Telugu Global
Andhra Pradesh

వైఎస్ఆర్ కుటుంబానికి వెన్నుపోటు ఆయనిదే..!

కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సోనియా గాంధీ కాళ్లకే మొక్కలేదని, అలాంటి తాను కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకుంటానా అని అన్నారు పెద్దిరెడ్డి.

వైఎస్ఆర్ కుటుంబానికి వెన్నుపోటు ఆయనిదే..!
X

ఇప్పటి వరకు వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది చంద్రబాబు ఎపిసోడ్ మాత్రమే. అయితే ఆయనతోపాటు మరొకరు కూడా గుర్తొస్తారని అంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికినన్ని రోజులు ఆయనతో సన్నిహితంగా ఉండి, ఆయన చనిపోగానే.. ఆ కుటుంబానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని చెప్పారు. వైఎస్ జగన్ ను 16 నెలలు జైలులో పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి కాదా ? అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్ ను అరెస్ట్ చేస్తానని, రాష్ట్ర విభజనకు సహకరిస్తానని చెప్పి చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు మంతి పెద్దిరెడ్డి.

కాళ్లు పట్టుకుంది ఎవరు..?

రాజంపేట ప్రచారంలో మాజీ సీఎం కిిరణ్ కుమార్ రెడ్డి.. పెద్దిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డీసీసీ పదవికోసం ఆయన తన కాళ్లు పట్టుకున్నారని చెప్పారు కిరణ్. ఆ వ్యాఖ్యలకు ఈరోజు పెద్దిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు బయటికొచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారంటూ కిరణ్ పై మండిపడ్డారు. తాను కాంగ్రెస్ లో ఉండి సోనియా గాంధీ కాళ్లకే మొక్కలేదని, అలాంటి తాను కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకుంటానా అని అన్నారు. ప్రచారం కోసం కిరణ్ అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. పదవికోసం కాంగ్రెస్ నేతల కాళ్లు పట్టుకుంది కిరణ్ కుమార్ రెడ్డేనని చెప్పారు.

పుట్టపర్తి సాయిబాబా సంపద కూడా కిరణ్ కుమార్ రెడ్డి దోచుకున్నారని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. సత్యసాయి చనిపోతే 10 రోజులపాటు అయన భౌతికకాయాన్ని అక్కడే ఉంచి, ఇంకా బ్రతికే ఉన్నారని ప్రజల్ని నమ్మించి ఆలోగా.. ప్రశాంతి నిలయంలోని సంపద దోచుకున్నారని ఆరోపించారు. తాను పుట్టింది తెలంగాణలోనని, తాను కూడా తెలంగాణ వాడినే అని అసెంబ్లీ సాక్షిగా చెప్పుకున్న కిరణ్, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నారని నిలదీశారు. ఆఖరి బాల్ తనదేనని చెప్పి విభజన సమయంలో ఏపీ ప్రజల్ని మోసం చేసిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి అని అన్నారు. సొంత తమ్ముడే ఆయన్ను ఇక్కడ నుంచి తరిమేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి, నేడు బీజేపీ టికెట్‌పై పోటీ చేయడానికి సిగ్గుండాలని ఎద్దేవా చేశారు పెద్దిరెడ్డి.

First Published:  19 April 2024 11:22 AM GMT
Next Story