Telugu Global
Sports

భారత మహిళా సెయిలర్ కు ఒలింపిక్స్ బెర్త్!

పారిస్ ఒలింపిక్స్ మహిళల సెయిలింగ్ కు అర్హత సాధించిన భారత తొలి మహిళా సెయిలర్ గా నేత్ర కుమానన్ నిలిచింది.

భారత మహిళా సెయిలర్ కు ఒలింపిక్స్ బెర్త్!
X

పారిస్ ఒలింపిక్స్ మహిళల సెయిలింగ్ కు అర్హత సాధించిన భారత తొలి మహిళా సెయిలర్ గా నేత్ర కుమానన్ నిలిచింది. వరుసగా రెండోసారి ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ద్వారా తన రికార్డును తానే అధిగమించగలిగింది.

పారిస్ వేదికగా 2024 ఒలింపిక్స్ ప్రారంభానికి మరో రెండుమాసాలు మాత్రమే గడువు ఉండడంతో..వివిధ క్రీడాంశాలలో సాధ్యమైనన్ని ఎక్కువ అర్హత బెర్త్ లు సాధించడడానికి భారత క్రీడాకారులు పోరాడుతున్నారు.

పలు రకాల క్రీడల్లో ఇప్పటికే 60 మందికి పైగా భారత క్రీడాకారులు అర్హత సంపాదించారు. మహిళల సెయిలింగ్ లో తాజాగా నేత్రా కుమానన్ సైతం పారిస్ బెర్త్ ను ఖాయం చేసుకోగలిగింది.

టోక్యో టు పారిస్....

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు తొలిసారిగా ప్రాతినిథ్యం వహించడంతో పాటు 5వ స్థానంలో నిలవడం ద్వారా గుర్తింపు సంపాదించిన నేత్ర..పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి తనకు దక్కిన ఆఖరి అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలిగింది.

ఫ్రాన్స్ లోని హెయిరెస్ వేదికగా జరిగిన ఎమర్జింగ్ నేషన్స్ ప్రోగ్రామ్ పోటీలలో సత్తా చాటుకోడం ద్వారా వరుసగా రెండోసారి ఒలింపిక్స్ బెర్త్ సంపాదించ గలిగింది.

గత ఒలింపిక్స్ మహిళల డింగీ ( ఐఎల్ సీఏ 6 ) విభాగంలో పోటీకి దిగిన నేత్ర అందరి అంచనాలు తలకిందులు చేసి 67 నెట్ పాయింట్లతో 5వ స్థానంలో నిలవడం ద్వారా భారత్ కే గర్వకారణంగా నిలిచింది.

సెయిలింగ్ లో మరిన్ని దేశాలు పాల్గొనేలా ప్రోత్సహించడం కోసం ప్రపంచ సెయిలింగ్ సమాఖ్య ఎమర్జింగ్ నేషన్స్ పోటీలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. సెయిలింగ్ లో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న దేశాలకు చెందిన సెయిలర్లు తమ సత్తా చాటుకోడం ద్వారా ప్రపంచ మేటి సెయిలర్లతో తలపడటానికి అర్హత సాధించగలుగుతున్నారు.

మహిళల సెయిలింగ్ లో టాప్ త్రీ...

మహిళల సెయిలింగ్ ఓకె డింగీ విభాగంలో నేరుగా ఒలింపిక్స్ అర్హత సాధించిన మొదటి ముగ్గురు ప్రపంచ మేటి సెయిలర్లలో రుమేనియాకు చెంది ఇబ్రు బోలాట్ ( 36 నెట్ పాయింట్లు ), సైప్రస్ సెయిలర్ మెర్లీనా మక్రీ ( 37 నెట్ పాయింట్లు) స్లోవేనియాకు చెందిన లిన్ ప్లెటికోస్ ( 54 నెట్ పాయింట్లు )తో మొదటి మూడుస్థానాలలో నిలిచారు. అయితే...ఆరుసార్లు ఒలింపిక్ చాంపియన్ తాతియానా డ్రోజ్డోవస్కాయా ( 59 నెట్ పాయింట్లతో) ఒలింపిక్స్ బెర్త్ సాధించడంలో విఫలమయ్యింది.

జులై నుంచి ఆగస్టు వరకూ మూడువారాలపాటు సాగే పారిస్ ఒలింపిక్స్ లో 204 దేశాలకు చెందిన 10వేల మంది అథ్లెట్లు 365 క్రీడాంశాలలో బంగారు పతకాల కోసం పోటీపడనున్నారు.

భారత్ సైతం 125మందికి పైగా అథ్లెట్ల బృందంతో పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవాలని భావిస్తోంది. ఇప్పటికే 60కి పైగా ఒలింపిక్స్ బెర్త్ లను భారత అథ్లెట్లు దక్కించుకోగలిగారు.

సెయిలింగ్ విభాగంలో భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక మహిళా సెయిలర్ నేత్ర మాత్రమే కావడం విశేషం.

First Published:  27 April 2024 12:30 PM GMT
Next Story