Telugu Global
MOVIE REVIEWS

Paarijatha Parvam Movie Review: పారిజాత పర్వం- రివ్యూ {1.5/5}

చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ సురేఖా వాణీ... చూస్తే ఇదేదో మల్టీ స్టారర్ సినిమాలా వుంది. వీళ్ళందరూ కలిసి ట్రెండ్ ప్రకారం 'పారిజాత పర్వం' అనే క్రైమ్ కామెడీ సృష్టించే ప్రయత్నం చేశారు.

Paarijatha Parvam Movie Review: పారిజాత పర్వం- రివ్యూ {1.5/5}
X

చిత్రం: పారిజాత పర్వం

రచన - దర్శకత్వం : సంతోష్ కంభంపాటి

తారాగణం : చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ సురేఖా వాణి తదితరులు

సంగీతం : రీ, ఛాయాగ్రహణం : బాల సరస్వతి

నిర్మాతలు : మహేంద్ర, దేవేష్

విడుదల : ఏప్రిల్ 19, 2024

రేటింగ్: 1.5/5

చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ సురేఖా వాణీ... చూస్తే ఇదేదో మల్టీ స్టారర్ సినిమాలా వుంది. వీళ్ళందరూ కలిసి ట్రెండ్ ప్రకారం 'పారిజాత పర్వం' అనే క్రైమ్ కామెడీ సృష్టించే ప్రయత్నం చేశారు. దీనికి సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించే ప్రయత్నం చేశాడు. ఈ నెలలోనే వరుసగా దాదాపు ఒకే రకమైన కథతో మూడు క్రైమ్ కామెడీలొచ్చాయి. మొదటి రెండూ ఫ్లాపయ్యాయి. ఈ మూడోది ఎలా వుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

కథ

చైత‌న్య (చైత‌న్యా రావు) సినిమా ద‌ర్శ‌కుడ‌వ్వాలని అనేక ప్రయత్నాలు చేసి ఫలించక, ఇక తానే నిర్మాతగా మారి సినిమా తీయాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకు డబ్బు కావాలి. ఆ డబ్బుకోసం ఓ కిడ్నాప్ పథకం వేస్తాడు. తనని అవమానించిన సినిమా నిర్మాత శెట్టి (శ్రీకాంత అయ్యంగార్) అనే అతడి రెండో భార్య సురేఖ (సురేఖా వాణి) ని కిడ్నాప్ చేసే పథకమది. డబ్బు కోసం ఇదే పథకంతో వున్న బార్ శ్రీను (సునీల్) వచ్చి క్లాష్ అవుతాడు. ఇద్దరూ ఒకరినే కిడ్నాప్ చేయాలనుకోవడంతో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. మ‌రి ఈ ఇద్ద‌రిలో సురేఖని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? బార్ శ్రీ‌ను ఎవ‌రు? ఈ కిడ్నాప్ ప్రయత్నంతో చైతన్య సినిమ తీయగలిగాడా? ... ఈ ప్రశ్నలు వేసి వీటికి సమాధానాలు విప్పుతుందీ సినిమా.

ఎలావుంది కథ

ఈ ఏప్రిల్లో విడుదలైన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’, ‘భరతనాట్యం’, ‘పారిజాత పర్వం’ ఈ మూడిట్లో హీరో సినిమా దర్శకుడయ్యేందుకు ప్రయత్నాలు చేస్తాడు. మొదటిది, చివరిది రెండిట్లో హీరో తన ఫ్రెండ్ ని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకుంటాడు. రెండోది, మూడోది ఈ రెండిట్లో దర్శకుడవాలనుకున్న హీరో సినిమా తీయడానికి డబ్బుల కోసం క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతాడు. రెండో దాంట్లో ఆ క్రైమ్ డ్రగ్స్ కొట్టేయడమైతే, మూడో దాంట్లో కిడ్నాప్ కి పాల్పడడం.

ఇలా మూడిటికీ ఈ మూస కథలకన్నా వేరే దొరకలేదు. మూడో దాంట్లో అదనంగా ఇలాటిదే ఇంకో కథ వుంది. చైతన్యా రావు ఫ్రెండ్ వైవా హర్షని పెట్టి సినిమా తీయాలనుకోవడం ఒకటైతే, భీమవరం నుంచి సునీల్ వచ్చి సినిమా ప్రయత్నాలు చేయడం మరొకటి. సునీల్ సినిమా వాళ్ళు వచ్చే బార్ లో వెయిటర్ గా చేరి ప్రయత్నాలు చేస్తూంటే, బార్ డాన్సర్ శ్రద్ధా దాస్ కి బార్ ఓనర్ నుంచి సమస్య వస్తే- అతడ్ని చంపేసి తానే బార్ ఒనరవుతాడు సునీల్. సెటిల్మెంట్లు చేయడం మొదలెడతాడు. ఈ కథతోనే చైతన్యా రావు సినిమా తీయాలనుకుంటాడు. అయితే ఇద్దరూ డబ్బుల కోసం ఒకరినే కిడ్నాప్ చేయాలనుకోవడంతో సమస్య వస్తుంది.

ఈ సెటప్ వరకూ ఓకే. అయితే చిత్రీకరణ ఓపికని పరీక్షిస్తుంది. దర్శకుడు సంతోష్ కంభంపాటి తొందరపడి దర్శకత్వం వహించాడులా వుంది. ముందు అతను నేర్చుకోవాల్సింది చాలా వుంది. ఇలాటి కథతో సినిమా తీయడానికి తను డ్రగ్స్ కి పాల్పడకుండా, కిడ్నాపులు చేసే అవసరం రాకుండా, డబ్బులు పెట్టే నిర్మాతలు ఎలా దొరికారన్నది ఆశ్చర్యపర్చే విషయం. ‘కిడ్నాప్ చేయడమూ ఓ కళ’ అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఇందులో ఏం కళ వుందో అర్ధం గాదు. ముందు సినిమా తీసే కళ తెలియాలిగా?

ఫస్టాఫ్ కాసేపటికే సినిమా ప్రయత్నాలతో నత్తనడక నడిచి ఇక లేచి పరుగెట్టదు. కిడ్నాప్ డ్రామా మొదలయ్యాక ఇక సెకండాఫ్ అయితే పరమ సిల్లీగా మారిపోతుంది. ఓ సీన్‌లో వైవాహ‌ర్ష ‘అస‌లు ఈ క‌థెక్క‌డ దొరికిందిరా నీకు’ అని అరిచి గోలెడతాడు. నిజమే, ఇది దర్శకుడు వేసుకోవాల్సిన ప్రశ్న. వీలైతే నిర్మాతలు కూడా వేసుకోవచ్చు. ఈ కథ తెచ్చి ప్రేక్షకుల మీద రుద్దడం పెద్ద క్రైమ్.

కిడ్నాప్ తర్వాత కన్ఫ్యూజింగ్ కామెడీతో శ్రీను వైట్ల టెంప్లెట్ లోకి వెళ్ళి పోయాడు దర్శకుడు. ఇదే మాత్రం వర్కౌట్ కాలేదు. అసలు చైతన్యా రావు సునీల్ కథతో సినిమా తీయాలనుకోవడంలోనే బలం లేదు. సునీల్ కథకి సినిమా తీసేంత సీన్ లేదు. పైగా సునీల్ కథతో సినిమా తీయాలనుకున్న చైతన్య రావుకి సునీల్ బార్ లో డాన్సర్ శ్రద్ధా దాస్ ఎవరో తెలియకపోవడం సిల్లీగా వుంది.

ఇలా లాజిక్కులు లేకుండా, సంఘర్షణ, త్రిల్స్, సస్పెన్స్ లేకుండా చప్పగా సాగిపోతుంది. క్రైమ్ తో ఇలా వుంటే, ఇక కామెడీ చెప్పనవసరం లేదు. కేవలం సునీల్, వైవాహర్ష కొన్ని చోట్ల నవ్విస్తారు, అంతే.

నటనలు- సాంకేతికాలు

‘కీడాకోలా’ లో ఫన్నీ క్యారక్టర్ తో హైలైట్ అయిన చైతన్యా రావు ఆ క్రియేటివిటీ లేక మూస పాత్ర, నటన చూపించి సరిపెట్టేశాడు. బార్ డాన్సర్ గా శ్రద్ధా దాస్ పాత్ర పెద్దగా లేకపోయినా నీటుగా కన్పిస్తుంది. సునీల్, వైవా హర్ష ఓకే. చైతన్యా రావు గర్ల్ ఫ్రెండ్ గా మాళవికా సతీశన్, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖా వాణి తదితరులు డల్ క్యారక్టర్స్ నటించారు. సంగీత ద‌ర్శ‌కుడు ‘రీ’ రీ- సౌండిస్తూ తన వంతు సంగీతం వినిపించాడు. బాల సరస్వతి ఛాయాగ్రహణం బడ్జెట్ కి తగ్గట్టు వుంది. ఎంత తక్కువ బడ్జెట్ తో తీసినా తీయడం తెలిస్తే బడ్జెట్ ఒక ప్రశ్న కాదు. దీన్ని ఇలా తీస్తే, చివర్లో ప్రకటించిన సీక్వెల్ ఇంకెలా తీస్తారో!

First Published:  19 April 2024 12:46 PM GMT
Next Story