Telugu Global
MOVIE REVIEWS

Om Bhim Bush Movie Review: ఓం భీమ్ బుష్ –రివ్యూ {2.5/5}

Om Bhim Bush Movie Review: 2019లో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముగ్గురూ ‘బ్రోచేవారెవరురా’ అనే క్రైమ్ కామెడీలో కలిసి నటించి హిట్ చేశారు. తిరిగి ఇదే హాస్య త్రయం ఈసారి ‘ఓం భీమ్ బుష్’ అనే హార్రర్ కామెడీతో వచ్చారు.

Om Bhim Bush Movie Review: ఓం భీమ్ బుష్ –రివ్యూ {2.5/5}
X

చిత్రం: ఓం భీమ్ బుష్

రచన- దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి

తారాగణం : శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతీ ముకుందన్, ప్రియావడ్లమాని, ఆయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్యా మీనన్

సంగీతం : సన్నీ ఎంఆర్, ఛాయాగ్రహణం : రాజ్ తోట

బ్యానర్: వీ సెల్యులాయిడ్, సమర్పణ: యూవీ క్రియేషన్స్, నిర్మాత: సునీల్ బలుసు ఆర్ట్ విడుదల : 22.4.24

రేటింగ్: 2.5/5

2019లో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముగ్గురూ ‘బ్రోచేవారెవరురా’ అనే క్రైమ్ కామెడీలో కలిసి నటించి హిట్ చేశారు. తిరిగి ఇదే హాస్య త్రయం ఈసారి ‘ఓం భీమ్ బుష్’ అనే హార్రర్ కామెడీతో వచ్చారు. 2018లో ‘హుషారు’ అనే స్లీపర్ హిట్ తీసిన శ్రీహర్ష కొనుగంటి దీనికి దర్శకుడు. ఈ నలుగురి జట్టు ముగ్గురు హీరోయిన్లని కలుపుకుని పంచిన విందు వినోదాలేమిటో తెలుసుకుందాం.

కథ

క్రిష్ (శ్రీవిష్ణు), మ్యాడీ (రాహుల్ రామకృష్ణ), వినయ్ (ప్రియదర్శి) అనే ముగ్గురు ఆకతాయిలు ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ రంజిత్ (శ్రీకాంత్ అయ్యంగార్) దగ్గర పీహెచ్‌డీ చేసి సైంటిస్టులవ్వాలనుకుంటారు. వీళ్ళ ఆకతాయి పనులు భరించలేక మధ్యలోనే ప్రొఫెసర్ రంజిత్ డాక్టరేట్లు ఇచ్చి వెళ్ళగొట్టేస్తాడు. ఆ డాక్టరేట్లతో ముగ్గురూ సైంటిస్టుల అవతారమెత్తుతారు. దాంతో బాగా డబ్బు సంపాదించుకోవాలని భైరవపురం గ్రామం చేరుకుంటారు, తాము ఏ టూ జేడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే బ్యాంగ్ బ్రదర్స్ అని గ్రామస్థుల్ని నమ్మించి మోసాలు చేస్తూంటారు. గ్రామంలో వున్న సర్పంచ్, అఘోరాలు ఒక చాలెంజీ విసురుతారు. దమ్ముంటే అక్కడి సంపంగి మహల్ అనే పాడుబడిన దెయ్యాల కొంపలో వున్న రహస్య నిధిని తీసుకు రావాలంటారు. ఆ తర్వాత ముగ్గురూ సంపంగి మహల్లో ప్రవేశించాక ఏం జరిగిందీ, అక్కడ నిధి వుందా లేదా, వుంటే దాన్ని తెచ్చారా లేదా అనేది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది మైండ్ లెస్ కామెడీల జానర్ కి చెందిన హార్రర్ కామెడీ కథ. బాలీవుడ్ స్టార్స్ తో రోహిత్ శెట్టి తీసిన ‘గోల్ మాల్’ సిరీస్ లో నాలుగు హిట్స్ మంచి ఉదాహరణ. మైండ్ లెస్ కామెడీలకి కాస్త క్వాలిటీని జతచేసిన సినిమాలివి. కానీ ‘ఓం భీమ్ బుష్’ విషయంలో అదే క్వాలిటీని ఆశించలేం. అందుకని కొన్ని చోట్ల మాత్రమే ఈ ‘లాజిక్ లేని మ్యాజిక్ కామెడీ’ అని చెప్పుకున్న కామెడీ నవ్విస్తుంది. కథ హార్రర్ కామెడీలంత పాతదే. క్లయిమాక్స్ గందరగోళమే. అయినా ముగ్గురు నటులు సినిమా మునిగిపోకుండా తమ టాలెంట్ తో, కామెడీ టైమింగ్ తో, చివరంటా భుజానేసుకుని మోశారు.

సెకండాఫ్ లో అరగంటపాటు దెయ్యంతో కామెడీ లేకుండా వచ్చే హార్రర్ సీన్లు సినిమాని నిలబెట్టే అంశం. దెయ్యం ఇచ్చే ట్విస్టు కూడా థ్రిల్ చేసేదే. అయితే చివర్లో చెప్పాలనుకున్న సందేశం బెడిసికొట్టింది.

ఫస్టాఫ్ లో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురి వెర్రి చేష్టలతో సాగినా, కొన్ని చోట్ల మాత్రమే కామెడీ పేలింది. ఫస్టాఫ్ దాదాపు బోరుగానే సాగుతుంది అక్కడక్కడా నవ్విస్తూ. ముగ్గురూ సైంటిస్టులుగా సమస్యల్ని పరిష్కరించే తీరులో కామెడీకి పసలేదు. కథ సంపంగి మహల్లోకి వెళ్ళే చాలెంజీతోనే మొదలవుతుంది కాబట్టి అప్పటివరకూ ఫస్టాఫ్ లో విషయం లేని మైండ్ లెస్ కామెడీ ఎపిసోడ్లు భరించాల్సిందే. సెకండాఫ్ మాత్రమే ఈ సినిమాకి బలం.

నటనలు- సాంకేతికాలు

సినిమాలో లాజిక్ లేని కామెడీతో మ్యాజిక్ మాట అలా వుంచితే, ‘బ్రోచేవారెవరురా’ త్రయం మరోసారి తమ స్కిల్స్ తో మ్యాజిక్ చేశారనే చెప్పాలి. ముగ్గురి కామెడీ టైమింగ్, వన్ లైన్ డైలాగులు విసిరే విధానం నిజంగా గ్రేటే. రాహుల్ రామ కృష్ణ పిచ్చి ఇంగ్లీషు డైలాగులతో వెర్రెత్తిస్తాడు. శ్రీ విష్ణు ర్యాప్ సాంగ్స్, ప్రియదర్శి పాట్లు సినిమా బోరు కొట్టకుండా కాపాడతాయి.

హీరోయిన్ ప్రియా వడ్లమానికి పెద్దగా పాత్ర లేదు. కేవలం ఒక పాటలో కనిపిస్తుంది.. ప్రియదర్శి హీరోయిన్ గా అయేషా ఖాన్ నిడివిగల పాత్రలో కనిపించి యూత్ అప్పీల్ ని రెచ్చగొడుతుంది. శ్రీవిష్ణు హీరోయిన్ గా ప్రీతీ ముకుందన్ కూడా ఫర్వాలేదు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్యా మీనన్, రచ్చరవి తదితరులు పాత్రలకి తమ వంతు న్యాయం చేశారు.

సన్నీ ఎంఆర్ నేపథ్య సంగీతం ఫర్వాలేదుగానీ, కొన్ని చోట్ల డైలాగులకి మించి వుంది. దెయ్యంతో శ్రీవిష్ణు మెలోడీ సాంగ్ బావుంది. రాజ్ తోట ఛాయాగ్రహణం ఫర్వాలేదు, అయితే గ్రాఫిక్స్ నాసిరకంగా వున్నాయి. ప్రొడక్షన్ విలువలు, దెయ్యం బంగళా సెట్స్ మాత్రం బావున్నాయి.

దర్శకత్వం, దర్శకుడు రాసిన కథ, మాటలు లాజిక్ లేకపోయినా సరిపెట్టుకోవచ్చుగానీ, స్క్రీన్ ప్లేకి లాజిక్ లేకపోతే అంత బావుండదు. ఫస్టాఫ్ లో కామెడీ ఎపిసోడ్లకి వేగం లేకపోవడం స్క్రీన్ ప్లే ప్రధాన బలహీనత. ప్రధాన పాత్ర శ్రీవిష్ణుని ఆధారంగా చేసుకుని కథనం చేసి వుంటే బలం, వేగం పుంజుకునేవి. ఏ సినిమా కథకైనా కథ నడిపేది ప్రధాన పాత్రే!

First Published:  22 March 2024 9:26 AM GMT
Next Story