Telugu Global
National

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన..?

కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారం అవుతుందని అన్నారు మంత్రి ఆతిశీ.

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన..?
X

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. మరి సీఎం లేని రాష్ట్రంలో పాలన ఎలా సాగుతోంది..? కస్టడీ నుంచే తమకు ఆయన ఆదేశాలు పంపిస్తున్నారని మంత్రులు చెబుతున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి మరీ వివరాలు తెలియజేస్తున్నారు. కస్టడీలో ఉన్న వారు అలా బయటకు సందేశాలు పంపించే అవకాశమే లేదని ఈడీ వాదిస్తోంది. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వ పాలన జైలు నుంచి సాగబోదని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తారేమోననే అనుమానాలు మొదలవుతున్నాయి. లెఫ్ట్ నెంట్ గవర్నర్ వ్యాఖ్యలపై ఆప్ నేతలు మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు.

కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారం అవుతుందని అన్నారు మంత్రి ఆతిశీ. లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె సీరియస్ గా స్పందించారు. ఏ రాజ్యాంగ నిబంధన ఆధారంగా ఆయన మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం మేరకు ఎవరైనా చట్టసభ సభ్యుడు దోషిగా తేలితేనే వారి సభ్యత్వం రద్దవుతుందని గుర్తు చేశారు. సీఎం కేజ్రీవాల్ దోషి కాదని, కేవలం ఆయన ఈడీ రిమాండ్ లో మాత్రమే ఉన్నారని చెప్పారు. ఈ దశలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు అవకాశమే లేదన్నారు మంత్రి ఆతిశీ.

తెరపైకి సునీతా కేజ్రీవాల్..

కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మద్యం కుంభకోణంలో నిజానిజాలు తన భర్త కోర్టులో బయటపెడతారని ఆమె ప్రకటించారు. అయితే సునీత వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెబుతోంది బీజేపీ. కేజ్రీవాల్ స్థానంలోకి ఆమె రాబోతున్నట్టు అంచనా వేసింది. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లినప్పుడు కూడా రబ్రీదేవి ఇలానే తెరపైకి వచ్చారని, ఇప్పుడు సునీత కూడా అచ్చం అలాగే స్పందింస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. కేజ్రీవాల్ కూర్చునే చోటనుంచే సునీత తన వీడియో రికార్డ్ చేశారని, భర్త స్థానంలోకి వచ్చేందుకు ఆమె ఆసక్తిగా ఉన్నారంటూ సెటైర్లు పేల్చారు.

First Published:  28 March 2024 2:46 AM GMT
Next Story