Telugu Global
Sports

ప్రపంచకప్ అర్హత పోటీలో భారత్ కు అఫ్ఘన్' కిక్'!

జాతీయ ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు సునీల్ చెత్రీ రికార్డు మ్యాచ్ లో భారత్ కు చేదుఅనుభవం ఎదురయ్యింది. అప్ఘనిస్థాన్ చేతిలో అనుకోని ఓటమి ఎదురయ్యింది.

ప్రపంచకప్ అర్హత పోటీలో భారత్ కు అఫ్ఘన్ కిక్!
X

జాతీయ ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు సునీల్ చెత్రీ రికార్డు మ్యాచ్ లో భారత్ కు చేదుఅనుభవం ఎదురయ్యింది. అప్ఘనిస్థాన్ చేతిలో అనుకోని ఓటమి ఎదురయ్యింది.

2026 పిఫా ప్రపంచకప్, 2027 ఏఏఫ్ సి ఆసియాకప్ అర్హత పోటీలలో భాగంగా అప్ఘనిస్థాన్ తో జరిగిన రెండోరౌండ్ పోరులో భారత్ కు ఘోరపరాజయం ఎదురయ్యింది. దిగ్గజ ఆటగాడు సునీల్ చెత్ర్రీ 150వ మ్యాచ్ పీడకలగా ముగిసింది.

గౌహతీలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియం వేదికగా ముగిసిన క్వాలిఫైయర్ పోరు మొదటి భాగంలో 1-0 ఆధిక్యంతో పైచేయి సాధించిన ఆతిథ్య భారత్ ..ఆట రెండోభాగంలో ప్రత్యర్థికి వెంటవెంటనే రెండుగోల్స్ సమర్పించుకోడం ద్వారా పరాజయం చవిచూసింది.

150వ మ్యాచ్ లోనూ సునీల్ గోల్....

ప్రస్తుత ప్రపంచ ఫుట్ బాల్ ఐదుగురు అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న భారత కెప్టెన్ సునీల్ చెత్రీ రికార్డుస్థాయిలో తన 150వ అంతర్జాతీయమ్యాచ్ లో భారత్ ను విజేతగా నిలపాలని భావించాడు. దీనికితోడు అభిమానులు సైతం స్టేడియానికి భారీసంఖ్యలో తరలి వచ్చారు.

మరోవైపు.. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోడం, పలురకాల సమస్యలు ఎదురుకావడంతో తగిన శిక్షణ లేకుండా నేరుగా బరిలోకి దిగిన అప్ఘనిస్థాన్ మాత్రం భారత్ కు గట్టిపోటీ ఇవ్వటమే కాదు..దీటుగా ఆడింది.

ఆట మొదటి భాగంలో లభించిన పెనాల్టీ కిక్ ద్వారా సునీల్ చెత్రీ గోల్ చేయడంతో భారత్ 1-0తో పైచేయి సాధించింది. అయితే..ఆట రెండోభాగంలో భారత ఆట గతి తప్పింది.

జట్టులోని మిడ్ ఫీల్డ్, ఫార్వర్డ్ లైన్ మధ్య సమన్వయం లోపించింది. రక్షణవలయంలోనూ గందరగోళం చోటు చేసుకోడంతో అప్ఘని పుంజుకోగలిగింది. ఎదురుదాడులతో వెంట వెంటనే రెండుగోల్స్ చేయడం ద్వారా భారత్ ను కంగుతినిపించింది.

ఆట 70వ నిముషంలో రహ్మత్ అక్బారీ సాధించిన గోల్ తో స్కోరును 1-1తో అప్ఘన్ జట్టు సమం చేయగలిగింది. ఆ తరువాత 18 నిముషాలలోనే లభించిన పెనాల్టీని షరీఫ్ ముఖమ్మద్ గోల్ గా మలచడంతో అప్ఘన్ జట్టు 2-1తో విజేతగా నిలువగలిగింది.

ఈ ఓటమితో భారత్ మూడోరౌండ్ అవకాశాలను చేజార్చుకొంది. నాలుగుజట్ల గ్రూపులో మొత్తం నాలుమ్యాచ్ లు ఆడిన భారత్ కేవలం 4 పాయింట్లు మాత్రమే సంపాదించింది.

ఇదే గ్రూపులో ఖతర్ 9 పాయింట్లతో టాపర్ గా నిలిచింది. అప్ఘనిస్థాన్ సైతం 4 మ్యాచ్ ల్లో 4 పాయింట్లు మాత్రమే సాధించడం విశేషం.

సునీల్ చెత్రీ అరుదైన రికార్డు....

2005 జూన్ 12న క్వెట్టా వేదికగా పాకిస్థాన్ ప్రత్యర్థిగా తన తొలి అంతర్జాతీయమ్యాచ్ ఆడిన సునీల్..ఆ తరువాత నుంచి గత 19 సంవత్సరాలుగా భారతజట్టుకు సేవలు అందిస్తూనే వచ్చాడు. భారతజట్టు కీలకఆటగాడిగా , వెన్నెముకగా నిలుస్తూ తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ లోనే కెరియర్ తొలి గోల్ సాధించిన సునీల్ ..25వ, 50వ, 75వ, 100వ, 125వ మ్యాచ్ ల్లో మాత్రమే కాదు..చివరకు 150వ మ్యాచ్ లో సైతం గోల్ నమోదు చేయడం విశేషం.

ఇప్పటి వరకూ ఆడిన 150 అంతర్జాతీయమ్యాచ్ ల్లో 94 గోల్స్ సాధించిన అరుదైన రికార్డు, ఘనత సునీల్ కు మాత్రమే సొంతం. భారత ఫుట్ బాల్ కు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన సునీల్ ను అప్ఘనిస్థాన్ తో మ్యాచ్ కు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో భారత ఫుట్ బాల్ సమాఖ్య ఓ జ్ఞాపికతో సత్కరించింది.

కీలకపోరులో భారతజట్టు ఓటమితో జట్టు ప్రధాన శిక్షకుడు స్టిమాక్ రాజీనామా సమర్పించారు.

First Published:  27 March 2024 5:15 AM GMT
Next Story