Telugu Global
Andhra Pradesh

వీరమహిళలకు అన్యాయం.. టికెట్ అడిగితే నియామక పత్రం

వీర మహిళలకు నియామక పత్రాలు అందజేశారు పవన్ కల్యాణ్. ఈ నియామక పత్రాలతో వారికి ఒరిగేదేంటి..? అనేది అసలు ప్రశ్న.

వీరమహిళలకు అన్యాయం.. టికెట్ అడిగితే నియామక పత్రం
X

జనసేన అసెంబ్లీ టికెట్ల వ్యవహారంలో వీరమహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందనే విషయం తెలిసిందే. జనసేన తరపున కేవలం ఒకే ఒక్క సీటు వీర మహిళలకు కేటాయించారు పవన్ కల్యాణ్. మహిళల హక్కులు, మహిళల స్వయం సమృద్ధి, మహిళా రిజర్వేషన్లు అంటూ ప్రసంగాలు దంచే జనసేనాని, సొంత పార్టీలోని మహిళలకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. ఈ దశలో సడన్ గా వీర మహిళలతో సమావేశమయ్యారు పవన్. ఈ భేటీ దేనికో తెలిస్తే.. ఆయనపై మరింత కోపం రాక మానదు.


ఈమధ్య టీడీపీ టికెట్లు ఆశించి భంగపడిన నేతలకు పార్టీ పదవులిచ్చి సరిపెడుతున్నారు చంద్రబాబు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, జాతీయ ప్రచార కార్యదర్శి.. అంటూ నేరుగా అన్నీ జాతీయ పదవులే ఇచ్చేశారు. అసలా పదవులకి విలువ లేదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబు మాత్రం మసిపూసి మారేడుకాయ చేసి.. జాతీయ పదవులంటూ ఊదరగొట్టారు, కొంతమందికి సర్దిచెప్పారు. ఇప్పుడు పవన్ కూడా అదే బాటలో వెళ్తున్నారు. వీర మహిళలకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ నియామక పత్రాలతో వారికి ఒరిగేదేంటి..? అనేది అసలు ప్రశ్న.

జనసేన తరపున నిరసన కార్యక్రమాలు చేపట్టాం, ఆందోళనల్లో పాల్గొన్నాం, కేసులు పెట్టించుకున్నాం, స్థానికంగా పార్టీని బలోపేతం చేశామంటూ శ్రీకాళహస్తికి చెందిన వినుత కోట వంటి మహిళా నాయకులు తెగ ఇదైపోతున్నారు. టికెట్ పై ఆశతో కష్టపడ్డామని, తీరా 21 సీట్లతో తమకు నిరాశ ఎదురైందని చెబుతున్నారు. అలాంటి వారందర్నీ పవన్ పార్టీ ఆఫీస్ కి పిలిపించారు. నియామకపత్రాలు చేతులో పెట్టి ఫొటోలు దిగారు. ఇక మీరంతా వీర మహిళలు అయిపోయారు పొండి అంటూ పార్టీ తరపున ఓ స్టేట్ మెంట్ విడుదల చేశారు. ప్రజా క్షేత్రంలో వీర మహిళలు చేసిన పోరాటాలు ఎప్పటికీ మరువలేమని, అపజయంలోనూ వెనక్కి తగ్గకుండా గత ఐదేళ్లుగా వీర మహిళలు పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన తీరు గొప్పదని పవన్ వారిని మెచ్చుకోవడం కొసమెరుపు. మొత్తానికి అసెంబ్లీ టికెట్లు అడిగితే పార్టీ పదవులిచ్చి బుజ్జగించడంలో గురువుని మించిన శిష్యుడు అనిపించుకున్నారు పవన్ కల్యాణ్.

First Published:  28 March 2024 5:03 AM GMT
Next Story