Telugu Global
National

"చీర కట్టుకుంటే క్యాన్సర్‌ వస్తుంది".. సంచలన రిపోర్ట్

విపరీతమైన వేడిలో నివసించే మహిళలకు ఈ క్యాన్సర్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బిహార్, జార్ఖండ్‌ మహిళల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది.

చీర కట్టుకుంటే క్యాన్సర్‌ వస్తుంది.. సంచలన రిపోర్ట్
X

చీర.. భారతీయ సంస్కృతిలో భాగం. చాలామంది మహిళలు ఇప్పటికీ ఇంట్లో చీరపైనే ఉంటారు. కొందరు పార్టీలు, ఫంక్షన్లు, పండుగలు, పూజల టైంలో చీర కట్టుకుంటారు. ఈ ట్రెండ్ భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా విభిన్న శైలిలో చీరను ధరిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఓ పరిశోధన షాకింగ్‌ విషయాన్ని బయట పెట్టింది. చీర ధరించడం ద్వారా క్యాన్సర్స్‌ సోకుతుందని ఆ రిపోర్టు సారాంశం. భారతీయ మహిళలు చీర కట్టుకునే విధానంతో క్యాన్సర్ తదితర సమస్యల బారినపడుతున్నట్లుగా ఆ అధ్యయనంలో తేలింది. ముంబయిలోని ఆర్‌ఎన్‌ కూపర్‌ హాస్పిటల్స్‌లో ఈ పరిశోధనలు జరిగాయి.

‘ఓన్లీ మై హెల్త్‌’ అనే వెబ్‌సైట్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం.. చీరను కట్టుకోవడం ద్వారా స్క్వామస్ సెల్ కార్సినోమా ముప్పు పెరుగుతోంది. చీర కట్టుకోవడం వల్ల వస్తున్న క్యాన్సర్‌ను చీర క్యాన్సర్‌గా భావిస్తున్నారు. ఇది భారతీయ మహిళల్లో వేగంగా విస్తరిస్తోంది. కొన్నేళ్లుగా చీర క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఊర్లల్లో మహిళలు ఏడాది పొడువునా చీరలు ధరిస్తారు. నడుముపై చీర కట్టిన గుర్తులుంటాయి. నడుముపై పెట్టీకోట్ వేసుకున్నా కాటన్ నాడాలతో కడుతుంటారు. గట్టిగా కట్టుకోవడం వల్ల నడుము భాగంలో రాపిడి ఏర్పడుతుంది. దాంతో చర్మం రంగు సైతం మారుతూ వస్తుంది. చివరకు నల్లని మచ్చలు క్యాన్సర్‌గా మారుతున్నాయని డాక్టర్ల పరిశోధనలో తేలింది.

విపరీతమైన వేడిలో నివసించే మహిళలకు ఈ క్యాన్సర్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బిహార్, జార్ఖండ్‌ మహిళల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఓ 68 ఏళ్ల మహిళ ఈ క్యాన్సర్‌ బారినపడగా విషయం బయటపడింది. కశ్మీరీ కంగ్రీ దుస్తులతో పాటు టైట్‌ జీన్స్‌ సైతం క్యాన్సర్‌ కారణమవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. టైట్‌గా ఉండే బట్టలను ఎక్కువసేపు వేసుకుంటే రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించడానికి, జీవనశైలిని సరిదిద్దుకోవడం చాలా ముఖ్యమంటున్నారు డాక్టర్లు. చీర ధరించిన అందరిలో క్యాన్సర్ వస్తుందని కాదని.. పరిశుభ్రత పాటించాలని . ఆరోగ్యకరమైన, పోషకాహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే గంటల తరబడి ఒకే చోట కూర్చోవద్దని, వీలైనంత చురుగ్గా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

First Published:  5 April 2024 3:33 AM GMT
Next Story