Telugu Global
Andhra Pradesh

పెట్టుబడులు, ఉద్యోగాలు.. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏపీ దూకుడు

మేకిన్ ఇండియా కంటే గొప్పగా మేకిన్ ఆంధ్రా ఉత్పత్తులు తమ సత్తా చూపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అమ్ముడయ్యే ప్రతి రెండు ఏసీల్లో ఒకటి మేకిన్ ఆంధ్రా అనేది వాస్తవం.

X

చంద్రబాబుకి ప్రచారం ఎక్కువ, పని తక్కువ. జగన్ ఏపీకోసం చేసిన పని ఎక్కువ, కానీ ఎల్లో మీడియా పుణ్యమా అని దానికి దక్కిన ప్రచారం చాలా తక్కువ. వాస్తవానికి చంద్రబాబు హయాంలో కంటే జగన్ పాలనలోనే ఏపీ పారిశ్రామిక రంగంలో పుంజుకుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఏపీ దూసుకెళ్తోంది. తాజా గణాంకాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.

24 దిగ్గజ కంపెనీలు

రూ.10,705 కోట్ల పెట్టుబడులు..

36,205 మందికి ఉద్యోగాలు..

ఇదీ క్లుప్తంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏపీ ప్రభుత్వం సాధించిన ఘనత. బ్లూస్టార్, డైకిన్, పానాసోనిక్, డిక్సన్, హవెల్స్, సన్నీ ఆప్‌టెక్స్‌ వంటి కంపెనీలు ఏపీలో రూ.10,705 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఆయా కంపెనీల ద్వారా మొత్తం 36,205 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోంది. అందే దాదాపు మరో 50వేలమందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందన్నమాట. ఇక విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో రూ.15,711 కోట్ల విలువైన మరో 23 కీలక ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా 55,140 మందికి నేరుగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

మేకిన్ ఆంధ్రా..

మేకిన్ ఇండియా కంటే గొప్పగా మేకిన్ ఆంధ్రా ఉత్పత్తులు తమ సత్తా చూపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అమ్ముడయ్యే ప్రతి రెండు ఏసీల్లో ఒకటి మేకిన్ ఆంధ్రా అనేది వాస్తవం. తిరుపతి జిల్లా శ్రీసిటీలో జపాన్‌ ఏసీ తయారీ సంస్థ డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్‌ వంటి సంస్థలు భారీ తయారీ యూనిట్లు నెలకొల్పాయి. డైకిన్ సంస్థ ఒక్కటే ఏటా 10లక్షల యూనిట్లను తయారు చేస్తోంది. విస్తరణలో వీటి సంఖ్య 15లక్షలకు చేరుకుంటుంది. దీనికోసం మరో వెయ్యికోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతోంది డైకిన్. బ్లూస్టార్ సంస్థ ఏటా 12 లక్షల యూనిట్లు తయారుచేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది. ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 10,000 మందికి ఉపాధి లభించినట్టయింది.

కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్(EMC) పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే మరిన్ని ఉద్యోగాలు ఏపీ యువతకు లభిస్తాయి. కొప్పర్తిలో రూ.749 కోట్లతో వైఎస్సార్‌ EMCని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రూ.8,910 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 28,250 మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే డిక్సన్‌ వంటి కంపెనీలు కొప్పర్తిలో ఉత్పత్తిని ప్రారంభించాయి.

First Published:  26 March 2024 10:30 AM GMT
Next Story