Telugu Global
National

'నన్ను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారు'.. - కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు

బీజేపీకి తలవంచలేదనే కారణంతోనే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, మరో మంత్రి సత్యేంద్ర జైన్‌లను జైలులో పెట్టించారని కేజ్రీవాల్ వివ‌రించారు.

నన్ను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారు.. - కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు
X

బీజేపీపై ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలంటూ వారు తీవ్ర ఒత్తిడి చేశారని ఆయన తెలిపారు. ఢిల్లీలో ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరితే తనపై ఎలాంటి కేసులూ పెట్టకుండా వదిలేస్తారట.. అంటూ ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా వారికి తన అభిప్రాయాన్ని తెగేసి చెప్పానని ఆయన తెలిపారు. ఎప్పటికీ బీజేపీ మోచేతి నీళ్లు తాగనని స్పష్టం చేశానని వివరించారు. బీజేపీకి ఎప్పటికీ తలవంచే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మీడియా ఎదుట స్పష్టం చేశారు.

బీజేపీకి తలవంచలేదనే కారణంతోనే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, మరో మంత్రి సత్యేంద్ర జైన్‌లను జైలులో పెట్టించారని కేజ్రీవాల్ వివ‌రించారు. బీజేపీ తమ పార్టీ నేతలపై కుట్రలు పన్నుతోందని, అన్ని దర్యాప్తు సంస్థలూ తమ పార్టీ నేతలవైపే చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అత్యాధునిక పాఠశాలలు నిర్మించడమే సిసోడియా చేసిన నేరమా అంటూ ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.

ఆప్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ జనవరి 27న మంత్రి ఆతిశీ, సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. వారు ఒక్కో సభ్యుడికి రూ.25 కోట్లు ఇవ్వజూపారని అప్పట్లో వారు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ కూడా ఆఫర్‌ చేశారని వివరించారు. దీనిపై ప్రస్తుతం ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు విచారణ కూడా జరుపుతున్నారు. ఈ క్రమంలో మరోసారి కేజ్రీవాల్‌ తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

First Published:  4 Feb 2024 1:45 PM GMT
Next Story