Telugu Global
MOVIE REVIEWS

Bastar: The Naxal Story Movie Review: బస్తర్ - ది నక్సల్ స్టోరీ రివ్యూ! {2/5}

Bastar: The Naxal Story Movie Review: ‘ది కేరళ స్టోరీ’ (2023) దర్శకుడు సుదీప్తో సేన్, నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా, హీరోయిన్ అదా శర్మ కలిసి మరో కరుడుగట్టిన సమర్పణ ‘బస్తర్ - ది నక్సల్ స్టోరీ’ ని అందించారు.

Bastar: The Naxal Story Movie Review: బస్తర్ - ది నక్సల్ స్టోరీ రివ్యూ! {2/5}
X

చిత్రం: బస్తర్ - ది నక్సల్ స్టోరీ

రచన- దర్శకత్వం : సుదీప్తో సేన్

తారాగణం : అదా శర్మ, ఇందిరా తివారీ, రైమా సేన్, విజయ్ కృష్ణ, సుబ్రతా దత్తా, యశ్పాల్ శర్మ తదితరులు

ఛాయాగ్రహణం : రాగుల్ ధరుమన్, సంగీతం : బిషాఖ్ జ్యోతి

బ్యానర్ : సన్‌షైన్ పిక్చర్స్, నిర్మాత : విపుల్ అమృతలాల్ షా

విడుదల : మార్చి 15, 2024

రేటింగ్: 2/5

‘ది కేరళ స్టోరీ’ (2023) దర్శకుడు సుదీప్తో సేన్, నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా, హీరోయిన్ అదా శర్మ కలిసి మరో కరుడుగట్టిన సమర్పణ ‘బస్తర్ - ది నక్సల్ స్టోరీ’ ని అందించారు. ఇది ప్రచార సినిమా కాదని ముందే ప్రకటించారు. కానీ ఇది ఎన్నికల్లో పోలరైజ్ చేసే ప్రయత్నంతో తీసిన ప్రచార సినిమానే. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ (2022) ని అనుకరిస్తూ చూపించిన హింసతో ఎవరిని టార్గెట్ చేస్తూ ప్రచార సినిమాగా మలిచారో స్పష్టంగా తెలిసిపోయే ప్రయత్నం. ఇందులో కూడా ఎంత నిజాయితీ వుందో కూడా బయటపడే దుందుడుకుతనం. ఇవేమిటో విపులంగా చూద్దాం...

కథ

ఇద్దరు న్యాయవాదులు నీలం నాగ్‌పాల్ (శిల్పా శుక్లా), ఉత్పల్ త్రివేది (యశ్పాల్ శర్మ) ల మధ్య కోర్టులో న్యాయ పోరాటంతో కథ ప్రారంభమవుతుంది. ఐపీఎస్ నీరజా భార్గవ (ఆదా శర్మ) అమాయక గిరిజనుల్ని ఎన్ కౌంటర్ చేసి చంపిందనీ, నక్సల్ హింసకి ప్రఖ్యాత రచయిత్రి వన్యా రాయ్ (రైమా సేన్) కుట్రపూరిత సపోర్టు వున్నట్టు తప్పుడు ఆరోపణ చేసిందనీ, నీలం నాగ్ పాల్ వాదిస్తుంది. దీన్ని తిప్పి కొట్టలేక పోతాడు ఉత్పల్ త్రివేది. ఈ కోర్టు సన్నివేశం ఛత్తీస్‌గఢ్‌ లోని బస్తర్ గ్రామానికి మారుతుంది.

2010 లో బస్తర్ లో గిరిజనుల సమూహం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. స్కూల్ టీచర్ మిలింద్ కశ్యప్ (సుబ్రతా దత్తా), భార్య రత్న (ఇందిరా తివారీ), కొడుకు, కూతురు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో మావోయిస్టులు మెరుపుదాడి జరిపి అందర్నీ తమ శిబిరానికి లాక్కుపోతారు. అక్కడ కామ్రేడ్ లంకా రెడ్డి (విజయ్ కృష్ణ) అనే పేరు మోసిన మావోయిస్టు, అతడి అనుచరురాలు లక్ష్మి (అనంగ్షా బిశ్వాస్) మిగతా దళ సభ్యులు వుంటారు. స్కూల్ టీచర్ మిలింద్ కశ్యప్ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసినందుకు, ఐపీఎస్ నీరజా భార్గవకి ఇన్‌ఫార్మర్‌గావున్నందుకూ దేశద్రోహిగా ప్రకటించి, నరికి చంపేస్తాడు లంకా రెడ్డి.

లంకారెడ్డి ధ్యేయం ఒకటే- ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగరేయడం. కళ్ళముందే భర్త దారుణ హత్యకి గురికావడంతో చలించిన రత్న, ఈ హంతకుల్ని నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆమెకి తగిన ధైర్యం నూరిపోసి తన స్క్వాడ్ లో పోలీసుద్యోగం ఇప్పిస్తుంది నీరజ. దీంతో వీళ్ళిద్దరు కలిసి చేసే పోరాటం ఏ ముగింపుకి దారి తీసిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

‘బస్తర్- ది నక్సల్ స్టోరీ’ తో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో నక్సలైట్-మావోయిస్టు తిరుగుబాటు అధ్యాయాల్నిబయటకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దర్శకుడు దీని కోసం చాలా రీసెర్చి చేసినట్టు కనిపిస్తాడు. బస్తర్ కి సంబంధించి బాధాకరమైన గతాన్ని నిశితంగా వర్ణించినందుకు అతడ్ని మెచ్చుకోవాల్సిందే. అయితే బస్తర్ లో ఆ పరిస్థితులు ఏర్పడడానికి కారణమైన తెరవెనుక శక్తుల్ని దాచీ దాచిపెట్టనట్టుగా చూపించడం దగ్గరే ప్రచార సినిమా లక్ష్యం దెబ్బతింది.

దీని నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఈ ప్రాంతంలో ఇనుము, బొగ్గు, బాక్సైట్, మాంగనీస్ వంటి సహజ వనరులు సమృద్ధిగా వుండి, కార్పొరేట్ రంగానికి ఈ ప్రాంతాన్ని అప్పజెప్పాలన్న ప్రభుత్వ ప్రయత్నాల్ని అడ్డుకుంటూ పుట్టిందే అక్కడి నక్సలిజం. కార్పొరేట్లతో ఈ కేంద్రబిందువుని దాచిపెడుతూ లెఫ్టిస్టులు, మీడియా, బాలీవుడ్, ఎన్జీవోలు, జేఎన్ యూ లని ఈ ప్రాంతంలో నక్సల్ సపోర్టర్లుగా, అసలు స్వదేశీ విలన్లుగా చెప్పడం చేశారు. ఇంకోవైపు లష్కర్, ఎల్ టీటీఈ, బొకోహరామ్, ఐసిస్ మొదలైన టెర్రరిస్టు సంస్థల్ని నక్సలైట్లతో చేతులు కలిపిన విదేశీ విలన్లుగా చూపించారు.

దేశంలోని ఆ ‘స్వదేశీ విలన్లు’ దేనికి నక్సలిజాన్ని సపోర్టు చేస్తున్నారో చెబితే కార్పొరేట్ శక్తుల గురించి, అక్కడి సహజ వనరుల పరిరక్షణ గురించీ చెప్పాల్సి వస్తుంది. ఇది ప్రచార సినిమాకి అనుకూలంగా వుండదు. అందుకని ఈ కథ కల్పన-వాస్తవాల, అనేక కుట్ర కోణాల కలిపికొట్టుడుగా ముగుస్తుంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నలాగా మిగిలిపోతుంది.

పై కథలో కోర్టు సీనులో చెప్పే ప్రఖ్యాత రచయిత్రి వన్యా రాయ్ మరెవరో కాదు, అరుంధతీ రాయే. నక్సలైట్లకి వ్యతిరేకంగా గిరిజనులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సల్వాజుడుం (శాంతి యాత్ర) దళానికి నాయకత్వం వహించిన మహేంద్రకర్మ పేరు రాజేంద్ర కర్మగా మారింది.

ఒక సన్నివేశంలో ప్రొఫెసర్, విద్యావేత్తల ర్యాంకుల్లోకి, బాలీవుడ్‌లోకి వామపక్ష తీవ్రవాద భావజాలాన్ని చొరబెట్టాల్సిందిగా వన్యా రాయ్ ని కోరడాన్ని చూడొచ్చు. ఇంటర్వెల్ సీనుగా వచ్చే దంతెవాడలో 76 మంది సీఆర్పీ ఎఫ్ జవాన్ల హత్యాకాండని జేఎన్ యూ విద్యార్ధులు పాటలతో సెలెబ్రేట్ చేసుకుంటూ, చనిపోయిన పోలీసుల్ని ‘పోలీసు కుక్కలు’ గా పేర్కొనడం, ఎర్రకోట మీద జెండా ఎగరేస్తామనడం ప్రచార సినిమాకి పనికొచ్చేదే. కేంద్రహోమ్ మంత్రి ఐపీఎస్ నీరజని ‘దొంగముండా’ అని తిట్టడం కూడా ఒక పార్టీకి వ్యతిరేకంగా పోలరైజేషన్ ని ఎగదోయడమే.

ఇక ఎలాటి క్రూరత్వాన్ని ఈ శక్తులు సపోర్టు చేస్తున్నాయో చెప్పి మతింత బలంగా పోలరైజ్ చేయడానికన్నట్టు, హద్దుమీరిన హింసాత్మక దృశ్యాలున్నాయి. ప్రారంభంలో నక్సల్స్ స్కూల్ టీచర్ని చంపే దృశ్యం గగుర్పాటు కలిగిస్తుంది- గొడ్డలితో నరుకుతూనే వుంటాడు, ఎప్పుడో శవమైపోయినా, వివిధ అంగాల్ని భయంకరంగా నరుతూనే వుంటాడు. ఇది 30 సెకన్ల పాటు భయపెట్టే దృశ్యం. ఇలాటి దృశ్యాలు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ లో వున్నాయి. అయితే వాటిని బ్లర్ చేశారు. ఇక్కడ మాత్రం బాహాటంగానే వదిలేసింది సెన్సార్.

ఒక పసిపిల్లని నక్సల్స్ మంటల్లోకి విసిరి చంపే దృశ్యం కూడా ఇలాటిదే. ఇక దంతెవాడ లో సీఆర్పీ ఎఫ్ శిబిరాన్ని రాత్రిపూట తగులబెట్టి 76 మంది పోలీసుల్ని సజీవదహనం చేసి చంపే సుదీర్ఘ భీకర దృశ్యం- స్టీవెన్ స్పీల్బెర్గ్ తీసిన ‘షిండ్లర్స్ లిస్ట్’ లో నాజీలు యూదుల్ని అగ్నికి ఆహుతి చేసే దృశ్యాలకంటే భయానకంగా వుంటాయి. ఇవన్నీ ప్రచార సినిమా లక్ష్యాన్ని నెరవేరుస్తాయి.

కొన్ని జాతీయ, అంతర్జాతీయ పత్రికల సాక్ష్యంగా గణాంకాలు ముందుంచారు ఐపీఎస్ నీరజా పాత్ర ద్వారా- వందేళ్ళ కమ్యూనిజంలో పదికోట్ల మందిని చంపేశారని, పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాల్లో చనిపోయిన సైనికుల సంఖ్యకంటే, నక్సలైట్లు బలిగొన్న ప్రాణాలు అధికమనీ. ఇక ముగింపులో నిరజ వాదిస్తూ- ఉరిశిక్షకి కూడా భయపడకుండా లెఫ్ట్ లిబరల్స్ ని కాల్చి చంపాలంటుంది!

లెఫ్ట్ లిబరల్సో మరెవరో, అసలు కారకులైన కార్పొరేట్స్ ని కూడా ముందుంచి కథ చెబితే బావుంటుంది. ఎలక్టరోల్ బాండ్స్ లో కార్పొరేట్స్ లాగా దాచిపెట్టాలన్న విఫలయత్నాలెందుకు? ఇదేం సినిమా కథ?

నటనలు- సాంకేతికాలు

గర్భవతియైన కరకు పోలీసాఫీసర్ నిరజగా అదా శర్మ బాగా నటించింది. క్లయిమాక్స్ లో ఏకపాత్రాభినయం లాగా సుదీర్ఘ డైలాగులు సినిమాగా బాగానే పేలతాయి. కానీ ఎలాటి సందేశం వెళుతోంది? ఎవరికి వ్యతిరేకంగా ప్రజానీకాన్ని రెచ్చగొడుతున్నట్టు? ఈమెతో పోటీపడి కామ్రేడ్ లంకారెడ్డిగా విజయ్ కృష్ణ నటించాడు. ఇతర పాత్రల్లో యశ్‌పాల్ శర్మ, శిల్పా శుక్లా, రైమా సేన్, పూర్ణేందూ భట్టాచార్య ల నటనలు సహజత్వానికి దగ్గరగా వున్నాయి. అయితే క్రూరురాలైన నక్సల్ పాత్ర లక్ష్మిగా అనంగ్షా బిశ్వాస్, భర్తని కోల్పోయి పగబట్టిన రత్నగా ఇందిరా తివారీ హైలైట్ గా వుంటారు. అలాగే స్కూల్ టీచర్ గా సుబ్రతా దత్తా కూడా. సాంకేతికంగా చెప్పుకోదగ్గ సినిమా. యాక్షన్ సీక్వెన్సులతో సహా ఛాయాగ్రహణం, వీఎఫ్ ఎక్స్, అడవుల్లో లొకేషన్లూ, నేపథ్య సంగీతం, ప్రతి డిపార్ట్ మెంటులో నిర్మాణ విలువలూ అన్నీ నాణ్యంగా వున్నాయి. నాణ్యంగా విషయం లేదు. విషయం సినిమాకంటే డాక్యుమెంటరీ డ్రామాలాగా వుంది. ఎమోషనల్ డెప్త్ కాకుండా హద్దు మీరిన హింసతో, రక్తపాతంతో, వక్రీకరణలతో విషయం వుంది- ప్రచార సినిమాలు అర్ధసత్యాలే కాబట్టి.



First Published:  25 March 2024 10:21 AM GMT
Next Story