Telugu Global
Sports

మహిళా ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు, ఢిల్లీ!

2024- మహిళా ఐపీఎల్ ఫైనల్స్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా చేరింది.

మహిళా ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు, ఢిల్లీ!
X

2024- మహిళా ఐపీఎల్ ఫైనల్స్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా చేరింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై పోరు ఎలిమినేటర్ రౌండ్లోనే ముగిసింది.

మహిళా ఐపీఎల్ రెండోసీజన్ లీగ్ దశ మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా సాగటమే కాదు..టైటిల్ సమరానికి అర్హత సాధించిన జట్లు ఏవో తేలిపోయాయి. తొలిసీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్స్ చేరుకోగా..ఎలిమినేటర్ రౌండ్లో తొలిసీజన్ విజేత ముంబై ఇండియన్స్ తో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడి 5 పరుగుల తేడాతో విజేతగా నిలవడం ద్వారా తొలిసారిగా టైటిల్ రౌండ్లో అడుగుపెట్టింది.

ఎల్పీపెర్రీ ఆల్ రౌండ్ షో.....

ప్రారంభసీజన్లో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ ప్రస్తుత రెండోసీజన్లో తేలిపోతే..దారుణంగా విఫలమైన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాణించింది.

ఫైనల్లో చోటు కోసం జరిగిన ఎలిమినేటర్ రౌండ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 6 వికెట్లకు 135 పరుగులు సాధించింది. ఆల్ రౌండర్ ఎల్సీ పెర్రీ 50 బంతుల్లో 66 పరుగులు సాధించడం ద్వారా బెంగళూరు టాప్ స్కోరర్ గా నిలిచింది. మొదటి నాలుగు ఓవర్లలోనే 24 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు నష్టపోయిన బెంగళూరును పెర్రీ ఆదుకొంది.

ఫైనల్ చేరాలంటే 20 ఓవర్లలో 135 పరుగులు చేయాల్సిన ముంబై 6 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తుదివరకూ పోరాడి 18వ ఓవర్లో 33 పరుగులకు అవుట్ కావడంతో బెంగళూరు విజయం ఖాయమయ్యింది.

బెంగళూరు బౌలర్లలో శ్రేయాంకా పాటిల్ 16 పరుగులిచ్చి 2 వికెట్లు, పెర్రీ 29 పరుగులిచ్చి 1 వికెట్టు పడగొట్టారు. ఆల్ రౌండ్ షోతో బెంగళూరు విజయంలో ప్రధాన పాత్ర వహించిన పెర్రీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఓపెనర్ స్మృతి మంధన నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మహిళా ఐపీఎల్ ఫైనల్స్ కు చేరడం ఇదే మొదటిసారి. టైటిల్ పోరులో హాట్ ఫేవరెట్ ఢిల్లీ క్యాపిటల్స్ తో బెంగళూరు తలపడనుంది.

వరుసగా రెండోసారి ఫైనల్లో ఢిల్లీ...

అయితే..ప్రస్తుత 2024 సీజన్ ఫైనల్స్ కు ముందుగా చేరిన జట్టుగా గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముగిసిన లీగ్ దశ ఆఖరిమ్యాచ్ లో ఢిల్లీ 7 వికెట్లతో గుజరాత్ జెయింట్స్ ను చిత్తు చేసి..వరుసగా రెండోసారి ఫైనల్స్ కు చేరిన తొలిజట్టుగా రికార్డు నెలకొల్పింది.

ఈ కీలక పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ 9 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. జెయింట్స్ బ్యాటర్లలో భారతి 36 బంతుల్లో 42 పరుగులు, కాథరీన్ బ్రైస్ 28 పరుగులు సాధించారు.పటిష్టమైన బౌలింగ్ తో గుజరాత్ కు ఢిల్లీ బౌలర్లు పగ్గాలు వేయగలిగారు. ఢిల్లీ బౌలర్లలో మార్జీనా కాప్ 17 పరుగులిచ్చి 2 వికెట్లు, శిఖా పాండే, మిన్ను మణి చెరో 2 వికెట్లు పడగొట్టారు.

షెఫాలీ మెరుపు హాఫ్ సెంచరీ..

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 127 పరుగులు చేయాల్సిన ఢిల్లీ కేవలం 3 వికెట్ల నష్టానికే లక్ష్యం చేరుకోగలిగింది. ఢిల్లీ ఓపెనర్ షెఫాలీవర్మ కేవలం 37 బంతుల్లోనే 71పరుగులతో సుడిగాలి హాఫ్ సెంచరీ సాధించడంతో మ్యాచ్ ఏకపక్షమైపోయింది. షెఫాలీ 5 సిక్సర్లు, 7 ఫోర్లతో చెలరేగిపోడంతో ఢిల్లీ కేవలం 41 బంతులు మిగిలి ఉండగానే విజేతగా నిలిచింది.

కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. జెమీమా రోడ్రిగేజ్ 38 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.

సూపర్ సండే టైటిల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

First Published:  16 March 2024 4:52 AM GMT
Next Story