో కాకి లెక్కలు కట్టారని మండిపడ్డారు. డ్యాంలు నీటి నిల్వ కోసం నిర్మిస్తారని, బ్యారేజీలు నీటిని మళ్లించే డైవర్షన్ స్ట్రక్చర్లు అని చెప్పారు. బ్యారేజీల వల్ల బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అనే ప్రశ్నే తలెత్తదని అన్నారు. పోలవరం రిజర్వాయర్ విషయంలో ఈ ఏడాది వచ్చిన వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావాలను అధ్యయనం చేయాలని, దానికి అనుగుణగా గోదావరి తీర ప్రాంతాల రక్షణకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తోందన్నారు.

అన్నారం బ్యారేజ్ మునకకు అసలు కారణం ఇది..

గోదావరి వరదతో ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో చిన్న చిన్న వాగులను తనలో కలవనివ్వదు. దాని వల్ల వాగు నీరు ఎగువకు ఎగదన్నుతుంది. అన్నారం బ్యారేజీ మునిగిపోవడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. చందనాపూర్ వాగు, ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కలవలేక పైకి ఎగదన్నడంతో అన్నారం పంప్ హౌస్ రక్షణ కోసం నిర్మించిన మట్టికట్ట పైనుంచి ప్రవహించి అన్నారం పంప్ హౌస్ మునిగిందని వివరించారు. ఈ సంగతులన్నీ విజ్ఞత ఉన్న ఎవరికైనా అర్థమవుతాయని, కానీ TJAC తరపున ఆరోపణ పత్రం రాసిన పెద్ద మనిషికి మాత్రం అర్థం కాలేదని, ఆ జ్ఞాన సంపన్నుడెవరో తెలిస్తే మా లాంటి వారు వినమ్రంగా ఒక నమస్కారం చేసుకుంటామని చెణుకులు విసిరారు శ్రీధర్ దేశ్ పాండే.

మేడిగడ్డ పంప్ హౌస్ గేట్లు విరిగిపోయాయనేది మరో ప్రధాన ఆరోపణ. కానీ దాని సామర్థ్యానికి మించి అసాధారణ వరద ఒత్తిడి వల్ల పంప్ హౌస్ రక్షణ గోడ విరిగిందని, అది డిజైన్ వైఫల్యం కాదని చెప్పారు శ్రీధర్ దేశ్ పాండే. 2009 లో కృష్ణా నదికి అసాధారణమైన వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రం, ఎస్.ఎల్.బి.సి. సొరంగం, కర్నూలు పట్టణం కూడా మునిగిపోయాయని, ఆనాడు జలవిద్యుత్ కేంద్రం మునకకు శ్రీశైలం డ్యామ్ డిజైన్ వైఫల్యం అని చెబితే ఎవరైనా నవ్విపోతారని అన్నారు. 2009 లో శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన విపత్తు లాంటిదే ఈ సంవత్సరం కడెం ప్రాజెక్ట్ కూడా ఎదుర్కొందని తెలియజేశారు.

ప్రకృతి విపత్తును అంగీకరించే సౌజన్యం లేని TJAC గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కిందని, ఇప్పుడు కూడా అదే పని చేస్తోందని మండిపడ్డారు శ్రీధర్ దేశ్ పాండే. TJAC ఈ కనీస విజ్ఞతను, సామాజిక బాధ్యతను ప్రదర్శించలేకపోతోందని విమర్శించారు. "తెలంగాణ జీవధార : కాళేశ్వరం ప్రాజెక్టు" అనే పుస్తకాన్ని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రచురించిందని, ఆ పుస్తకంలో అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే భారీ ప్రాజెక్టు అని, ప్రాజెక్టులో భారీ కట్టడాలు ఉండక తప్పదని, అవి నిజంగానే ఇంజనీరింగ్ అద్భుతాలని, ఇవి తాము చెప్పిన మాటలు కాదని, ప్రాజెక్ట్ కి అనుమతి ఇచ్చిన కేంద్ర జల సంఘం ఛైర్మన్ మసూద్ హుస్సేన్, చీఫ్ ఇంజనీర్ సికెఎల్ దాస్ చెప్పిిన వాస్తవాలని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకంగా ప్రఖ్యాతి గాంచిందని, గూగుల్ సెర్చ్ ఇంజన్ కూడా ఇదే చెపుతోందని అన్నారు.

కాళేశ్వరం ద్వారా ఏం సాధించామంటే..?

- ధర్మపురి నుంచి సమ్మక్క సాగర్ దాకా సుమారు 200 కిలోమీటర్ల మేర గోదావరి నదిని కాళేశ్వరం సజీవం చేసింది, నది ఎండిపోయే పరిస్థితి ఎప్పటికీ రాదు.

- గ్రామాల ముంపు, పునరావాసం లేకుండా 62.81 టీఎంసీల నీటిని నిల్వ చేయగలం.

- వేలాది చెరువులు, చెక్ డ్యాంల కింద సుమారు 20 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.

- సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల కరీంనగర్ జిల్లాల్లో సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.

- మిషన్ భగీరథ ద్వారా వేలాది గ్రామాలకు తాగునీరు, రాబోయే 50 ఏళ్ల వరకు గ్రేటర్ హైదబాదాద్ నగరానికి తాగునీరు, పరిశ్రమలకు నీటి సరఫరాకు కాళేశ్వరం పూర్తి భద్రత కల్పించింది.

- కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, మత్స్య పరిశ్రమ,టూరిజం, పట్ణాణాభివృద్ది, పర్యావరణం, దేశీయ జల రవాణా తదితర రంగాలను ప్రభావితం చేసి తెలంగాణా సమగ్ర వికాసానికి దోహదం చేసే ఒక ప్రగతి రథం అని వివరణ ఇచ్చారు ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే.

First Published:  19 July 2022 6:15 AM GMT
Next Story