Telugu Global
Andhra Pradesh

కాపులతో కిటకిటలాడుతున్న వైసీపీ

కాపులకు అరికాలి మంట నెత్తికెక్కుతుంది, పర్యవసానం..? హరిరామజోగయ్య, ముద్రగడ వంటివారు కుటుంబాలతో సహా జగన్మోహన్‌రెడ్డి పార్టీలో ఆనందంగా జాయిన్‌ అయిపోతున్నారు.

కాపులతో కిటకిటలాడుతున్న వైసీపీ
X

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాపులు మూడు రకాలు : ఒకటి – కమ్మకాపులు, రెండు: రెడ్డి కాపులు, మూడు: పవన్‌ కాపులు. ఇవే కాకుండా ఇండిపెండెంట్‌ వీరకాపులు అనే వర్గం ఒకటుంది. వాళ్లు చంద్రబాబునీ, జగన్నీ, టీడీపీతో కలిసి నడుస్తున్న పవన్‌నీ ఖాతరు చేయరు. నిఖార్సయిన కాపులు మాత్రమే అనేది వాళ్ల నినాదం. సమాజంలో ఎన్ని కులాలున్నా, ఈసారి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఉన్న కాపుల పాత్ర ప్రధానమైంది. చంద్రబాబు నాయుడనే తలబిరుసు నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ ఇంటికి ఎంతో వినయంగా వెళ్లాడంటే కాపు ఫేక్టర్‌కి ఉన్న విలువ అలాంటిది. అక్కడ పవన్‌ కళ్యాణ్‌ లేకపోతే తెలుగుదేశం లేనట్టే అని విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. చేగొండి హరి రామజోగయ్య కుమారుడు తాజాగా వైసీపీలో జాయిన్‌ అయ్యారు. పెద్ద నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీ వైపే చూస్తున్నారు. జక్కంపూడి గణేష్‌ ముద్రగడ ఇంటికి వెళ్లి మరీ వైసీపీలోకి రావాలని అడిగారు. ఎంపీ మిథున్‌రెడ్డి ఫోన్‌లో ముద్రగడతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడ చిరునవ్వుతో అంగీకరించినట్టే ఉంది.

కాపుల ప్రాధాన్యం ఇలా అమాంతంగా పెరిగిపోయిన కీలక సమయంలో, పవన్‌ కళ్యాణ్‌ సొంత కులం వాళ్లయిన ముద్రగడనీ, హరిరామ జోగయ్యనీ తనవైపు తిప్పుకోలేక పోవడం ఒక వ్యూహాత్మక తప్పిదం. వాళ్లు పాతకాపులే కావొచ్చు. అయినా పేరున్న వాళ్లు. రాజకీయాల్లో పదవుల్లో రాణించిన వాళ్లు. రాష్ట్రంలో కాపులందరికీ తెలిసిన పేర్లు. అయినా పవన్‌ నిర్లక్ష్యం దేనికో అర్థం కాదు.

పవన్‌ కొంత విచిత్రంగా బిహేవ్‌ చేస్తున్నాడు. కాపుల్లో క్రేజ్‌ ఉన్న పెద్ద నటుడు గనక మెజారిటీ కాపులు తనవైపే ఉంటారని పవన్‌ నమ్మడంలో తప్పులేదు. అయితే, పవన్‌ పొద్దున్న లేస్తే చంద్రబాబుని పొగుడుతున్నాడు. లోకేష్‌తో మాట్లాడుతున్నాడు. నాదెండ్ల మనోహర్‌తో మంతనాలు జరుపుతున్నాడు. వాళ్లంతా కోట్లకు పడగలెత్తిన కమ్మవాళ్లని అందరికీ తెలుసు. పైగా పవన్‌ ఏ సభలోనూ వంగవీటి రాధా, రంగా పేర్లు ప్రస్తావించరు. దాసరి నారాయణరావుని సరదాకి కూడా తలుచుకోరు. మిరియాల వెంకట్రావు అనే గౌరవనీయమైన కాపు నాయకుడి పేరు కూడా ఎత్తరు. ఇంకా దరిద్రం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ‘రక్షకుడు’ అని గొంతెత్తి, అరిచి మరీ చెబుతారు. దాంతో కాపులకు అరికాలి మంట నెత్తికెక్కుతుంది, పర్యవసానం..? హరిరామజోగయ్య, ముద్రగడ వంటివారు కుటుంబాలతో సహా జగన్మోహన్‌రెడ్డి పార్టీలో ఆనందంగా జాయిన్‌ అయిపోతున్నారు.

అసలు రాజకీయాలంటేనే దొంగ వేషాలు, దొంగమాటలు, ఉత్తుత్తి హామీలు, మేకపోతు గాంభీర్యాలు. రేపే అధికారంలో వచ్చేస్తున్నాం అని అబద్ధాలు చెప్పడాలు, కులం పేరు వాడుకుని జనాన్ని కూడగట్టే కుయుక్తులు. అలాంటి అతి సహజమైన ఎత్తుగడలేమీ లేకుండా, పవన్‌ ఆవేశపడి, జగన్ని తిట్టి, చంద్రబాబుని కాకాపట్టీ, కాపుల్ని దూరం చేసుకునీ... ఏం పీకుదామని..!

కమ్మవాళ్లతో చేతులు కలిపి ఇప్పటికే కాపులను గాయపరిచి ఉన్నాడు. అంతటితో అయిపోయిందా, నన్ను రెండు చోట్లా ఓడించారు అని కాపులనే నిందించడం మొదలు పెట్టాడు. ఎన్నికలకు ముందు ఇవేం మాటలు..? 24 సీట్లు ఇచ్చినందుకు 24 గంటలూ చంద్రబాబు భజన చేస్తుంటే కాపులకు వైసీసీలో చేరడం తప్ప మరో మార్గం లేదు.

పవన్‌ రక్షకుడు చంద్రబాబు

ప్రజల రక్షకుడు జగన్‌..

అని జనం అనుకుంటే దానికి ఎవర్ని నిందించగలం..? చూస్తుంటే, హరిహర వీరమల్లు రిలీజ్‌కి ముందే అట్టర్‌ ఫ్లాప్‌ అయినట్టు అన్పిస్తోంది కదా..!

First Published:  8 March 2024 3:21 AM GMT
Next Story